Share News

TDP: టీడీపీలో సంస్థాగత కోలాహలం

ABN , Publish Date - Apr 12 , 2025 | 06:41 AM

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సంస్థాగత ఎన్నికలను మే 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా కుటుంబ సాధికార సారథులను నియమించనున్నారు

TDP: టీడీపీలో సంస్థాగత కోలాహలం

  • మే 15కల్లా పార్టీ ఎన్నికలు పూర్తిచేయాలి

  • రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు చంద్రబాబు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పక్కా కార్యాచరణ రూపొందించి, నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. రెండేళ్లకోసారి ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. ఈసారి సంస్థాగత ఎన్నికల్లో మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కొత్తగా కుటుంబ సాధికార సారఽథులను నియమించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి 60 మంది ఓటర్లకు ఇద్దరు కుటుంబ సాధికార సారథులను నియమించాల్సి ఉంటుంది. వీరిలో ఒకరు పురుషుడు, మరొకరు మహిళ ఉండాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఓటర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పార్టీలో తొలిసారిగా ఈ ప్రయోగం చేపట్టారు. మే 27 నుంచి మూడ్రోజులపాటు కడపలో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో.. మే 15 నాటికి అన్ని నియోజకవర్గ, పార్లమెంటరీ స్థాయిలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలని చంద్రబాబు స్పష్టంచేశారు. ఎన్నికల సమర్థ నిర్వహణకు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు సంస్థాగత ఎన్నికల పరిశీలకులను నియమించారు.

Updated Date - Apr 12 , 2025 | 06:41 AM