Telugu NRI: ఆదుకున్న చేయే.. ఆపదలో
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:53 AM
ఒకప్పుడు డబ్బు, దర్పంతో దుబాయిలో దర్జాగా గడిపిన కడప జిల్లాకు చెందిన తెలుగు వ్యాపారి.. వ్యాపారంలో నష్టాలతో ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు.
దుబాయిలో తెలుగు వ్యాపారి దైన్యం
వ్యాపారంలో నష్టాలతో పీకల్లోతు కష్టాలు
కోర్టు కేసులతో ఇండియాకు రాలేని దుస్థితి
పక్షవాతంతో ఆస్పత్రికే పరిమితమైన కడప జిల్లా వాసి
ఇండియాకు వెళ్లే మార్గంలేక కన్నీరుమున్నీరు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఒకప్పుడు డబ్బు, దర్పంతో దుబాయిలో దర్జాగా గడిపిన కడప జిల్లాకు చెందిన తెలుగు వ్యాపారి.. వ్యాపారంలో నష్టాలతో ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు. వందలాది మందికి దుబాయిలో ఉపాధి అవకాశాలు చూపిన ఆయన.. నేడు పరిస్థితులు ప్రతికూలించి ఆశల సౌధలన్నీ కుప్పకూలగా.. పక్షవాతంతో ఆస్పత్రి మంచానికే పరిమితమయ్యారు. కోర్టు కేసుల కారణంగా స్వదేశానికి కూడా రాలేని తన దయనీయ స్థితిపై కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాలివీ.. కడప జిల్లా కమలాపురానికి చెందిన 46 ఏళ్ల సి.దామోదర్‌రెడ్డి మొదట్లో యూఏఈలో ఉద్యోగం చేసే వారు. తర్వాత సొంతంగా అనేక వ్యాపారాలు ప్రారంభించారు. తన ప్రాంతానికి చెందిన సుమారు 400 మందికి దుబాయి, షార్జా తదితర ప్రాంతాల్లో మంచి మంచి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ క్రమంలో దామోదర్‌రెడ్డి షార్జాలో ఒక డయాగ్నోస్ సెంటర్‌ను ప్రారంభించి వివాదంలో ఇరుక్కుని నష్టాలను చవిచూశారు. ఇతర వ్యాపారాల్లోనూ అనుకోకుండా నష్టాలు రావడంతో అప్పులపాలయ్యారు. భవనాల అద్దె కోట్లలో పేరుకుపోవడంతో వాటి యజమానులు దామోదర్ రెడ్డిపై కేసులు వేశారు. దీంతో అప్పులు తీర్చాలని కోర్టు ఆదేశిస్తూ.. అప్పులు చెల్లించేవరకు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్ష విధించింది. ఆయన కుటుంబ సభ్యులంతా ఇండియాలో ఉండగా, ఆయన ఇక్కడ ఒంటరిగా మిగిలారు. ఒక వైపు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ, మరోవైపు స్వదేశానికి తిరిగి వెళ్లే అవకాశం లేక మానసికంగా కుంగిపోయిన దామోదర్‌కు పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. కుడి చేయి, కాలు పని చేయక, నిస్సహాయ స్థితిలో నాలుగు నెలలుగా దుబాయిలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పలకరించేవారు కూడా లేకపోవడంతో స్వదేశానికి వెళ్లి చికిత్స చేయించుకోంటానని దామోదర్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నా ఆయనపై నిషేధం ఉండడంతో ఆయన కోరిక నెరవేరడంలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News