Share News

Insian Student Sreekavya: అమెరికాలో అదరగొట్టిన తెలుగమ్మాయి

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:29 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన చావలి శ్రీకావ్య అమెరికాలో అదరగొట్టారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సియాటిల్‌లోని ఫోస్టర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి...

Insian Student Sreekavya: అమెరికాలో అదరగొట్టిన తెలుగమ్మాయి

  • ఫోస్టర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో టాపర్‌గా శ్రీకావ్య

  • ‘మాస్టర్‌ ఆఫ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌’లో డిగ్రీ

అమలాపురం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన చావలి శ్రీకావ్య అమెరికాలో అదరగొట్టారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన సియాటిల్‌లోని ఫోస్టర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి అత్యంత పర్సెంటైల్‌ గల 20 మంది విద్యార్థుల్లో టాపర్‌గా నిలిచి ‘మాస్టర్‌ ఆఫ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌’ డిగ్రీని అందుకున్నారు. స్థానికంగా శనివారం జరిగిన స్నాతకోత్సవంలో డీన్‌ ఫ్రాంక్‌హజ్‌ ఆమెకు ‘మాస్టర్‌ ఆఫ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌’ డిగ్రీని ప్రదానం చేశారు. అమలాపురానికి చెందిన కోనసీమ సైన్స్‌ పరిషత్‌ వ్యవస్థాపకుడు, అధ్యాపకుడు సీవీ సర్వేశ్వరశర్మ దంపతుల కుమారుడు చావలి ఎన్‌ఎస్‌ సూర్య కుమార్తే కావ్య. ఆమె ఈ ఘనత సాధించడంతో వారి ఇంట ఆనందానికి అవధుల్లేవు. 1993లో సూర్య-రమాదేవి దంపతులకు జన్మించిన కావ్య ఇప్పటికే నాలుగు పోస్టుగ్రాడ్యుయేట్‌ డిగ్రీలు సాధించారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ నుంచి ఎంటెక్‌, స్వీడన్‌లోని బ్లెకింజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి టెలీకమ్యూనికేషన్‌ టెక్నాలజీలో ఎమ్మెస్‌, కేరళలోని కోజికోడ్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఎంబీఏ చేశారు. క్రీడల్లో కూడా ఆమె ప్రతిభ కనబర్చారు. ఎయిర్‌ రైఫిల్‌ షూటర్‌గా ఆమె గతంలో జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. అమెజాన్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్‌ అనే వ్యక్తిని కావ్య వివాహం చేసుకుని ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె తండ్రి సూర్య కూడా ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడ్డారు. కావ్య ఫోస్టర్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో సీటు సంపాదించడమే కాకుండా టాపర్‌గా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తాత, సైన్స్‌ పరిషత్‌ అధ్యక్షుడు సీవీ సర్వేశ్వరశర్మ అన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 05:31 AM