Share News

TDP: కోడ్‌ ముగియగానే డీఎస్సీ

ABN , Publish Date - Feb 01 , 2025 | 05:39 AM

మార్చిలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించి.. వచ్చే విద్యాసంవత్సరం మొదలయ్యే జూన్‌ నాటికి ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారమిక్కడ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

TDP: కోడ్‌ ముగియగానే డీఎస్సీ

మార్చిలో నియామక ప్రక్రియ ఆరంభం: లోకేశ్‌.. జూన్‌కల్లా ఉపాధ్యాయుల భర్తీ

టీచర్ల బదిలీల్లో పారదర్శకత

వ్యవస్థలో భాగస్వాములందరితో చర్చించిన తర్వాతే నిర్ణయాలు

సంఘాలతో నిత్యం చర్చలు

జగన్‌ హయాంలో రూ.3 వేల కోట్ల ఫీజు బకాయిలు

మేమొచ్చాక తొలి విడతగా 800 కోట్లు ఇచ్చాం

వాట్సాప్‌ పాలనపై స్పందన భేష్‌

చిన్నపాటి సమస్యలున్నా వారం రోజుల్లో 161 సేవలు అందుబాటులోకి: మంత్రి

అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంతి లోకేశ్‌ ప్రకటించారు. మార్చిలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించి.. వచ్చే విద్యాసంవత్సరం మొదలయ్యే జూన్‌ నాటికి ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారమిక్కడ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోను, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలోనూ 80 శాతానికిపైగా టీచర్ల పోస్టులను టీడీపీ ప్రభుత్వాలే భర్తీ చేశాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛను కల్పిస్తూ ఉపాఽధ్యాయ సంఘాలతో నిత్యం చర్చిస్తున్నామని తెలిపారు. వారి అభిప్రాయాలు సేకరించే.. ప్రభుత్వం ప్రతి నిర్ణయం తీసుకుంటోందన్నారు. విద్యాశాఖ కమిషనర్‌ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారని, వారి సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. తాను కూడా వారిని కలుస్తున్నట్లు తెలిపారు.


టీచర్ల బదిలీల్లో పారదర్శకత కోసం బదిలీ చట్టాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. ‘విద్యావ్యవస్ధకు సముచిత స్థానం కల్పిస్తూ.. అనాలోచిత నిర్ణయాలకు తావు లేకుండా ఆచితూచి ముందుకు వెళ్తున్నాం. విద్యావ్యవస్థలో భాగస్వాములైన వారందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను జగన్‌ ప్రభుత్వం గందరగోళం చేసింది. దీనిని సరిచేసేందుకు ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) విధానాన్ని మేం తీసుకొచ్చాం. అదే సమయంలో పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించేందుకూ ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తున్నాం’ అని వివరించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. జగన్‌ హయాంలో రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోయాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక విడతగా రూ.800 కోట్లు విడుదల చేశామని తెలిపారు. బకాయిలు పెట్టింది జగన్‌.. మళ్లీ ధర్నాలు చేస్తోంది ఆయన పార్టీ వాళ్లేనంటూ ఎద్దేవా చేశారు.


వ్యక్తిగత సమాచారం వెల్లడి కాదు..

ప్రజలకు పాలనను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రవేశపెట్టిన వాట్సాప్‌ పరిపాలనపై మంచి స్పందన వస్తోందని లోకేశ్‌ తెలిపారు. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వారం రోజుల్లో పూర్తి స్థాయిలో 161 సేవలు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అందుబాటులోకి వస్తాయన్నారు. వ్యక్తిగత సమాచారం బయటకు వెల్లడయ్యే సమస్యే లేదని స్పష్టం చేశారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 05:39 AM