Share News

AP Endowments Department: దైవాధీనం.. దేవదాయం!

ABN , Publish Date - Dec 09 , 2025 | 05:23 AM

ఆలయాల్లో భక్తులకు సరైన సౌకర్యాలు, మెరుగైన సేవలు అందడం లేదు. దేవుడి దర్శనాల సమయానికి అనుగుణంగా భక్తులను అనుమతించడంలో అధికారులు విఫలమవుతున్నారు. చివరికి ఆలయాల్లో....

AP Endowments Department:  దైవాధీనం.. దేవదాయం!

  • సిబ్బంది కొరతతో.. సౌకర్యాల లేమి

  • ఆలయాల్లో సామాన్య భక్తులకు కష్టాలు

  • సీఎం ఆశించిన స్థాయిలో లేని సౌకర్యాలు

  • ముఖ్యమంత్రి ఆగ్రహం.. అధికారుల మౌనం

  • పోస్టుల భర్తీకి గతేడాదే ముఖ్యమంత్రి ఓకే

  • 300 పోస్టులకు అనుమతి కోరిన దేవదాయశాఖ

  • 7 పోస్టులకే ఆర్థికశాఖ అధికారుల పచ్చజెండా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘ఆలయాల్లో భక్తులకు సరైన సౌకర్యాలు, మెరుగైన సేవలు అందడం లేదు. దేవుడి దర్శనాల సమయానికి అనుగుణంగా భక్తులను అనుమతించడంలో అధికారులు విఫలమవుతున్నారు. చివరికి ఆలయాల్లో పారిశుధ్య పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. భక్తుల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు కూడా సక్రమంగా లేదు.’’ అని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో దేవదాయ శాఖ విఫలం చెందుతోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనాల విషయంలో భక్తులు ఇస్తున్న ఫీడ్‌ బ్యాక్‌లోనూ ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు. వీటన్నింటికీ ప్రధాన కారణం సిబ్బంది కొరతేనన్నది స్పష్టమవుతోంది. అయితే, ఈ సమస్యల పరిష్కారంలో దేవదాయ శాఖ విఫలమవుతోంది. గత పదేళ్ల నుంచి ఈ సమస్య మరింతగా ఎక్కువగా ఉందని శాఖ వర్గాలు చెబుతున్నాయి. శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ప్రధాన ఆలయాలు, ముఖ్య దేవాలయాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉం టోంది. శాఖలో కీలకమైన జాయింట్‌ కమిషనర్లు ఇద్దరే మిగిలారు. డిప్యూటీ కమిషనర్ల పదోన్నతుల వ్యవహారం కూడా మూలకు చేరింది. అసిస్టెంట్‌ కమిషనర్లు, గ్రేడ్‌-1 ఈవోల కొరత మరింతగా శాఖను వేధిస్తోంది. గ్రేడ్‌-3 ఈవోల ఖాళీలు దాదాపు 150 వరకు పెండింగులో ఉన్నాయి. దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఒక్కరంటే ఒక్కరు కూడా జూనియర్‌ అసిస్టెంట్‌ లేరు. ప్రధాన కార్యాలయాలన్నీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో నడిపించాల్సిన దుస్థితి ఏర్పడింది.

భక్తులు-వీఐపీలు

ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య దాదాపు పది రేట్లు పెరిగింది. వీఐపీ ప్రొటోకాల్‌ దర్శనాల తాకిడి కూడా సిబ్బందికి పనిభారం పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య భక్తులను పట్టించుకునేందుకు సిబ్బందికి సమయం ఉండడం లేదు. ఇక, పండగల సమయంలో పరిస్థితి ఆలయ అధికారుల చేతులు దాటిపోతోంది. సామాన్య భక్తులు వ్యక్తిగత క్రమశిక్షణను పాటించడమే తప్ప.. వారి గురించి ఆలోచించే సమయం, వారికి సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి సారించే పరిస్థితి లేదు. క్యూలైన్ల పర్యవేక్షణకు ఏఐను ఉపయోగిస్తున్నా, టెక్నాలజీ వాడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు.


సీఎం మాట.. బేఖాతరు!

