NTR Jayanthi: యుగ పురుషుడు ఎన్టీఆర్
ABN , Publish Date - May 29 , 2025 | 04:34 AM
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కడప మహానాడులో ‘యుగపురుషుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళి’ తీర్మానం ఆమోదించబడింది. నాయకులు ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
జయంతి సందర్భంగా మహానాడు రెండో రోజు తొలి తీర్మానమే టీడీపీ వ్యవస్థాపకుడికి నివాళి
కడప, మే 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా కడప మహానాడులో ‘యుగపురుషుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళి’ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు.
సీఎం హోదాలో కోర్టుకెళ్లి సమాధానమిచ్చారు: అశోక్ గజపతిరాజు
‘నాడు అన్న ఎన్టీఆర్‌పై కూడా అక్రమ కేసులు పెట్టారు. సీఎం హోదాలో కోర్టుకు వెళ్లి సమాధానం ఇచ్చారు. రూ.కోట్ల స్కాంలలో కొంతమంది వాయిదాలతో గిన్నిస్ రికార్డులకు ఎక్కుతున్నారు. చంద్రబాబును 52 రోజులు జైల్లో పెట్టినా ఆయన అధైర్యపడలేదు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు బాటలో అందరం నడవాలి.’
లక్షల మంది త్యాగాల ఫలితమే ఇవాల్టి టీడీపీ: గోరంట్ల
‘అనేక ఉత్తమ చిత్రాలను నిర్మించిన నిర్మాత, స్ర్కీన్ ప్లే రైటర్, డైరెక్టర్, ఎడిటర్... అన్ని రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని సాధించిన వ్యక్తి. నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి, రాజకీయ పార్టీని ప్రారంభించి ఒక నూతన ఒరవడిని సృష్టించారు. లక్షలాది మంది కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఇవాళ టీడీపీ నిలబడింది. టీడీపీ మరో 30 ఏళ్ల పాటు వరుసగా పాలన కొనసాగించాలి. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి.’
బలహీనవర్గాలకు అధిక సీట్లు కేటాయించిన ఎన్టీఆర్: చినరాజప్ప
‘నాడు దివిసీమ ప్రజల కోసం జోలె పట్టిన మానవతావాది. కాంగ్రెస్ పాలనలో అరాచకాలను అరికట్టేందుకు పార్టీ పెట్టి 9 నెలల్లోనే విజయదుందుభి మోగించారు. అధిక సీట్లను బడుగు, బలహీన వర్గాలకు కేటాయించి మార్పునకు శ్రీకారం చుట్టారు.’
తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపారు: మంత్రి పయ్యావుల
‘యావత్ దేశంలో తెలుగు పతాక కీర్తి ప్రతిష్ఠలను రెపరెపలాడించిన మహోన్నతుడు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అధికారం అందించిన మహావ్యక్తి. తెలుగుజాతి జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావునికి ఘననివాళి అర్పిద్దాం.’
తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్: టీడీ జనార్దన్
‘తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు అన్న ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన సేవ భావితరాలకు తెలియాలని పుస్తకాలు ప్రచురించాను. రామారావు పోషించిన పాత్రలు సమాజంలో అన్ని వర్గాలనూ ప్రతిబింబించాయి. అందుకే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారు.’
తెలంగాణలో ముక్కోడు, ఏపీలో తిక్కోడు పోయారు - నన్నూరి నర్శిరెడ్డి
‘మా తెలంగాణలో ముక్కోడు, మీ ఏపీలో తిక్కోడు పోయారు. పార్లమెంటులో ప్రధాన భూమిక పోషించే స్థాయి, సత్తా టీడీపీకి ఉందని నిరూపించిన ఘనత ఎన్టీఆర్‌ది. పేదలకు ఎన్టీఆర్ కిలో రూ.2కే బియ్యంతెస్తే, 20ఏళ్ల తర్వాత కేంద్రం దానిని ఆహార భద్రత చట్టంగా చేసింది. టీడీపీ నేడు చేసే ఆలోచన, దేశానికి 20ఏళ్ల తర్వాత మార్గదర్శకంగా నిలుస్తుంది. చంద్రబాబు 20ఏళ్ల కిందట తెచ్చిన జినోం వ్యాలీ నుంచి కరోనా కష్ట సమయంలో వ్యాక్సిన్ వచ్చింది. 20ఏళ్ల కిందట టూరిజం గురించి చెబితే అపహాస్యం చేసిన కమ్యూనిస్టులు నేడు ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.’
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News