TDP Demands Action Against YSRCP: వైసీపీ వారిపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:08 AM
ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అరాచకానికి పాల్పడిందని టీడీపీ ఆరోపించింది...
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అరాచకానికి పాల్పడిందని టీడీపీ ఆరోపించింది. ఉప ఎన్నికల సందర్భంగా సక్రమంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని, ఈసీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను టీడీపీ నేతలు కోరారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, కుప్పం రాజశేఖర్ కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 31 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును దుర్భాషలాడటం దారుణమని పంచుమర్తి అనురాధ అన్నారు. అసలైన రాక్షస పాలనకు నిదర్శనం ఐదేళ్ల జగన్ పాలన అని విమర్శించారు. పింఛన్‌ను చంద్రబాబు రూ.4 వేలు చేయడం రాక్షస పాలనా? 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం రాక్షస పాలనా అని అనురాధ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే జగన్ సహించలేకపోతున్నారని వర్లరామయ్య అన్నారు. వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి కూడా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదని, అలాంటి పరిస్థితి నుంచి ఏ పార్టీ వారైనా ధైర్యంగా నామినేషన్లు వేసే పరిస్థితికి తీసుకొచ్చామని అన్నారు. దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకోని పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు స్వేచ్ఛగా, ధైర్యంగా ఓటు వేయడం చంద్రబాబు ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమన్నారు.