Technology Development: ఏపీలో సాంకేతికరంగ అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:10 AM
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని
విశాఖలో దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు చేయండి
నూజివీడుకు రింగురోడ్డు మంజూరు చేయండి
కేంద్ర మంత్రులకు టీడీపీ ఎంపీల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీలు కోరారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో పార్టీ ఎంపీలు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేందర్ సింగ్‌ను కలిశారు. ఏపీని వ్యూహాత్మక అంతరిక్ష కార్యక్రమాల కూడలిగా ప్రకటించాలని, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో డాప్లర్ వాతావ రణ రాడార్ సౌకర్యాలు కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. కాగా, విశాఖపట్నం రూరల్ మండలం, బక్కన్నపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 22.64 ఎకరాల్లో దివ్యాంగుల క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్‌ను లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ప్రజల కోరిక మేరకు నూజివీడుకు రింగురోడ్డును మంజూరు చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం సమర్పించారు.