గుడివాడలో.. టీ ట్యాక్స్!
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:57 AM
గుడివాడలో అన్నింటికీ టీ ట్యాక్స్ చెల్లించాల్సిందే. టీ ట్యాక్స్ అంటే తులసి ట్యాక్స్. తులసి అంటే ఒక చట్టవ్యతిరేక శక్తి. గుడివాడలో తులసి దళం చేసిన అకృత్యాలు అన్నీ, ఇన్నీ కావు. మద్యం, ఇసుక, రేషన్ బియ్యం, కాంట్రాక్టుల సిండికేట్లన్నీ తులసి దళం గుప్పెట్లోనే. బినామీలతో మద్యం దుకాణాలు, రైతు బజార్లలో దదాగిరీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ప్రశ్నిస్తే సొంత పార్టీ వారైనా సరే .. అసభ్యకర ట్రోలింగ్స్‌తో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వంటి వికృతక్రీడలతో పాటు..ప్రశ్నించే గొంతుకలపై వేధింపులు, దాడులకు పాల్పడటం ఇలా చెప్పాలంటే తులసిదళం అరాచకాలెన్నో. రాజ్యాంగేతర శక్తిగా మారిన తులసి దళం అరాచకాలపై ప్రత్యేక కథనం..

- తవ్వినకొద్దీ తులసి దళం అరాచకాలు వెలుగులోకి..
- ఇసుక , బుసక, మట్టి, గ్రావెల్ తోలాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే!
- రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పనులు ఇలా ఏ పనైనా సరే వాటాలు ఇవ్వాల్సిందే..
- మద్యం, రేషన్ మాఫియా సిండికేట్లతో అవినీతి సామ్రాజ్యం
- యథేచ్ఛగా అరాచకాలు.. ప్రశ్నిస్తే దాడులు
గుడివాడలో అన్నింటికీ టీ ట్యాక్స్ చెల్లించాల్సిందే. టీ ట్యాక్స్ అంటే తులసి ట్యాక్స్. తులసి అంటే ఒక చట్టవ్యతిరేక శక్తి. గుడివాడలో తులసి దళం చేసిన అకృత్యాలు అన్నీ, ఇన్నీ కావు. మద్యం, ఇసుక, రేషన్ బియ్యం, కాంట్రాక్టుల సిండికేట్లన్నీ తులసి దళం గుప్పెట్లోనే. బినామీలతో మద్యం దుకాణాలు, రైతు బజార్లలో దదాగిరీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ప్రశ్నిస్తే సొంత పార్టీ వారైనా సరే .. అసభ్యకర ట్రోలింగ్స్‌తో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వంటి వికృతక్రీడలతో పాటు..ప్రశ్నించే గొంతుకలపై వేధింపులు, దాడులకు పాల్పడటం ఇలా చెప్పాలంటే తులసిదళం అరాచకాలెన్నో. రాజ్యాంగేతర శక్తిగా మారిన తులసి దళం అరాచకాలపై ప్రత్యేక కథనం..
(ఆంధ్రజ్యోతి-గుడివాడ):
కామేపల్లి తులసిబాబు. గుడివాడలో ఈ పేరు తెలియని వారు లేరు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానూ తులసిబాబు గురించి చర్చ నడుస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ-6గా రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబు ఏడు నెలల్లో గుడివాడ నియోజకవర్గ ప్రజలను ఏడు చెరువుల నీళ్లు తాగించాడు. గుడివాడలో తులసి దళం సాగించిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. అసాంఘిక శక్తులు, రౌడీ గ్యాంగులను వెంటేసుకుని సెటిల్‌మెంట్లు, దందాలతో తులసి దళం రెచ్చిపోయింది. మద్యం సిండికేట్ పేరుతో బెదిరింపులు, బినామీలతో మద్యం దుకాణాల ఏర్పాటు, అక్రమ మట్టి తరలింపు, ఇసుక దొంగతనం, రైతు బజారులో దందా, రేషన్ బియ్యంలో కమీషన్లు, ఆజ్ఞలను అతిక్రమిస్తే సొంత పార్టీ వారిని సైతం వదలకుండా వ్యక్తిత్వహననానికి పాల్పడటం వంటి వాటితో పాటు గుడివాడ నియోజకవర్గంలో టి ట్యాక్స్‌ను అమలు చేస్తున్నాడు.
- తులసి ట్యాక్స్ అమలు ఇలా :
- గుడివాడ మండలంలో రహదారుల నిర్మాణ పనుల్లో తులసి ట్యాక్స్‌ను అమలు చేశారు. ముఖ్యంగా కాంట్రాక్టర్ ఎవరైనా కప్పం కట్టాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు. బిల్లును బట్టి లక్షల్లో ట్యాక్స్‌ను వసూలు చేశారు. ఇటీవల ఒక రహదారి నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించి, వచ్చిన బిల్లులో తన కమీషన్‌గా రూ.2లక్షల టీ ట్యాక్స్‌ను వసూలు చేశారు.
- టిడ్కో కాలనీలో ఎవరైనా వ్యాపారాలు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా తులసి ట్యాక్స్ చెల్లించాల్సిందే. వ్యాపారాన్ని బట్టి రూ.5వేలు నుంచి రూ.20వేలు వరకు చెల్లించాలి. ఆజ్ఞలను పాటించని వారిపైకి మున్సిపల్ అధికారులను పంపి షాపులను సీజ్ చేయిస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.
