Share News

CM Chandrababu Naidu: పార్టీకి ధర్మకర్తనే

ABN , Publish Date - May 29 , 2025 | 04:38 AM

టీడీపీ కార్యకర్తే అధినేత అని పేర్కొన్న చంద్రబాబు, లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు పార్టీ భవిష్యత్తును మార్చనున్నాయని తెలిపారు. 2047 నాటికి తెలుగుజాతిని ప్రపంచంలో నం.1గా తీర్చిదిద్దే లక్ష్యంతో 40 ఏళ్ల రోడ్‌మ్యాప్‌ సిద్ధమయ్యిందన్నారు.

CM Chandrababu Naidu: పార్టీకి ధర్మకర్తనే

ఎన్టీఆర్‌ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం

భావి నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నాం

సీఎం చంద్రబాబు

(మహానాడు ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీకి తాను ధర్మకర్తను మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ ఇచ్చిన వారసత్వాన్ని కాపాడుకుంటూ.. మళ్లీ భవిష్యత్‌ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ‘పార్టీ చిరస్థాయిగా ఉండాలి. తెలుగు కుటుంబం నం.1 కావాలి. అది జరగాలంటే లోకేశ్‌ ప్రతిపాదించిన ఆరు శాసనాల్లో కార్యకర్తే అధినేత అనేది చాలా కీలకాంశం’ అని చెప్పారు. ఈ ఆరు శాసనాలూ తెలుగువారి చరిత్ర తిరగ రాయబోతున్నాయన్నారు. మహానాడు రెండో రోజు ఆరు శాసనాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. 2047 నాటికి తెలుగుజాతిని ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ చేయాలన్నదే సంకల్పమని, దీనికోసం రాబోయే 40 ఏళ్లకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్నామని తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో పార్టీ పెట్టారని... ఆ మూల సిద్ధాంతం స్ఫూర్తితో మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో, పాలనా విధానాల్లో నూతనత్వం కోసం ఆరు శాసనాలను తీసుకొచ్చామని చెప్పారు. ‘పాత తరం విలువలు.. కొత్త తరం ఆలోచనలు, అవసరాలు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో ఆరు శాసనాలను లోకేశ్‌ ప్రతిపాదించారు. తెలుగు జాతిని ప్రపంచంలో నంబర్‌ వన్‌ చేయడానికి రోడ్‌ మ్యాపే ఆ శాసనాలు. పార్టీ, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వాటిని ప్రవేశపెట్టిన లోకేశ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

ghl.jpg

సాధారణంగా జరిగే మహానాడును నూతనంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన శాసనాలు దోహదపడ్డాయి. ఆయన బాగా చదువుకున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు’ అని తెలిపారు. జూన్‌ 12న తల్లికి వందనం కింద రూ.15వేలు చొప్పున ఇస్తామని.. ఆగస్టు 15నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే...


నేతలూ జాగ్రత్త..

నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. కానీ వివేకానందరెడ్డి హత్య విషయంలో నన్నే మోసం చేశారు. తెల్లారి ఆ సాక్షి పేపర్‌, టీవీలో గుండెపోటు అని ప్రచారం చేశారు. అందరితోపాటు నేనూ నమ్మాను. సాయంత్రానికి మలుపులే మలుపులు. ఏమీ జరగనట్లు కథ అల్లారు. రెండో రోజున నారాసుర రక్త చరిత్ర అంటూ నాపై నెపం వేశారు. కరుడు కట్టిన నేరస్థులతో రాజకీయం చేస్తున్నాం. కనుక అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. నేరస్థులూ ఖబడ్దార్‌.. కొందరు మన దగ్గర ఉండి ప్రత్యర్థులకు కోవర్టులుగా పనిచేస్తూ వారి ప్రోత్సాహంతో హత్యారాజకీయాలు చేస్తున్నారు. మన వేలితో మన కన్నే పొడుస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. వలస పక్షులు వస్తాయ్‌.. పోతాయ్‌. నిజమైన కార్యకర్త నిలిచి ఉంటాడు. మన కార్యకర్తలు కూడా తప్పుడు పనులు చేస్తే ఉపేక్షించను.

కార్యకర్తలు మెచ్చిన నేతలకే పదవులు..

టీడీపీలో కొత్త తరహా పరిపాలనకు శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు గ్రామ శాఖ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖలు ఉంటే.. ఇప్పుడు క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ విధానం తీసుకొచ్చాం. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నాం. కార్యకర్తలు, ప్రజలు ఎవరిని మెచ్చితే అలాంటి నేతలకే పదవులు అప్పగిస్తున్నాం. 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుంటే దానికి కారణం కార్యకర్తల త్యాగాలే. వారి సంక్షేమం కోసం పనిచేస్తాం. పార్టీ మీకు అండగా ఉంటుంది. వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌లో మనవారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాను. రాజకీయ, పాలనా అంశాల్లో రాష్ట్రం ఫస్ట్‌. పార్టీ విషయంలో కార్యకర్తే ఫస్ట్‌. కార్యకర్తే అధినేత. ప్రాంతీయ పార్టీగా పుట్టిన టీడీపీలో సభ్యత్వాల సంఖ్య నేడు కోటికి చేరింది. ఇదీ మన బలం. తొలిసారి అసెంబ్లీకి వచ్చిన వాళ్లు మన పార్టీ నుంచి 61 (65 మందికి టికెట్లు ఇచ్చాం) మంది ఉన్నారు. యువతకు అవకాశం ఇచ్చాం. మరో 40 ఏళ్లు తిరుగులేని శక్తిగా తెలుగువారికి సేవ చేయడానికి కొత్త నాయకత్వాన్ని తెచ్చాం.


