Sanjay Bail Counter: బెయిల్ రద్దు పిటిషన్‌పై కౌంటర్ వేయాలి
ABN , Publish Date - May 07 , 2025 | 06:55 AM
సంజయ్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు 15వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో సంజయ్‌కు మరో అవకాశాన్ని ఇచ్చింది
సంజయ్‌కు సుప్రీంకోర్టు మరో చాన్సు
న్యూఢిల్లీ, మే 6(ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక విభాగంలో అవినీతి ఆరోపణల కేసులో ప్రధాన నిందితుడైన సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 15వ తేదీలోపు కౌంటర్ దాఖలుచేయాలని సుప్రీంకోర్టు ఆయనకు స్పష్టం చేసింది. ఈమేరకు ఆయనకు మరో అవకాశమిచ్చింది. తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. అగ్నిమాపక శాఖలో ఎన్వోసీలు ఆన్‌లైన్లో జారీచేసేందుకు అగ్ని ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థకు నాడు ఫైర్ విభాగం డీజీగా ఉన్న సంజయ్ అప్పగించారు. ఎలాంటి పనులూ జరగకపోయినా ఆ సంస్థకు రూ.59.93 లక్షలు చెల్లించేశారు.
సీఐడీ తరపున ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు ఇచ్చి రూ.1.19 కోట్లు చెల్లించారు. ఈ రెండు అంశాల్లో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం కలిగించారని విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రధాన నిందితుడిగా సంజయ్ పేరును చేర్చింది. ఈ కేసులో ఆయనకు రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గత విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. ప్రభుత్వ పిటిషన్ మంగళవారం జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. కౌంటర్ దాఖలుకు గడువు కావాలని సంజయ్ తరఫు న్యాయవాది కోరగా.. విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.