Share News

నాగావళిలో యువకుడి గల్లంతు

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:55 PM

నాగావళి నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మరొక యువకుడిని స్థానికుడు కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

నాగావళిలో యువకుడి గల్లంతు
ఉదయ్‌ (ఫైల్‌)

- మరొకరిని కాపాడిన స్థానికుడు

- అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు

- ప్రమాదకరంగా నదిలో గోతులు

శ్రీకాకుళం క్రైం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): నాగావళి నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. మరొక యువకుడిని స్థానికుడు కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గల్లంతైన యువకుడి కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం టూటౌన్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కృష్ణాపార్కు వద్ద గల మహిళమండల వీధికి చెందిన వమ్మి ఉదయ్‌(18), తన స్నేహితులు లోకేష్‌, ప్రసాద్‌, కార్తీక్‌ కలిసి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తమ వీధికి ఆనుకుని ఉన్న నాగావళి నదీ తీరానికి వెళ్లారు. ఉదయ్‌, లోకేష్‌ స్నానం కోసం నదిలోకి దిగగా, మిగతా ఇద్దరు ఒడ్డుపై ఉన్నారు. నీటి ప్రవాహానికి ఉదయ్‌, లోకేష్‌ కొట్టుకుపోతుండడాన్ని స్నేహితులు గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వారివల్ల సాధ్యంకాకపోవడంతో కేకలు వేశారు. దీంతో అక్కడే నదిలో చేపలు పడుతున్న జైరామ్‌ అనే స్థానికుడు లోకేష్‌ను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఉదయ్‌ జాడ మాత్రం కనిపించలేదు. స్థానికుల సమాచారంతో టూటౌన్‌ ఎస్‌ఐలు రామారావు, లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఉదయ్‌ కోసం నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

నెల కిందటే వచ్చాడు..

ఉదయ్‌కు తండ్రి నారాయణరావు, తల్లి కుమారి, ఒక సోదరి ఉన్నారు. తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లి గృహణి. ఐటీఐ పూర్తి చేసిన ఉదయ్‌ ఇటీవల అప్రెంటీస్‌ కోసం కోల్‌కత్తాకు వెళ్లాడు. అప్రెంటీస్‌ పూర్తి చేసుకుని నెల రోజులు కిందటే ఇంటికి వచ్చాడు. త్వరలోనే ఏదైనా ఉద్యోగంలో చేరి కుటుంబ భారాన్ని కొంతవరకు మోస్తానని తమకు భరోసా ఇచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంతలోనే నదిలో గల్లంతు కావడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదకరంగా గోతులు..

నగరంలోని మహిళా మండల వీధి, కృష్ణాపార్కు, తురాయి చెట్టువీధి, పెద్దరెల్లివీధి వద్ద నాగావళి నదిలో గతంలో ఇసుకను పెద్ద మొత్తంలో తవ్వి ఎడ్ల బండ్లలో తరలించారు. దీంతో నదిలో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. స్నానాల కోసం నీటిలో దిగుతున్న వారు గోతుల్లో పడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Nov 09 , 2025 | 10:55 PM