Share News

రెండు రోజులే గడువు..

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:04 AM

భూముల ధరలు పెరగటానికి మరో రెండు రోజులే సమయం మిగిలి ఉండటంతో గత వారం రోజులుగా రిజిస్ర్టేషన్‌ లావాదేవీలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయి. ముఖ్యంగా ఎనీవేర్‌(ఎక్కడైనా) రిజిస్ర్టేషన్లకు డిమాండ్‌ ఏర్పడింది. దూరబారాన ఉన్న వారు తమ దగ్గర ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్లు చేయించుకునేందుకు ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్లలో ఇటీవల కాలంలో పలు మార్పులు చేశారు.

రెండు రోజులే గడువు..

- 1 నుంచి పెరగనున్న భూముల ధరలు

-ఎనీవేర్‌ డాక్యుమెంట్ల పరిశీలనలో జాప్యం చేస్తున్న సబ్‌ రిజిస్ర్టార్లు

- 48 గంటల వరకు లభించని ఆమోదం

-రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెరుగుతాయని ప్రజల్లో ఆందోళన

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): భూముల ధరలు పెరగటానికి మరో రెండు రోజులే సమయం మిగిలి ఉండటంతో గత వారం రోజులుగా రిజిస్ర్టేషన్‌ లావాదేవీలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయి. ముఖ్యంగా ఎనీవేర్‌(ఎక్కడైనా) రిజిస్ర్టేషన్లకు డిమాండ్‌ ఏర్పడింది. దూరబారాన ఉన్న వారు తమ దగ్గర ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్లు చేయించుకునేందుకు ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్లలో ఇటీవల కాలంలో పలు మార్పులు చేశారు. ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌కు సంబంధించి దరఖాస్తు వచ్చినపుడు దాని మాతృక ఎక్కడో అక్కడి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వెళుతుంది. గంటలోపు అక్కడి సబ్‌ రిజిస్ర్టార్‌ దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ డాక్యుమెంట్‌ను పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఓకే చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం 48 గంటల సమయం ఇచ్చారు. దీంతో ఎనీవేర్‌ కింద పెట్టుకున్న డాక్యుమెంట్స్‌ విషయంలో సబ్‌రిజిస్ర్టార్లు 48 గంటల సమయం ఉంది కదా అని తాత్సారం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఇబ్బంది పెద్దగా ఎవరికీ తెలియలేదు. బహిర్గతం కూడా కాలేదు. ప్రస్తుతం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల ధరలు పెంచుతున్న నేపథ్యంలో రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెరుగుతాయన్న ఉద్దేశంతో లావాదేవీలు ఒక్కసారిగా పెరిగాయి. ఇలా పెరిగిన రిజిస్ర్టేషన్లలో చాలా వరకు ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్లు ఉన్నాయి. త్వరగా లావాదేవీలు అవుతాయన్న కారణంతో ఎక్కువ మంది ఎనీవేర్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నారు. ఎనీవేర్‌లో వచ్చిన డాక్యుమెంట్లను సబ్‌రిజిస్ర్టార్లు పక్కన పెట్టేస్తున్నారు. వాస్తవానికి 48 గంటల వరకు పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. గంట కాకపోతే రెండు గంటల్లో అయినా పరిశీలించి ఒకే చేయవచ్చు. అభ్యంతరాలుంటే తిరస్కరించవచ్చు. సబ్‌ రిజిస్ర్టార్లు ఈ పని చేయకపోవటం వల్ల సమస్య ఏర్పడుతోంది. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ, కంచికచర్ల, మైలవరం, తిరువూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌ కేటగిరీలో వచ్చిన డాక్యుమెంట్లపై తీవ్ర జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే తిరస్కరిస్తే సరిదిద్దుకుని మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నలభై ఎనిమిది గంటల జాప్యం వల్ల ఫిబ్రవరి 1వ తేదీ వచ్చేస్తే అధిక ధరలతో రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 01:04 AM