Minister Nadendla Manohar: బియ్యం ఎగుమతులకు సహకారం
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:28 AM
రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు చేసే బియ్యం ఎగుమతులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సులువుగా ఎగుమతులు చేసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.
అక్రమ రవాణా చేస్తే ఉక్కుపాదం: మంత్రి నాదెండ్ల
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు చేసే బియ్యం ఎగుమతులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సులువుగా ఎగుమతులు చేసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే మాత్రం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. ఈ మేరకు కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నుంచి బయటికి వెళ్లే బియ్యంలో పీడీఎస్ బియ్యం ఉండే ప్రసక్తే లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడేవారిపై 6ఎ కేసులతోపాటు పీడీ యాక్ట్, బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు పోర్టులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24/7 సిబ్బందితో నిరంతరం తనిఖీలు కొనసాగించాలని ఆదేశించారు.
ధాన్యం బకాయిలు రూ. 672 కోట్లు విడుదల: అచ్చెన్న, మనోహర్
రాష్ట్రంలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిల సొమ్ము చెల్లించేందుకు రూ. 672 కోట్లు విడుదల చేసేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నిధులు విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 30,988 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.