AP Sets Summer Only Rule for Teacher Transfers: ఇక వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:13 AM
ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం-2025 ఈ నెల 9 నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఉపాధ్యాయ బదిలీలు ఏటా వేసవి సెలవుల్లో మాత్రమే జరగనున్నాయి.

అమల్లోకి వచ్చిన ఉపాధ్యాయ బదిలీల చట్టం
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం-2025 అమల్లోకి వచ్చింది. ఈ నెల 9 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇకపై చట్టంలోని నిబంధనల ప్రకారం మాత్రమే ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతాయి. ఏటా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు చేస్తారు. గతంలో ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో బదిలీలు జరిగేవి. దానికి నిర్దేశిత సమయం లేకపోవడంతో న్యాయ వివాదాలు ఏర్పడి ప్రతిసారీ వాయిదాలు పడుతూ ఆలస్యం జరిగేది. అలాంటి గందరగోళ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం టీచర్ల బదిలీల అంశంపై చట్టం చేసింది. దీంతో న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా బదిలీలు జరిగే అవకాశం ఏర్పడింది. ఈ ఏడాది మే నెలలో టీచర్ల బదిలీలు జరుగుతాయి. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు విడుదల చేసింది.