MLA Irregularities: ఎమ్మెల్యే సారూ.. కాస్త తగ్గాలి మీరు
ABN , Publish Date - Jun 11 , 2025 | 04:32 AM
ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేయాలి. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి.. ఇటీవల టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చేసిన దిశానిర్దేశమిది.
పలువురు శాసనసభ్యుల ఇష్టారాజ్యం
కుటుంబ సభ్యుల చేతికి పగ్గాలు
కొన్నిచోట్ల వైసీపీ నేతలతో ములాఖత్
ప్రతి పనికీ రేటు కట్టి ముడుపులు
భూదందాలు, ఇసుక, గ్రావెల్, దోపిడీలు
మద్యం షాపుల నుంచీ మామూళ్లు
కాంట్రాక్టులు, పనులు వైసీపీ వారికే
సొంత పార్టీ శ్రేణులపై నిర్లక్ష్యం
కొందరి తీరుపై ప్రజల్లో వ్యతిరేకత
అరాచక పాలన అంతమై... సరిగ్గా ఏడాది! కూటమి సర్కారు కొలువుదీరి రేపటితో సంవత్సరం అవుతోంది! భూదందాలు, ఇసుక మాఫియా, మట్టి దోపిడీ, వెంచర్లు వేస్తే వాటాలు, అవకాశాలు వెతికి మరీ ముడుపులు పిండిన ఎమ్మెల్యేల కథ ముగిసింది. కానీ... ‘మేం మాత్రం తక్కువా’ అని కూటమి ఎమ్మెల్యేల్లోనూ కొందరు చెలరేగిపోతున్నారు. అచ్చంగా... నాటి వైసీపీ ఎమ్మెల్యేల దందాలను తలపిస్తున్నారు. కొన్నిచోట్ల వైసీపీ నేతలనే భాగస్వాములుగా చేసుకుని వసూళ్లు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాలను బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు అప్పగించేశారు. ఏడాదిలోనే ఆయా శాసన సభ్యులు వ్యతిరేకత మూటగట్టుకున్నారు. పరిస్థితి మారకపోతే వారికే కష్టమని... కూటమి ప్రభుత్వానికీ కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కొత్త సర్కారు కొలువుదీరి ఏడాదైన సందర్భంగా ఆయా ఎమ్మెల్యేల తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం...
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘ఎమ్మెల్యేలు బాధ్యతగా పనిచేయాలి. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి’.. ఇటీవల టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చేసిన దిశానిర్దేశమిది. కానీ కొందరు ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఐదేళ్ల జగన్ హయాంలో వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులను పక్కన పెట్టేసి.. వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారు. వారితో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. తమ అవినీతి.. అక్రమాల కోసం సొంత పార్టీనే పణంగా పెడుతున్నారు. వైసీపీ విధ్వంసపాలనకు ముగింపు పలికిన నియోజకవర్గ ప్రజలకు మళ్లీ దానినే గుర్తు చేస్తున్నారు.
గుమ్మనంగా దోపిడీ
అనంతపురం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకుని విజయం సాధించారు. నియోజకవర్గం మొత్తం ఈయన సోదరుల గుప్పిట్లో ఉంటుంది. పేకాట శిబిరాలు, బెంగళూరుకు ఇసుక అక్రమ తరలింపు, మద్యం షాపుల నుంచి మామూళ్లు ఇవన్నీ సోదరులే చూస్తుంటారు. నియోజకవర్గంలో పనులను టీడీపీ శ్రేణులకు కాకుండా.. ఎవరు కమీషన్లు ఇస్తే వారికి కట్టబెడుతున్నారు.
ఆయనపై అధిష్ఠానమూ గుర్రు!
విజయవాడ నగరంలోని ఓ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడి అవినీతిపై అధిష్ఠానం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. పోస్టింగులు, బదిలీలు మొదలు అక్రమ కట్టడాలు, వాణిజ్య సముదాయాలు, టింబర్ డిపోలు ఇలా వేటినీ వదలకుండా నెలవారీ వసూళ్లు చేస్తున్నారు. కేబుల్ ఆపరేటర్లను భయపెట్టి చాలా కనెక్షన్లను లాగేసుకున్నారు.
అవినీతి దెబ్బకు తోక కట్!
ఎన్టీఆర్ జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తొలిసారి ఎన్నికయ్యారు. తనను కలిసేందుకు వచ్చే ప్రజలను చీదరించుకోవడంతోపాటు మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వైసీపీ నాయకులతో అంటకాగుతూ టీడీపీ కేడర్‌ను నిర్వీర్యం చేస్తున్నారు. అధిష్ఠానం కూడా విసుగెత్తిపోయి చెక్ పెట్టింది. నియోజకవర్గంలో ఎక్కడా ఈయన మాట చెల్లుబాటు కాకుండా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంది.
