Mithun Reddy: మిథున్‌రెడ్డికి చుక్కెదురు
ABN , Publish Date - May 14 , 2025 | 05:37 AM
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టునే ఆశ్రయించాలని సూచించి, మధ్యంతర రక్షణను రద్దు చేసింది.
బెయిల్‌కోసం హైకోర్టునే ఆశ్రయించండి
మద్యం కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ఎంపీకి కల్పించిన మధ్యంతర రక్షణ రద్దు
న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టునే ఆశ్రయించాలని ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో కల్పించిన మధ్యంతర రక్షణను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణను ఇంతటితో ముగిస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి గత నెల మూడోతేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇరువాదనల తర్వాత ధర్మాసనం తన తీర్పును వెల్లడించింది. హైకోర్టులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయానికి మద్యం కేసులో ఆయనను నిందితునిగా చేర్చలేదని, అరెస్టు చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో మిథున్‌రెడ్డిని నిందితునిగా చేర్చామని ముకుల్ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
నిందితునిగా లేనివ్యక్తి బెయిల్ కోసం ఎందుకు పిటిషన్ దాఖలు చేశారని గతంలో హైకోర్టు ప్రశ్నించిందని, ఇప్పుడు ఆయనను నిందితుడిగా చేర్చినందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభిషేక్ మను సింఘ్వీ విజ్ఞప్తి చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం మరోసారి హైకోర్టునే ఆశ్రయించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో నిందితుడు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తున్నారని, ఇప్పటికే దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరయ్యారని, హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అభిషేక్ మను సింఘ్వీ కోరారు. కేసు పెట్టిన వెంటనే యాంత్రికంగా అరెస్టు చేయాలనే ఆలోచన సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అరెస్టుకు సహజమైన కారణాలు ఉండాలని సూచించింది. అయితే, కేసు విచారణకు సహకరిస్తే అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదని, హైకోర్టు నిర్ణయం వెలువరించేవరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయబోమని ముకుల్ రోహిత్గీ తెలిపారు. దీంతో నాలుగు వారాల్లో మిథున్‌రెడ్డి పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో దర్యాప్తుసంస్థ సమర్పించిన నివేదికలను హైకోర్టు ఆధారంగా తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..