దేవదాయ పోస్టుల భర్తీకి సంబంధించి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వచ్చిన ఫైల్‌పై కూడా ఆర్థిక శాఖ ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖకు ఫైల్‌ పంపించేమనే నిర్లక్ష్య ధోరణిలో దేవదాయశాఖ అధికారులు ఉం డడం గమనార్హం. ఇక, ఆర్థిక శాఖలోనూ అదే పరిస్థితి. దీంతో 2 శాఖల మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలావుంటే, దేవదాయ శాఖలో ఖాళీలు భర్తీ చేయడం వల్ల, కొత్తగా ఉద్యోగాలు కల్పించడం వల్ల ఆర్థికశాఖఫై ఎలాంటి భారం ఉండదు. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు మొత్తం ఆలయాల నుంచి వచ్చే నిధుల ద్వారానే అందిస్తారు. సీఎం చెప్పిన వెంటనే దేవదాయ శాఖ ఫైల్‌ సిద్ధం చేసి, ఆర్థిక శాఖ అనుమతిచ్చి ఉంటే ఇప్పటికే దాదాపు 300 మంది ఉద్యోగులు చేరేవారు. విద్య, ఆరోగ్యశాఖల మాదిరిగానే దేవదాయ శాఖకు కూడా ప్రత్యేక నియామకాల బోర్డును ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

జేసీలు జీరో..

దేవదాయ శాఖలో జాయింట్‌ కమిషనర్‌(జేసీ) అనేది కీలక పోస్టు. ఆలయాల ఆస్తులు, లక్షల ఎకరాల భూములకు రక్షణ కల్పించాలంటే అదనపు కమిషనర్లు, జాయింట్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల(డీసీ) పోస్టుల్లో రెగ్యులర్‌ అధికారులు ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఆఘమేఘాల మీద డీసీ పోస్టులు భర్తీ చేస్తేనే శాఖలో పరిపాలన మెరుగుపడుతుంది. ప్రస్తుతం శాఖలో పైనుంచి కింద వరకు ఇన్‌చార్జిలు, లేదంటే రెవెన్యూ అధికారులతో నింపేస్తున్నారు. డీసీ నియామకాలు, పదోన్నతులు లేకపోవడం వల్ల ఆర్జీసీల కొరత కూడా వేధిస్తోంది. శాఖలో 11 ఆర్జేసీ పోస్టులున్నాయి. డీసీ పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేయడం, ఏసీలకు డీసీ పదోన్నతులు కల్పిస్తే, ఆ తర్వాత రెండేళ్లకు వారికి ఆర్జేసీగా పదోన్నతులు లభిస్తాయి. ప్రస్తుతం దేవదాయ శాఖలో సత్యనారాయణమూర్తి, త్రినాథ్‌రావు, చంద్రశేఖర్‌ అజాద్‌లు మాత్రమే రెగ్యులర్‌ ఆర్జేసీలుగా ఉన్నారు. వీరిలో సత్యనారాయణ మూర్తి ఈ నెలలో రిటైర్‌ అవుతారు. త్రినాథ్‌రావు, ఏడీసీ చంద్రకుమార్‌ వచ్చే ఏడాది జనవరిలో రిటైర్‌ కాబోతున్నారు. ఇక మిగిలేది ఆర్జేసీ చంద్రశేఖర్‌ ఆజాద్‌. ఆయన కూడా ఏడీసీ చంద్రశేఖర్‌ రిటైర్‌ కాగానే ఏడీసీగా పదోన్నతి పొందుతారు. దీంతో శాఖలో జేసీ పోస్టులు జీరో అవుతాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనం త వేగంగా ఏపీపీఎస్సీ ద్వారా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేస్తే కొంత వరకు సమస్య పరిష్కారమవుతుంది.


సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా..

దేవదాయ శాఖలో సిబ్బంది నియామకంపై సీఎం చంద్రబాబు ఆదేశించిన 6 నెలల తర్వాత ఖాళీల జాబితాను సిద్ధం చేసింది. ఈ ఏడాది మార్చి 8న ఫైల్‌ సిద్ధం చేసి పంపితే, అక్కడ కీలక అధికారి వద్ద 7 నెలలుగా ఈ ఫైల్‌ ఉండిపోయింది. మరోవైపు దాదాపు 300 పోస్టుల భర్తీకి అనుమతి కోరితే.. కేవలం 7 గ్రేడ్‌-3 ఈవోల భర్తీకి మాత్రమే ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

డీసీ నోటిఫికేషన్‌ ఏదీ?

దేవదాయ శాఖలో 29 డిప్యూటీ కమిషనర్‌(డీసీ) పోస్టులు ఉన్నాయి. వీటిలో 23 పోస్టులు పదోన్నతి ద్వారా 6 ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. 1996లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీపీఎస్సీ ద్వారా 2 డీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. చాలా కాలం తర్వాత డీసీ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా ఆర్థిక శాఖ అనుమతించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం డీసీ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టకపోతే దేవదాయ శాఖలో అధికారుల కొరత మరింత తీవ్రం కానుందన్న వాదన వినిపిస్తోంది.

Updated Date - Dec 09 , 2025 | 05:23 AM