ట్రావెల్ బస్సులనూ వదలరు..
శ్రీకాకుళం జిల్లా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడి అవినీతిని పార్టీ శ్రేణులే నిరసిస్తున్నాయి. వంశధార నది నుంచి ఇసుక దోపిడీ మొదలు కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు, చివరికి ట్రావెల్ బస్సుల నుంచి కూడా ముడుపులు తీసుకుంటున్నారు.
అభివృద్ధి పనుల్లో వాటాలు..
నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న ఓ నాయకుడి అవినీతిపై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉంది. పోర్టు కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా పోర్టు పనుల్లో సబ్ కాంట్రాక్టు పనులు తాను చెప్పిన వారికే ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో చివరకుఅధిష్ఠానం జోక్యం చేసుకోవలసి వచ్చింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరుడే షాడో
పల్నాడు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఓ సీనియర్ నేతపై టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయిస్తున్నారు. క్వార్ట్జ్, గ్రావెల్ మైనింగ్‌ను ఈయనకు అప్పగించారు. వైసీపీకి చెందిన మున్సిపల్ వైస్‌చైర్మన్‌కు ఎమ్మెల్యే అండగా నిలవడం టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమైంది.
ఈయన దెబ్బకు పార్టీ ‘గోవిందా’!
అనకాపల్లి జిల్లా నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిపై జిల్లా అధ్యక్షుడు సహా టీడీపీ శ్రేణులన్నీ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. వైసీపీ నుంచి వచ్చిన నాయకులకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. వారితో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన అనుచరులే ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. కూటమి నాయకులే ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే వ్యవహారశైలితో నియోజకవర్గంలో పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి.
పెత్తనమంతా కొడుకు, అల్లుడిదే
కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పెత్తనమంతా ఆయన కుమారుడు, అల్లుడిదే. ఇసుక, మట్టి తవ్వకాలు, రవాణా అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఏ పనిమీదైనా వెళ్తే కుమారుడిని కలవాలని ఆయన చెబుతున్నారు.
రియల్ వ్యాపారే షాడో ఎమ్మెల్యే
కర్నూలు జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు ‘కృతజ్ఞతాభావం’ కాస్తంత ఎక్కువే. తనకు ఎన్నికల్లో సాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి నియోజకవర్గాన్ని రాసిచ్చేశారు. అధికారుల బదిలీలు, పనుల కేటాయింపులు ఏవైనా సదరు వ్యాపారి సిఫారసు చేయాల్సిందే. ఇంతకాలం స్థిరాస్తి వ్యాపారం చేసుకున్న ఆయన.. ఇప్పుడు రాజకీయ వ్యాపారం ప్రారంభించి షాడో ఎమ్మెల్యేగా తయారయ్యారు. ప్రతి పనికో రేటు నిర్ణయించి వసూళ్లకు దిగారు. వైసీపీ రౌడీ గ్యాంగ్‌లను టీడీపీలో చేర్చుకున్నారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవిని కూడా ఎన్నికలకు వారం రోజుల ముందు పార్టీలో చేరిన వైసీపీ వ్యక్తికి కట్టబెట్టారు. కొత్తగా చేరిన వైసీపీ వారికే పార్టీలో ప్రాధాన్యం పెరుగుతోందని టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ లీడర్లనూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ షాడో ఎమ్మెల్యే తీరుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పెత్తనమంతా భర్తదే..
నంద్యాల జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆమె భర్తదే హవా. మట్టి అక్రమ రవాణా, ఇసుక దోపిడీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికీ ఓ రేటు పెట్టి వసూలు చేస్తారన్న పేరుంది. ఈమె భర్త తీరు కారణంగా జిల్లాలో సొంత పార్టీలోనే ఏకాకిగా మిగిలారు. అత్యంత కీలకమైన డెయిరీ చైర్మన్ పీఠంపై తన కుటుంబ సభ్యుడిని కూర్చోబెట్టాలన్న ఈమె ప్రయత్నాలను ఉమ్మడి జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకుంటున్నారు.
ఇస్తారా.. లాక్కోనా..?
అనంతపురం జిల్లా నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేపై అటు ప్రజల్లో, ఇటు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రతి పనికీ రేటు పెట్టి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూములను, ఇతరులు పాడుకున్న మద్యం షాపులను బెదిరించి మరీ లాక్కున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇతరులు నిర్వహిస్తున్న మద్యం షాపుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. మెడికల్ ఏజెన్సీలు, పీడీఎస్ బియ్యం.. దేనినీ వదలరని ఈయనకు పేరు.
కుటుంబ సభ్యుల హవా..
