TDP Questions YSRCP: తిరుపతి అరాచకం మరిచారా
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:26 AM
వైఎస్ ఫ్యామిలీ అడ్డా పులివెందులలో స్వేచ్ఛగా ఓటువేయడం మూడు దశాబ్దాల్లో ఇదే తమకు మొదటిసారి అని..
ఓ ఐఏఎ్‌సను బలి చేశారు కదా
30ఏళ్లుగా ‘ఓటు’ తెలీని పులివెందుల
వైఎస్ ఫ్యామిలీ నిలిపినవారే విజేతలు
అన్యాయం.. అరాచకం అంటున్న జగన్‌కుప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకు రాలేదా?
ప్రశ్నిస్తున్న రాజకీయవర్గాలు, టీడీపీ శ్రేణులు
(అమరావతి - ఆంధ్రజ్యోతి) :వైఎస్ ఫ్యామిలీ అడ్డా పులివెందులలో స్వేచ్ఛగా ఓటువేయడం మూడు దశాబ్దాల్లో ఇదే తమకు మొదటిసారి అని ప్రజలు మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు. అయితే, ఓటర్లను టీడీపీ నేతలు, పోలీసులు ఓటు వేసుకోనీయకుండా భయభ్రాంతులకు గురిచేశారంటూ వైసీపీ అధినేత జగన్, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి అమాయకంగా ముఖంచెప్పి సెలవిస్తున్నారు. అక్కడ ఇంతకుముందేదో ప్రజాస్వామ్యం ఉన్నట్టు.. ఈ ఎన్నికల తర్వాత అది మంటగలిసిపోయినట్టు జగన్ సోదరులు అల్లుతున్న కథలు పులివెందుల చరిత్ర తెలిసినవారిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అక్రమం.. అన్యాయం.. అంటూ రెండురోజులుగా గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతల తీరుపై టీడీపీ శ్రేణులు, బ్యూరోక్రాట్లు ఆగ్రహిస్తున్నాయి. ‘‘తిరుపతి ఉప ఎన్నికల్లో సాగించిన అరాచకం మరిచారా.. ఓ ఐఏఎ్‌సను నాడు బలి చేశారు కదా..’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి, పులివెందులలో గడచిన 30 ఏళ్లుగా స్థానిక ఎన్నికల్లో నడిచింది రాజారెడ్డి రాజ్యాంగమేనని స్పష్టం చేస్తున్నారు.
ఓటర్ల కన్నుల్లో స్వేచ్ఛా కాంతులు
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం కోసం నామినేషన్లను పులివెందులలో వేయనిచ్చేవారు కాదు. దీంతో ఏనాడూ అక్కడ ఎన్నికలు జరగలేదు. గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ దాకా వైఎస్ కుటుంబం చెప్పినవారికే పదవులు దక్కుతూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ఉంటుందని .. దానిని ఉపయోగించుకోవాలన్న సంగతే పులివెందుల ఓటర్లు మరిచిపోయారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీలకు ఉప ఎన్నికల ప్రకటన వెలువడినప్పుడు అదే గత సంప్రదాయం నడిచిపోతుందని జగన్ బ్యాచ్, వైసీపీ నేతలు భావించారు. కానీ, ఈ నెల 12వ తేదీన జరిగిన పులివెందుల జడ్సీటీసీ ఎన్నికలు వారి అంచనాలను తలకిందులు చేశాయి. ఓటు స్వేచ్ఛను పొందిన అనుభూతితో పెద్ద ఎత్తున ఓటర్లు బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇన్నాళ్లకు.. తమకు ఓటు వేసుకునే హక్కును కల్పించారంటూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ బ్యాలెట్ బాక్సుల్లో స్లిప్పులను వేశారు. ఓటర్లలోని గూడుకట్టుకున్న ఆవేదనకు ఈ స్లిప్పులే నిదర్శనంగా నిలిచాయి. ఫలితంగా జగన్ పార్టీ అభ్యర్థికి పులివెందులలో డిపాజిట్లు కూడా దక్కలేదు.
బ్యాలెట్ బరిలోనూ చిత్తు..
సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన జగన్.. ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మెషిన్లపై తప్పువేసి ప్రచారం చేశారు. మరి పులివెందుల , ఒంటిమిట్ట ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే జరిగాయి. కానీ, జగన్ బలపరచిన అభ్యర్ధులు రెండు చోట్లా ఘోరంగా ఓడిపోవడం గమనార్హం. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాల పేరిట .. నాడు అధికారపక్షానికి చెందిన ఒకే నామినేషన్ పడేలా వ్యూహాన్ని అమలుచేశారు. తెలుగుదేశం,జనసేన, వామపక్షాల నుంచి ఎవరైన నామినేషన్ వేసేందుకు వెళితే, వారి పత్రాలను దౌర్జన్యంగా లాక్కొని చించేశారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ అరాచకం పరాకాష్ఠను అందుకుంది. భారీగా రిగ్గింగు .. దొంగ ఓట్లను వేశారు.
అవి బయట రాష్ట్రాల ‘చిత్రాలు’: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో క్యూలైన్లలోకి మీడియాను రానివ్వలేదంటూ జగన్, అవినాశ్‌రెడ్డి, పేర్ని నాని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. అవి అసలువో .. నకిలీవో తెలియడం లేదు. ఇటీవల ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు కొన్ని ఫోటోలు విడుదల చేశారు. కానీ అవి బయటి రాష్ట్రాలకు చెందినవిగా ఆ తర్వాత బయటపడింది.