National Highways: 2026 చివరికి టార్గెట్
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:26 AM
భవిష్యత్తులో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను 2026 డిసెంబరు నాటికి పూర్తిచేసే లక్ష్యంతో అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. అటవీ క్లియరెన్స్, భూసేకరణల సమస్యలను త్వరగా పరిష్కరించి, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
హైవే, రైల్వే ప్రాజెక్టుల పూర్తిపై అధికారులకు మంత్రి జనార్దన్‌రెడ్డి ఆదేశం
భూసేకరణ, అటవీ క్లియరెన్స్ సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్దేశం
నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచన
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేపట్టిన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను 2026 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో జాతీయ రహదారులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులతో 2వ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత డిసెంబరులో నిర్వహించిన తొలి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై సాధించిన ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఆయా ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెం డింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుని, నిర్ణీత కాల వ్యవధిలో జాతీయ రహదారులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గతంలో జాతీయ రహదారుల పనుల్లో భాగంగా సీనరేజీ చార్జీల ముందస్తు చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం బిల్లు వచ్చిన తర్వాత చెల్లించే వెసులుబాటు కాంట్రాక్టర్లు ఇచ్చారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న హైవే ప్రాజెక్టులకు ఇప్పటికి 237 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. మిగిలిన భూసేకరణ కూడా త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి వారికి సూచించారు. ఓర్వకల్లు, కృష్ణపట్నం పారిశ్రామిక పట్టణాలను రైల్వేలైన్లకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. కాగా, రాష్ట్రంలోని ఓడరేవులు, విమానాశ్రయాలు, వీసీఐసీ, హెచ్‌బీఐసీ వంటి పారిశ్రామిక కారిడార్లకు జాతీయ రహదారులను అనుసంధానం చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో పలు పెండింగ్ పనులకు ఆమోదం లభించింది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..