-ఎండ బాలయ్య అనే వ్యక్తి కిందటి వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ మండలం బొమ్ములూరు దగ్గర వ్యాపార నిమిత్తం వైసీపీ నాయకుడి స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. ఎన్నికల కోడ్ రాకమునుపే భారీ స్థాయిలో ఇసుకను డంప్ చేసుకున్నాడు. తులసి దళం రంగప్రవేశం చేసి టీ ట్యాక్స్ చెల్లించాలని లేకపోతే 12 లారీల ఇసుకను కప్పంగా చెల్లించాలని హుకుం జారీ చేసింది. సీజ్‌లో ఉన్న డంప్‌కు యజమాని ద్వారానే తాళాలు తీయించి 200 టన్నుల ఇసుకను తరలించుకుపోయినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
- ఒక విద్యాసంస్థ అధినేతతో కలిసి నియోజకవర్గంలోని ప్రైవేటు విద్యాసంస్థల స్థాయిని బట్టి ట్యాక్స్ వసూలు చేసినట్లు సమాచారం. ప్రముఖ విద్యాసంస్థపైన ఇదే విధంగా తులసిదళం బెదిరింపులకు పాల్పడింది. విద్యాసంస్థల అధినేత రాష్ట్ర మంత్రి ఒకరి దృష్టికి తీసుకువెళ్లగా వివాదం సదుమణిగింది.
-నియోజకవర్గంలో ఇసుక, బుసక లారీల లావాదేవీలు నెరపాలంటే కప్పం చెల్లించాల్సిందే. బుసక లారీకి రూ.500, ఇసుక లారీకి రూ.1000 కప్పం కట్టాల్సిందే. లేని పక్షంలో పోలీస్, రవాణా అధికారులను పంపి లారీలను సీజ్ చేయించారన్న ఫిర్యాదులు ఉన్నాయి.
- బిల్డర్లు ఎవరైన సరే స్క్వేర్ ఫీట్‌కు కొంత మొత్తంగా ట్యాక్స్ చెల్లిస్తేనే నిర్మాణ పనులు చేపట్టాలి.
- నియోజకవర్గంలో బెల్టు షాపు పెట్టుకోవాలంటే రూ.5వేలు రుసుంగా చెల్లించాలి. నెలనెలా కప్పం కట్టి వ్యాపారం చేసుకోవాలి. నియోజకవర్గ వ్యాప్తంగా అధికారికంగానే 150 బెల్టు షాపులు నడుస్తున్నట్లు సమాచారం.
కాదు కూడదంటే కార్యాలయానికి రావాల్సిందే!
ఎవరైన తులసి చెప్పిన పని చేయకున్న, చెప్పిన మొత్తాన్ని ట్యాక్స్‌గా చెల్లించకున్న గుడివాడ బైపాస్ రోడ్డులోని ఆయన వ్యక్తిగత కార్యాలయంలో తన ఎదుట హాజరు కావాల్సిందే. ఇక్కడి నుంచే హెచ్చరికలు, దందాలు, సెటిల్‌మెంట్లు నడిచాయి. ఇరిగేషన్, డ్రైనేజీ విభాగాలకు సంబంధించిన పనుల్లో తన కమీషన్ తేలకపోవడంతో టెండర్లనే నిలుపుదల చేయించినట్లు సొంత పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో పనుల తాలుకు టెండర్లు తెరవగా, ఒత్తిడి తట్టుకోలేక గుడివాడ నియోజకవర్గ పరిధిలోని టెండర్లను అధికారులు రద్దు చేశారు. మద్యం టెండర్ల విషయంలో కూడా తాను చెప్పిన వారే టెండర్లు వేయాలని, టెండర్లు వేసేందుకు వచ్చిన కొందరిపై తులసి తన దళాన్ని ఉపిగొల్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
-ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా రూ.1.36 కోట్ల వ్యయంతో ఫిల్టర్ బెడ్ రిపేర్లను స్థానిక నాయకుడి పేరు పెట్టి గుంటూరుకు చెందిన తన వర్గీయులతో కాంట్రాక్టు పనులు చేయించినట్లు కూటమి నాయకులు బాహాటంగా విమర్శిస్తున్నారు.
- తోట్లవల్లూరులోని ఒక ఇసుక రీచ్‌ని తన వశం చేసుకుని తన బౌన్సర్‌లను పెట్టి మరీ ఇసుకను తరలించుకుపోయినట్లు సమాచారం.
- మాట వినడం లేదని రైతు బజారు ఎస్టేట్ అధికారిపై తన అనుచరుడుతో దాడి చేయించి, స్టాల్స్‌ను అమ్ముకున్నట్లు తెలిసింది.
-మార్కెట్ యార్డులో గత ప్రభుత్వ హయాంలో నిల్వ చేసిన ప్రభుత్వ ఇసుకను సైతం తులసి దళం వదల్లేదు. లారీలతో, ట్రాక్టర్లతో తరలించుకుపోయి అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. తాము చెప్పింది వినకుంటే సొంత పార్టీ అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోలింగ్ చేయించిన ఘనత తులసిదళానికే దక్కుతుంది.