Share News

Supreme Court : నెయ్యి కల్తీలో ఇంటి దొంగలు?

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:00 AM

శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం టీటీడీకి ఆవు నెయ్యి సరఫరాలో అక్రమాలు మొదలైంది 2019 నుంచేనని సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ దర్యాప్తు ఆధారంగా తేటతెల్లమవుతోంది.

Supreme Court : నెయ్యి కల్తీలో ఇంటి దొంగలు?

  • టీటీడీలోని కొందరి సహకారంతోనే అక్రమాలు!

  • నెయ్యి టెండర్ల నిబంధనలు బహు కఠినం

  • అయినా, తప్పుడు డాక్యుమెంట్లతో ‘ఏఆర్‌’కు అర్హత!

  • సరైన పత్రాల్లేవని ‘భోలేబాబా’లో టీటీడీ తనిఖీలు

  • అక్రమాలు బయటపడినా ఏఆర్‌లో సోదాలేవీ?

  • 2019 నుంచే నెయ్యి సరఫరాలో అక్రమాలు

  • భక్తుల ఫిర్యాదులు పట్టించుకోని నాటి పాలకవర్గం

  • ఈ కేసు నిందితులు సూత్రధారులా.. పాత్రధారులా?

  • ఇంతకీ ఆ నెయ్యి తయారైంది ఎక్కడ?.. సిట్‌ శోధన

(తిరుపతి - ఆంధ్రజ్యోతి)

శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం టీటీడీకి ఆవు నెయ్యి సరఫరాలో అక్రమాలు మొదలైంది 2019 నుంచేనని సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ దర్యాప్తు ఆధారంగా తేటతెల్లమవుతోంది. అంతకు మునుపు శ్రీవారి ప్రసాదాల నాణ్యతను భక్తులు ప్రశ్నించింది లేదు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019 ద్వితీయార్థం నుంచే శ్రీవారి ప్రసాదాల నాణ్యత, రుచి వంటివాటిపై విమర్శలు, భక్తుల్లో ఆగ్రహం మొదలయ్యాయి. గతానికి భిన్నంగా నెయ్యి సరఫరా టెండర్లలో అర్హత కోసం కొన్ని డెయిరీలు అడ్డదార్లు తొక్కి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం అప్పటి నుంచే మొదలైంది. అంత అడ్డదిడ్డంగా పనులు చేసుకోగలిగిన డెయిరీల ప్రతినిధులకు అప్పట్లో టీటీడీలో సహకరించింది ఎవరు? సిట్‌ బృందం అరెస్టు చేసిన నిందితులు ఈ వ్యవహారంలో సూత్రధారులా లేక కేవలం పాత్రధారులా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో టీటీడీకి నెయ్యి సరఫరాలో అక్రమాల వ్యవహారంపై అనుమానాలన్నీ అదే ఏడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ సంబంధిత వ్యక్తులపైనే మళ్లుతున్నాయి. కాగా ఈ కేసులో టీటీడీకి సరఫరా అయిన నాణ్యత లేని నెయ్యి ఎక్కడ తయారైందన్న విషయాన్ని మాత్రం సిట్‌ ఇంకా తేల్చలేకపోతోంది.