6 శాసనాలే శిరోధార్యం

లోకేశ్‌ తీసుకొచ్చిన 6 శాసనాలు మనకు శిరోధార్యం కావాలి. అందులో సోషల్‌ ఇంజనీరింగ్‌ ఒకటి. కులగణన ద్వారానే ఇది సాధ్యం. కేంద్రం కూడా కులగణన చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రధాని మోదీకి మహానాడు వేదికగా ధన్యవాదాలు. పీ-4 వంటి విధానాలతో అట్టడుగు వర్గాలను ఆదుకుంటున్నాం. ఎవరైనా మహిళల జోలికొస్తే అదే వారికి చివరి రోజవుతుంది. రాజకీయ, సోషల్‌ మీడియా ముసుగులో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే వదిలేది లేదు. చాలా కఠినచర్యలు ఉంటాయి. 2024 ఎన్నికల్లో టీడీపీలో 22 మంది మహిళలకు సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. ఇక్కడే కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఉన్నారు. ఆమెను ప్రత్యర్థులు తక్కువ అంచనా వేశారు. ఫలితం వాళ్లే చూశారు. ఇదీ మహిళా శక్తి.

మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్థి పార్టీ అనేక పన్నాగాలు పన్నుతోంది.

తెలుగుదేశం ముసుగేసుకుని తప్పులు చేస్తే ముసుగు తొలగిస్తాం.

ఏం చేయాలో అది చేస్తాం.

అవకాశవాదుల విషయంలో పార్టీ నేతలే కాదు.. కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల తర్వాత వచ్చే వారిని ప్రోత్సహించవద్దు. మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారిని పార్టీలోకి తీసుకోవద్దు. మహానాడు వేదికగా నాయకులకు ఇదే నా గట్టి సూచన.

నాలెడ్జ్‌, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కలిగిన యువత ప్రపంచ విజయాలను సాధిస్తోందనేది నా నమ్మకం. ఇది సీబీఎన్‌ కోట్‌. అందరూ గుర్తుపెట్టుకోండి. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుజాతి కోసం ఇదే గడ్డపై పుట్టి రుణం తీర్చుకుంటా.


రైతు సంక్షేమం మా ప్రాధాన్యం

టీడీపీ మూల సిద్ధాంతంలోనే రైతు సంక్షేమం ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. యాంత్రీకరణ, రుణాలు, సబ్సిడీలు, మట్టిపరీక్షల ద్వారా రైతుకు సాయంగా నిలిచాం. 30ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్‌ నుంచి డిరప్‌, తుంపర్ల సేద్య పద్ధతులను తీసుకొచ్చాం. ఈరోజు సీమలో డ్రిప్‌ లేని ప్రాంతం లేదు. తెలుగు రైతుకు గుర్తింపు తెచ్చేలా ఆగ్రిటెక్‌ పాలసీ అమలు చేస్తాం. ఏజెన్సీలో గిరిజన ఉత్పత్తులు కాఫీ, కోస్తాలో ఆక్వా, రాయలసీమలో హార్టీకల్చర్‌తో రైతుల జీవితాలు మారుస్తాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, పోలవరం పూర్తి చేస్తాం. జూన్‌ 12న ప్రతి రైతుకు అన్నదాతా సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు అందించబోతున్నాం

యువతకు అవకాశాలు

యువశక్తి మన బలం. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అందుకే యువగళం దశదిశలా మార్మోగేలా చేయాలని టీడీపీ సంకల్పం తీసుకుంది. గత ప్రభుత్వంలో యువత ఉద్యోగాలు అడిగితే గంజాయి, డ్రగ్స్‌ ఇచ్చారు. వాళ్ల జీవితాలు నాశనం చేసి, భవిష్యత్‌ లేకుండా చేశారు. దూసుకెళ్లే యువతరానికి మార్గనిర్దేశం చేసి, వారిద్వారానే మంచి సమాజాన్ని నిర్మించాలనేది నా ఆలోచన. నన్ను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు 70 దేశాల్లో ర్యాలీలు చేశారు. వీరంతా నేను ప్రారంభించిన ఐటీ ఉద్యమంతో ఫలితాలు పొందిన వాళ్లు. ఇప్పుడు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ డేటా, టెక్నాలజీ వంటి గ్లోబల్‌ నాలెడ్జ్‌ అందుబాటులో ఉంది. వీటిద్వారా ఆకాశమే హద్దు. హార్డ్‌వర్క్‌ అవసరం లేదు. స్మార్ట్‌ వర్క్‌ చేయవచ్చు. థింక్‌ గ్లోబల్లీ.. యాక్ట్‌ గ్లోబల్లీ. నాలెడ్జ్‌ ఎకానమీలో ఏపీని గ్లోబల్‌ సర్వీసె్‌సకు హబ్‌గా మారుస్తాం. క్రియేటివ్‌ ఎకానమీ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతాం. 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. మెగా డీఎస్సీ ద్వారా టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 03:07 PM