Share News

TDP : తప్పు చేస్తే.. సదాశివాన్ని తీసేయండి

ABN , Publish Date - Jan 31 , 2025 | 05:33 AM

నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ అధ్యక్షుడు సదాశివం తప్పు చేసి ఉంటే అతనిని ఆ పదవి నుంచి తొలగిస్తే మంచిదని తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ అధిష్ఠానానికి సూచించినట్లు సమాచారం. ఈ

TDP : తప్పు చేస్తే.. సదాశివాన్ని తీసేయండి

పార్టీ అధిష్ఠానానికి టీడీపీ వ్యూహ కమిటీ సూచన

నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ కార్యక్రమం వివాదంపై చర్చ

అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ అధ్యక్షుడు సదాశివం తప్పు చేసి ఉంటే అతనిని ఆ పదవి నుంచి తొలగిస్తే మంచిదని తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ అధిష్ఠానానికి సూచించినట్లు సమాచారం. ఈ ఫెడరేషన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి రవీంద్రనాథ్‌బాబును ఆహ్వానించడంపై మంత్రి కొల్లు రవీంద్ర బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. కేసులతో తనను వేధించిన వ్యక్తిని పిలిచి వేదికపై కూర్చోబెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం గురువారం జరిగిన ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. ‘మంత్రి బహిరంగంగా తన బాధను వ్యక్తం చేయడం పెద్ద విషయం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. టీడీపీ వారిని వేధించినట్లు ఆరోపణలు ఉన్న వ్యక్తిని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరు పిలిచారో తేల్చాలి. రవీంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ హత్య కేసులో ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అటువంటి వ్యక్తిని కార్యక్రమానికి ఎలా పిలుస్తారు? ఇందులో నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ చైర్మన్‌ సదాశివం పాత్ర ఉంటే, అతనిని ఆ పదవి నుంచి తొలగించడం మంచిది. ఒకసారి గట్టి చర్య తీసుకొంటే పార్టీలో మిగిలిన వారంతా అప్రమత్తంగా ఉంటారు. నూజివీడులో ఒక కార్యక్రమానికి వైసీపీ నేత జోగి రమేశ్‌ను పిలవడంపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇవి పదే పదే జరక్కుండా చూసుకోవాలంటే ఒక షాక్‌ తప్పనిసరి’ అని ఈ సమావేశం అభిప్రాయపడింది. తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని పార్టీ కార్యక్రమాల కమిటీని అధిష్ఠానం కోరినట్లు సమాచారం. రిటైర్డ్‌ పోలీస్‌ అధికారిని ఎవరూ పిలవలేదని, తానే వచ్చి వేదికపై కూర్చున్నాడని నిర్వాహకులు పార్టీ నాయకత్వానికి సంజాయిషీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ సంజాయిషీని పార్టీ నాయకత్వం నమ్మలేదని సమాచారం.



Also Read-
Bad Girl: సమాజంలో కులం ఉంది కాబట్టే సినిమాల్లో కులం

Also Read- Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే

Also Read- Kangana Ranaut: కాజోల్‌, దీపికా ముద్దు.. మేమంటే చేదు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 05:33 AM