ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్, వీఆర్వో
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:01 AM
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ జాహ్నవి లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. పాసు పుస్తకాలకు సంబంధించి ఒక కౌలు రైతు నుంచి లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారింది.

- రూ. 30 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా..
- ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఘటన
కంచికచర్ల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ జాహ్నవి లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. పాసు పుస్తకాలకు సంబంధించి ఒక కౌలు రైతు నుంచి లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. మండలంలోని నక్కలంపేటకు చెందిన కౌలు రైతు మాగంటి కోటేశ్వరరావు తన యజమాని పొలం వన్‌బీ అడంగల్‌లో నమోదు చేసి, పట్టాదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసి, కొద్ది రోజుల క్రితం రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. పాసుపుస్తకం కోసం తహసీల్దార్ జాహ్నవి, వీఆర్‌వో రామారావు లక్ష రూపాయలకు పైగా నగదు డిమాండ్ చేశారు. పెద్దమొత్తం కావటంతో అంత ఇవ్వలేనని చెప్పటంతో చర్చల అనంతరం పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రూ. 30 వేలకు అంగీకరించారు. దీంతో సదరు కౌలు రైతు విజయవాడ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం రాత్రి విజయవాడ నుంచి ఇక్కడ వచ్చిన ఏసీబీ అధికారులు ఒక పథకం ప్రకారం వల పన్నారు. కౌలు రైతు మాగంటి కోటేశ్వరరావు రాత్రి రెవెన్యూ కార్యాలయంకు వచ్చి వీఆర్‌వో రామారావు, తహసీల్దార్ జాహ్నవికి రూ. 30 వేలు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ విజయవాడ రేంజ్ ఇన్‌చార్జి డీఎస్‌పీ ఎం.కిషోర్‌కుమార్, సీఐలు సత్యనారాయణ, సురేష్ రెడ్‌హ్యాండెడ్‌గా తహసీల్దార్ జాహ్నవి, వీఆర్‌వో రామారావును పట్టుకున్నారు. వారి నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత రికార్డులను పరిశీలించి, తహసీల్దార్, వీఆర్‌ఓను అదుపులోకి తీసుకున్నారు. గతంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన తనయుడు అగ్రిగోల్డ్ భూములు అక్రమ రిజిసే్ట్రషన్ కేసులో కూడా అప్పట్లో విజయవాడ రూరల్ తహసీల్దార్‌గా ఉన్న జాహ్నవిపై కేసు నమోదు కావటం గమనార్హం.