Share News

TDP: మహానాడు నిర్వహణపై నేడు నిర్ణయం

ABN , Publish Date - May 14 , 2025 | 05:22 AM

టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ బుధవారం మధ్యాహ్నం జరుగుతుంది, దీనిలో ముఖ్యంగా మహానాడు వేడుకల నిర్వహణ, పార్టీ సంస్కరణలు, 2019-24 మధ్య పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత తదితర అంశాలు చర్చకు రానున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావంతో వేడుకల వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

TDP: మహానాడు నిర్వహణపై నేడు నిర్ణయం

కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్న టీడీపీ పొలిట్‌ బ్యూరో

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ భేటీకి పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించతలపెట్టిన మహానాడుపై ప్రధానంగా చర్చ జరగనుంది. గతేడాది ఎన్నికల షెడ్యూల్‌ కారణంగా దీనిని నిర్వహించలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ ఏడాది భారీగా జరపాలని భావించారు. అయితే పహల్గాంలో ఉగ్రవాదుల దాడి.. దానికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కారణంగా నిన్నమొన్నటివరకు దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మహానాడు వేడుకలు మూడ్రోజులు నిర్వహించాలా లేక రెండ్రోజులకు కుదించాలా అన్న అంశంపై పొలిట్‌బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు చేపట్టాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పదే పదే కోరుతున్నారు. దీనిపై పొలిట్‌బ్యూరోలో చర్చించనున్నారు. జగన్‌ హయాంలో 2019-24 మధ్య టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత అంశం సైతం చర్చకు వస్తుందని అంటున్నారు. కాగా, ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజాదర్బార్‌ నిర్వహణ సరిగా లేదని టీడీపీ భావిస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్లు ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణతోపాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించనుంది. దీని కోసం విధివిధానాలను పొలిట్‌బ్యూరో ఖరారు చేయనుంది. బుధవారంనాటి భేటీలో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి, పాకిస్థాన్‌ దాడిలో అమరులైన జవాన్లకు.. ఇటీవల మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకూ సంతాపం తెలుపనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:22 AM