తప్పుడు డాక్యుమెంట్ల సమర్పణ

టీటీడీకి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం రోజువారీ 15 వేల కిలోల ఆవు నెయ్యి కావాలి. అంటే ఏడాదికి సుమారు 55 లక్షల కిలోల ఆవు నెయ్యి అవసరం అవుతుంది. టీటీడీ ఆగ్‌మార్క్‌ స్పెషల్‌ గ్రేడ్‌ నెయ్యి మాత్రమే శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగిస్తుంది. ఆరు నెలలకు సరిపడా పరిమాణంలో నెయ్యి సేకరణకు టీటీడీ టెండర్లు పిలుస్తుంది. దీనికి మూడు విధానాలు అనుసరిస్తుంది. మొదటి విధానంలో జాతీయ స్థాయి డెయిరీల నుంచీ 20 లక్షల కిలోల నెయ్యి సేకరణకు ఇ-టెండర్లు పిలుస్తుంది. రెండవ విధానంలో తిరుమలకు 1,500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీల నుంచీ 10 లక్షల కిలోల ఆవు నెయ్యి సేకరణకు ఇ-టెండర్లు నిర్వహిస్తుంది. మూడవ విధానంలో ఏపీ పరిధిలోని డెయిరీల నుంచీ 5 లక్షల కిలోల ఆవు నెయ్యి సేకరణకు ఇ-టెండర్లు ఆహ్వానిస్తుంది. భారీ పరిమాణంలో నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాల్సి వున్న దృష్ట్యా టీటీడీ టెండరు నిబంధనలు కఠినంగా ఉంటాయి. అయితే, ఏఆర్‌ డెయిరీకి వాస్తవంగా టీటీడీ టెండర్లలో పాల్గొనే అర్హత గానీ, సామర్థ్యం గానీ లేవు. దానికోసం ఏఆర్‌ డెయిరీ యాజమాన్యంతో భోలేబాబా డెయిరీని ఉత్తరాఖండ్‌లో నిర్వహిస్తున్న డైరెక్టర్లలో ఒకరైన పొమిల్‌ జైన్‌ అడ్డదార్లు తొక్కించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే ఆ డెయిరీ కనీసం రోజువారీ 2 లక్షల లీటర్ల పాలసేకరణ సామర్థ్యం కలిగి ఉండాలి. ఏఆర్‌ డెయిరీ రోజువారీ పాల సేకరణ సామర్థ్యం 1.45 లక్షల లీటర్లు మాత్రమే. అయితే డెయిరీ ఎండీ రాజశేఖరన్‌ 2022-23లో తమ డెయిరీ రోజువారీ 2.52 లక్షల లీటర్ల పాలు సేకరించినట్టు టెండర్లు దాఖలు చేసిన సందర్భంలో టీటీడీకి ఒక నకిలీ డాక్యుమెంట్‌ సమర్పించారు.


టీటీడీకి నెయ్యి సరఫరా చేయదలిచే డెయిరీకి ఏడాదికి కనీసం 2,750 మెట్రిక్‌ టన్నుల ఆవు పాల కొవ్వు సేకరించే సామర్థ్యం వుండాలి. 2022-23లో ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐకి ఏఆర్‌ డెయిరీ సమర్పించిన వార్షిక టర్నోవర్‌ రిటర్నుల ప్రకారం ఆ డెయిరీ ఆవు పాల కొవ్వు సేకరణ సామర్థ్యం కేవలం 1,002 మెట్రిక్‌ టన్నులు మాత్రమే. అయితే టీటీడీకి టెండరు వేసేటప్పుడు సమర్పించిన 2022-23 ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ వార్షిక టర్నోవరు రిటర్నుల ప్రతులలో మార్పులు చేసి ఏకంగా తమ డెయిరీ సామరఽ్ధ్యం 3,072 మెట్రిక్‌ టన్నులుగా చూపించారు. ఈ వ్యవహారం సిట్‌ దర్యాప్తులో బయటపడింది.

ఉత్పత్తి, విక్రయాల సామర్థ్యంలోనూ అదే అడ్డదారి

టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డెయిరీ నెలకు కనీసం 180 మెట్రిక్‌ టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి గానీ, విక్రయాలు గానీ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. దిండిగల్‌కు చెందిన ఏఆర్‌ డెయిరీ ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐకి సమర్పించిన వార్షిక రిటర్నుల ప్రకారం 2022-23లో కేవలం 56.80 మెట్రిక్‌ టన్నుల ఆవు నెయ్యి మాత్రమే ఉత్పత్తి చేసింది. అయితే టీటీడీ టెండరు డాక్యుమెంట్లలో మాత్రం ఏకంగా 196.80 మెట్రిక్‌ టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి చేసినట్టు తప్పుడు వివరాలు పేర్కొన్నారు. వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడా ఈ తప్పుడు డాక్యుమెంట్లను తయారు చేయగా ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌ వాటిపై సంతకాలు చేసి టీటీడీకి సమర్పించినట్టు సిట్‌ దర్యాప్తులో తేలింది.