నంద్యాల జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తన ఇద్దరు కొడుకులకు కట్టబెట్టేశారు. వారు వైసీపీ నేతలతో కలిసి దందాలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నెలవారీ వసూళ్లు, భూకబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయన వారంలో శని, ఆదివారాలు మాత్రమే నియోజకవర్గంలో ఉంటారు.
నంద్యాల జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని తన చిన్నాన్న చేతికి అప్పగించారు. సదరు చిన్నాన్న.. క్వారీల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డికి ఈ ఎమ్మెల్యే సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేస్తే.. అతడిని రిమాండ్‌కు పంపకుండా ఈయన సాయం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వైసీపీ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో పార్టీ శ్రేణులు ఆయనకు అండగా నిలబడ్డాయి. కానీ గత ఏడాది గెలిచాక వారందరినీ పూర్తిగా విస్మరించారని.. నియోజకవర్గంలో ఆయన భార్య పంచాయితీలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన పీఏలు అందినకాడికి దండుకుంటున్నారు.
అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రజలను, పార్టీ శ్రేణులను పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలున్నాయి. మండలానికో నాయకుడి చొప్పున ఓ కోటరీని ఏర్పాటు చేసుకుని వారితో తప్ప ఇతర నాయకులు, కార్యకర్తలను కలవడం లేదు. భూముల సెటిల్‌మెంట్లు, గ్రావెల్, మట్టి దందా, మద్యం వ్యాపారం.. అన్నీ ఈ కోటరీ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ నియోజకవర్గం నుంచి కూటమి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడి దర్శనం కోసం ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గంలో నెలలో ఒకట్రెండు రోజులు ఉన్నా ఎక్కువే. అధిక సమయం అమరావతి, ఢిల్లీలో గడుపుతుంటారు. ఈయన పీఏనే ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటారు. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన నాయకులను, కార్యకర్తలను వేధించిన వారిని బీజేపీలో చేర్చుకుంటున్నారు.
తొలి గెలుపుతోనే అహంకారం..
విజయవాడ చెంతనే ఉన్న ఆ నియోజకవర్గం నుంచి గొప్ప నాయకులు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. అలాంటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు మితిమీరిన అహంకారంతో వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. యువ నేతకు అత్యంత సన్నిహితుడినని ప్రచారం చేసుకుంటూ.. నియోజకవర్గంలో సీనియర్ నాయకులను పార్టీకి దూరం పెట్టేశారు. టీడీపీ శ్రేణులపైనే దాడులకు తెగబడుతున్నారు. ఈయన వన్‌టైం ఎమ్మెల్యే అన్న ప్రచారం ఇప్పటికే బాగా జరుగుతోంది. గ్రావెల్ అక్రమ తవ్వకాలను కట్టడి చేశానని చెబుతూ మట్టి తోలకాల్లో చేతివాటం చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి.
వైసీపీ వారే ముద్దు!
కృష్ణా జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన నేతపై పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేయడంతో కొత్తగా మరో వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు. ఆయన కనుసన్నల్లోనే వసూళ్లు మొత్తం నడుస్తున్నాయి. పనులన్నీ వేరే జిల్లాల వారికి కట్టబెట్టారని, స్థానిక నాయకులను పూర్తిగా పట్టించుకోవడం మానేశారన్న ఆరోపణలున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సన్నిహితుడైన వ్యక్తిని తన పక్కన పెట్టుకుని.. ఎవరు వచ్చినా అతడినే కలవాలని చెబుతున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే చూపిన బాటలో..
విజయవాడ చెంతనే కృష్ణా జిల్లాకు చెందిన ఇంకో నియోజకవర్గ ఎమ్మెల్యే గతంలో దీనికి ప్రాతినిధ్యం వహించిన వైసీపీ ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా, మద్యం దుకాణాలు స్వయంగా నిర్వహిస్తుంటారు. అపార్ట్‌మెంట్ల నుంచి లేఔట్ల వరకు వసూళ్లు చేస్తున్నారు. తనకు డబ్బులు ముట్టచెప్పిన వారి అపార్ట్‌మెంట్లు, వెంచర్లకు ఉపాధి హామీ పథకం కింద రోడ్లు వేయిస్తుండడం విశేషం. దీంతో నియోజకవర్గంలో అవసరమైన చోట్ల రహదారులు లేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రధాన రోడ్లన్నీ గుంతలమయమైనా ఆయన పట్టించుకోవడం లేదు. నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ తన మనుషులకే తప్ప ఇతరులకు దక్కడం అసాధ్యం.
తన ఆస్పత్రి ఉద్యోగే ఏజెంటు..
పల్నాడు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. వైసీపీ నుంచి వచ్చిన వారికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ , మైనింగ్ వ్యాపారుల నుంచి వసూళ్ల కోసం తన ఆస్పత్రిలో పనిచేసే వ్యక్తిని ఏజెంటుగా పెట్టుకున్నారు.