AP High Court: సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్
ABN , Publish Date - Jul 06 , 2025 | 05:03 AM
సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసులలో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రంలోని మేజిస్ట్రేట్లకు హైకోర్టు స్పష్టంచేసింది

ఉల్లంఘిస్తే శాఖాపరమైన విచారణ.. కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
మేజిస్ట్రేట్‌లకు హైకోర్టు స్పష్టీకరణ.. సర్క్యులర్ జారీ చేసిన రిజిస్ట్రార్
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసులలో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రంలోని మేజిస్ట్రేట్లకు హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ శనివారం సర్క్యులర్ జారీ చేశారు. నిందితులకు రిమాండ్ విధించే సమయంలో అర్నే్‌షకుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పట్టించుకోకుండా మేజిస్ట్రేట్‌లు నిందితులకు రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు దృష్టికి వచ్చిందని హైకోర్టు తెలిపింది. ప్రసంగం, రచన, కళాత్మక వ్యక్తీకరణకు సంబంధించి అందిన ఫిర్యాదులలో ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 173(3) కింద ప్రాథమిక విచారణ జరపాలని(3-7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులు) పోలీసులకు స్పష్టం చేసింది. ప్రాథమిక విచారణకు ముందు సంబంధిత డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలని, 14 రోజుల్లో విచారణ ముగించాలని తీర్పులో పేర్కొంది. నిందితులు సదరు నేరాలను మళ్లీ మళ్లీ చేశారా?. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా?. ఆధారాలను తారుమారు చేయగలరా?. కస్టోడియల్ విచారణ అవసరమా?. తదితర అంశాలపై మేజిస్ట్రేట్లు సంతృప్తి చెందిన తర్వాతే రిమాండ్ విధింపుపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. సర్క్యులర్‌లో సూచనలను మేజిస్ట్రేట్‌లు తప్పకుండా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే శాఖాపరమైన విచారణను ఎదుర్కోవడమే కాకుండా కోర్టు ధిక్కరణ కింద చర్యలకు బాధ్యులవుతారని స్పష్టం చేసింది.