Share News

SRM University student: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో తనిఖీలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 04:34 AM

రాజధాని అమరావతిలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తనిఖీలు నిర్వహించింది.

SRM University student: ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో తనిఖీలు

  • 300 మంది విద్యార్థులకు అస్వస్థతపై ప్రభుత్వం చర్యలు

  • నివేదిక ఇవ్వాలని గుంటూరు కలెక్టర్‌కు ఆదేశం

  • ఆరుగురితో విచారణ కమిటీని నియమించిన కలెక్టర్‌

  • హుటాహుటిన యూనివర్సిటీకి చేరుకున్న కమిటీ

మంగళగిరి/గుంటూరు(విద్య), నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తనిఖీలు నిర్వహించింది. నాలుగు రోజుల కిందట హాస్టల్‌లో నాసిరకం ఆహారాన్ని భుజించి 300 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని మంగళగిరిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి గోప్యంగా చికిత్స చేయిస్తున్నారు. దీంతో విద్యార్థులు బుధవారం నుంచి వర్సిటీలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నట్టు వార్తలు వెలువడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం వర్సిటీకి చేరుకున్నారు. మరోవైపు ఆందోళనకు దిగిన విద్యార్థులను వర్సిటీ పీఆర్‌వో వేణుగోపాల్‌ పలురకాలుగా బెదిరిస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ రెండుసార్లు ఎస్‌ఆర్‌ఎంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే విషయం బయటకు పొక్కకుండా విద్యార్థులను యాజమాన్యం అదిలించి, బెదిరించి తమ దారికి తెచ్చుకుందనే ఆరోపణలున్నాయి. ఎస్‌ఆర్‌ఎంలో ఉద్రిక్త పరిస్థితుల సమాచారాన్ని అందుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించింది. వర్సిటీలో అసలు ఏం జరుగుతుందో సవివరంగా నివేదికను ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను ఆదేశించింది. దీంతో ఎస్‌ఆర్‌ఎంలో ఆందోళనలకు దారితీసిన అంశాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశిస్తూ తెనాలి సబ్‌ కలెక్టర్‌ అంజనా సిన్హా నేతృత్వంలో ఆరుగురు అధికారులతో అత్యవసరంగా కమిటీని నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ గురువారం యుద్ధప్రాతిపదికన వర్సిటీకి చేరుకుని విచారణ చేపట్టింది.


300 మందికి అస్వస్థత

వాస్తవమే: విచారణ కమిటీ

విచారణ కమిటీ ఎస్‌ఆర్‌ఎంలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టింది. మంగళగిరిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులను కూడా పరామర్శించి వివరాలను సేకరించింది. విచారణాధికారి అంజనా సిన్హా మాట్లాడుతూ వర్సిటీలో ఫుడ్‌ పాయిజన్‌ అయినమాట వాస్తవమేనని చెప్పారు. సుమారు 300 మందికిపైగా విద్యార్థులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫుడ్‌ శాంపిల్స్‌, వాటర్‌ శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. వర్సిటీకి వచ్చే నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే అంశమై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతోనూ విచారణ చేయిస్తున్నామని తెలిపారు.

రెండు వారాలు సెలవులు

తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ గురువారం ప్రకటన జారీ చేశారు. వర్సిటీ అంతటా సమగ్రంగా శానిటైజేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే, విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వర్సిటీ యాజమాన్యం మరో ప్రకటనలో తెలిపింది. వాస్తవికతకు భిన్నంగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. విద్యార్థులు ఆందోళన చెందనవసరం లేదంది.

Updated Date - Nov 07 , 2025 | 04:36 AM