సహకరించింది ఎవరు?

అర్హత లేకున్నా టెండర్లు దక్కించుకోవడం నుంచీ నాణ్యత లేని నెయ్యి సరఫరా చేయడం వరకూ భోలే బాబా, వైష్ణవి, ఏఆర్‌ వంటి డెయిరీలు పాల్పడిన అక్రమాలకు టీటీడీలో సహకారం అందించింది ఎవరన్న ప్రశ్న ఇపుడు ప్రధాన చర్చనీయాంశంగా మా రుతోంది. టెండర్ల సమయంలో ఈ డెయిరీలు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పిస్తే వాటిని నిర్ధారించుకునే వ్యవస్థ ఏదీ టీటీడీలో లేదా? కంపెనీల రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్లు వెరిఫై చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నలకు టీటీడీ నుంచీ జవాబు లేదు. నిజానికి ఆయా డెయిరీలను, నెయ్యి తయారీ ప్లాంట్లను పరిశీలించి, అవసరమైన రికార్డులు తనిఖీ చేసే అధికారం టీటీడీకి టెండర్‌ అగ్రిమెంటు రూపంలో దక్కుతుంది. ఉదాహరణకు జాతీయ స్థాయి డెయిరీల కేటగిరీలో 2022లో భోలేబాబా డెయిరీ టీటీడీకి నెయ్యి ట్యాంకర్లు సరఫరా చేసిన సమయంలో టీటీడీ ప్లాంట్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీ ఆ డెయిరీలో తనిఖీలు చేసి అక్రమాలు గుర్తించింది. టీటీడీ ఆ డెయిరీతో నెయ్యి సరఫరా కాంట్రాక్టును రద్దు చేసుకుంది. మరి అదే విధానాన్ని ఆ తర్వాత ఏఆర్‌ డెయిరీల విషయంలో ఎందుకు అనుసరించలేదు? ఏఆర్‌ డెయిరీని, దాని ప్లాంటును తనిఖీ చేయకుండా టీటీడీపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? ఒత్తిడి లేకపోతే ఎందుకు తనిఖీ చేయలేదు? ఒకవేళ తనిఖీ చేసినా నామమాత్రంగా చేశారా? ఆ దిశగా టీటీడీపై ఏ శక్తులు లేదా ఏ ప్రలోభాలు పనిచేశాయి? తమతో టెండరు అగ్రిమెంటు కుదుర్చుకున్న డెయిరీల వాస్తవ సామర్థ్యాలను టీటీడీ ఆయా రాష్ట్రాల్లోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయాల నుంచీ సునాయాసంగా పొందే వీలుంది. అయినా ఆ అవకాశాన్ని టీటీడీ ఎందుకు వినియోగించుకోలేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇపుడు అదే అవకాశాన్ని వినియోగించుకుని సిట్‌ అదే రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంనుంచీ ఏఆర్‌ డెయిరీ భాగోతాన్ని బట్టబయలు చేసింది.


కల్తీ నెయ్యి తయారైంది ఎక్కడ?

టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు టెండరు దక్కించుకున్నది తమిళనాడు దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ. ఆ డెయిరీయే నెయ్యి తయారు చేసి టీటీడీకి సరఫరా చేయాలి. కానీ ఏఆర్‌ డెయిరీలో నెయ్యి తయారు కాలేదు. ఆ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదు. ఏఆర్‌ డెయిరీ పేరిట టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది వైష్ణవి డెయిరీ డైరెక్టర్లు. కానీ ఆ వైష్ణవీ డెయిరీలో కూడా నెయ్యి తయారు కాలేదు. అక్కడి నుంచీ నెయ్యి టీటీడీకి సరఫరా కాలేదు. ఈ రెండు డెయిరీలను ముందు పెట్టి కథ నడిపించిన భోలేబాబా డెయిరీకి టీటీడీకి అవసరమైన నెయ్యి తయారు చేసే సామర్థ్యం గానీ, సరఫరా చేసే సామర్థ్యం గానీ లేవు. కానీ నెయ్యి ఆ డెయిరీ నుంచే వైష్ణవి, ఏఆర్‌ డెయిరీల మీదుగా టీటీడీకి చేరింది. ఇంతకీ ఏఆర్‌ డెయిరీ పేరుతో టీటీడీకి చేరిన నెయ్యి ఎక్కడిది? ఎవరు తయారు చేశారు? కల్తీ ఎక్కడ జరిగింది? భోలేబాబా డెయిరీకి ఆ నెయ్యి ఎలా చేరింది? అన్నది అంతుబట్టడం లేదు. ఇప్పటి దాకా సాగించిన దర్యాప్తులో సిట్‌ అధికారులు ఈ అంశాన్ని మాత్రం కనిపెట్టలేకపోయింది. ఇక...భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీకి నెయ్యి సరఫరాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాంతానికి చెందిన ట్యాంకర్లను వినియోగించినట్టు వెల్లడైంది. ఆ ట్యాంకర్లు నెల్లూరు జిల్లా ముత్తుకూరుకు చెందిన హనుమాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ ఎస్‌కేడీ లాజిస్టిక్స్‌కు చెందినవిగా సిట్‌ గుర్తించింది. ఆ నెయ్యిని వైష్ణవి డెయిరీ 17 వేల కిలోల నెయ్యి పట్టే సొంత ట్యాంకర్ల ద్వారా ఏఆర్‌ డెయిరీకి సరఫరా చేసినట్టు తేల్చారు.


వాళ్లు సూత్రధారులా లేక పాత్రధారులా?

టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు దాదాపు కొలిక్కి వచ్చేసినట్టే. ఇపుడు పట్టుబడిన నిందితులు భోలేబాబా డైరెక్టర్లు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌, వైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్‌ చావడా... నలుగురూ కల్తీ నెయ్యి వ్యవహారానికి సూత్ర ధారులా లేక తెర వెనుక వ్యక్తులు నడిపించిన పాత్రధారులా అన్నది తేలాల్సింది. కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ అధికారులు దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ, తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని వైష్ణవి డెయిరీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా డెయిరీలలో తనిఖీలు చేపట్టింది. తొలుత ప్రధాన నిందితులు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, వినయ్‌కాంత్‌ చావడా, రాజశేఖరన్‌ తదితరులు సిట్‌కు దొరక్కుండా తప్పించుకుని తిరిగారు. భోలేబాబా డెయిరీ సిబ్బంది సుమారు 40 మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇతర వ్యాపార ప్రదేశాలకు వెళ్లినా సిట్‌కు అక్కడి సిబ్బంది నుంచీ సహాయ నిరాకరణే ఎదురైంది. తర్వాత ఈ నలుగురూ పట్టుబడినా అప్పటికే వారు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా తమ పాత మొ బైల్‌ ఫోన్లను ధ్వంసం చేసేశారని సిట్‌ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో నిందితుల తరపున కీలకంగా వ్యవహరించిన వైష్ణవి డెయిరీ ప్లాంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కలీముల్లా ఖాన్‌ అలియాస్‌ సామిర్‌ పరారీలో వున్నారు. అతడు వైష్ణవి డెయిరీ సీఈవో చావడాకు సన్నిహిత బంధువని సిట్‌ గుర్తించింది.

Updated Date - Feb 12 , 2025 | 05:00 AM