Super Six Celebration: నేడే సూపర్ సిక్స్ జయభేరి
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:16 AM
సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో భారీ ఎత్తున బుధవారం నిర్వహించనున్న సభ ద్వారా రాయలసీమలో సత్తా చాటాలని కూటమి పార్టీలు లక్ష్యంగా ..
ఎన్నికల హామీల అమలుతో అనంతలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ భారీ సభ
చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా హాజరవుతున్న 3 పార్టీల నేతలు
అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో తొలి సభ
రాయలసీమపై పట్టుసాధించే దిశగా వరుసగా సభల నిర్వహణ
మేలో కడపలో ‘మహానాడు’ పండుగ
నేడు అనంతలో సూపర్ సిక్స్ సభ
అంగరంగ వైభవంగా ఏర్పాట్లు 3.5 లక్షల మంది వస్తారని అంచనా
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల విజయోత్సవ సభ బుధవారం అనంతపురంలో జరగనుంది. ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో నిర్వహించే ఈ సభకు కూటమిలోని మూడు పార్టీల నాయకులు, మంత్రులు సహా ఇతర నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
అమరావతి/అనంతపురం(క్రైం), సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో భారీ ఎత్తున బుధవారం నిర్వహించనున్న సభ ద్వారా రాయలసీమలో సత్తా చాటాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అనంతపురంలో జరగనున్న ఈ సభలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా ఆయా పార్టీల నేతలు పాల్గొననున్నారు.


పండగ తెచ్చిన పథకాలివే!
దీపం 2.0: మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఫలితంగా మహిళల వంటింటి ఖర్చు భారీగా తగ్గింది.
తల్లికి వందనం: ఈ పథకం ద్వారా ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ రూ.13 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద మొత్తం 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు. మరో రూ.2 వేలను పాఠశాలల అభివృద్ధికి వెచ్చిస్తున్నారు.
అన్నదాత సుఖీభవ: ఈ పథకం కింద 44 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.20వేలను మూడు విడతలుగా అందిస్తారు. తొలి విడతగా.. రూ.7 వేలను ఇప్పటికే అన్నదాతల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
స్ర్తీ శక్తి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఈ పథకాన్ని గతనెల 15నుంచి అమలు చేస్తున్నారు. తద్వారా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి వరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దీంతో వారికి ప్రయాణ ఖర్చుల రూపంలో నెలకు సుమారు రూ.3-4 వేల వరకు మిగులుతున్నాయి.

మరెన్నో..
సూపర్ సిక్స్ పథకాలతోపాటు.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల కుటుంబాల్లో ప్రభుత్వం సంతోషం నింపుతోంది. రాష్ట్రంలో 200 పైచిలుకు ‘అన్న క్యాంటీన్’లను ఏర్పాటు చేసి.. పేదలకు రూ.5కే ప్రభుత్వం కడుపు నిండా అన్నం పెడుతోంది. మెగా డీఎస్సీ నిర్వహణతో 16 వేలకు పైగా కొలువులు కల్పించింది. 15నెలల కాలంలో సుమారు రూ.10 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకుని యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు రాయలసీమపై మరింత పట్టు బిగించేందుకు ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభకు శ్రీకారం చుట్టారు.
50 ఎకరాలు.. అదిరేలా ఏర్పాట్లు!
ఈ సభకు 50 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి 3.50 లక్షల మంది ప్రజలు, ఆయా పార్టీల అభిమానులు సభకు వస్తారని అంచనాతో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పది మందికి పైగా మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు అనంతపురం చేరుకున్నారు. వేలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నారాయణ పర్యవేక్షిస్తున్నారు. అనంతపురం నగర శివారులో బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన, శ్రీనగర్ కాలనీలో ఉన్న జీఎంఆర్ ఇంద్రప్రస్థ గ్రౌండ్స్‌లో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభ జరగనుంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ స్థలంలో 3.50 లక్షల మంది కూర్చునేలా గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచారు. శ్రీనగర్ కాలనీ, నేషనల్ హైవే-44కు ఇరువైపులా వందలాది ఖాళీ స్థలాలు, ప్రసన్నాయపల్లి రైల్వే గేట్ సమీపంలోని ఖాళీ స్థలాలు, రాప్తాడు మండలంలోని పలు ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
సీమలోనే ఎందుకంటే?
సూపర్ సిక్స్ సభను రాయలసీమలో నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 49 స్థానాల్లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాయలసీమపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తోంది. ఫ్యాక్షన్ కట్టడితోపాటు ఈ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు గత, ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసింది. అనంతపురం జిల్లాకు సాగు, తాగునీరిచ్చింది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కరువు నివారణకు కృషి చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పారిశ్రామికీకరణకు పెద్దపీట వేసింది. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, కర్నూలులో ఓర్వకల్లు హబ్, అనంతపురం జిల్లాలో కియా, విండ్, సోలార్ పవర్ యూనిట్ల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేస్తోంది. రాయలసీమలో హార్టీకల్చర్, పరిశ్రమలు, డెయిరీలు అభివృద్ధి చేసి సీమలో మరింత పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది మేలో కడప జిల్లాలో టీడీపీ ‘మహానాడు’ను నిర్వహించడం ఈ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో సీమలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇప్పుడు అదే ఊపుతో ‘సూపర్ సిక్స్’ సభను అనంతపురంలో నిర్వహిస్తున్నారు.
షెడ్యూల్ ఇదీ..
‘సూపర్ సిక్స్’ సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు జరగనుంది.
సీఎం చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు అనంతపురం నగరంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడే 1.40 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. 2 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుని 4.30 గంటల వరకు సభలో పాల్గొంటారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10.30 గంటలకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఇంటి నుంచి బయలుదేరి 12.30కు పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో 1 గంటకు అనంతపురంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం సభావేదిక వద్దకు చేరుకుని కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 2 గంటల నుంచి సభలో పాల్గొంటారు.