అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:54 PM
అనుమానా స్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన పాతపట్నం పట్టణంలో చోటుచేసుకుంది.
పాతపట్నం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): అనుమానా స్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన పాతపట్నం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక మొండిగొల్లవీధికి చెందిన నల్లి రాజు(34) స్థానిక ఎస్సీ వీధి శివారులో విగతజీవిగా పడివున్నాడు. బుధ వారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో భోజనం చేసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి న రాజు తిరిగి రాలేదు. ఈ క్రమంలో గురువారం ఉ దయం ఎస్సీవీధి మీదుగా మహేంద్రతనయ నదివైపు వెళ్లిన కొంతమంది విగతజీవిగా ఉన్న రాజును గుర్తించి సమీప పొలాల్లో ఉన్న రైతులకు తెలియజేశారు. దీంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించి నల్లి రాజుగా గుర్తించి అతడి పెద్దనాన్న నల్లి రాజారావుకి తెలియజేశారు. వెంటనే కుటుంబ సభ్యులతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రాజును స్థానిక సామాజిక ఆసుపత్రికు తరలించారు. అయితే అప్పటికే రాజు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ వి.రా మారావు.. పాతపట్నం, మెళియాపుట్టి ఎస్‌ఐలు బి.లావణ్య, రమేష్‌నాయుడు, సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజుకు చెందిన ద్విచక్ర వాహనం ఘటన స్థలంలోనే ఉండడంతోపాటు సమీపంలోనే అతడి చెప్పులు పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఇది హత్యా?.. లేక ఆత్మహత్య? అన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. రాజు సెల్ ఫోన్ గురువారం వేకువ జాము 3.45 గంటల వరకూ వినియోగంలో ఉన్నట్టు గుర్తించారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం చేరుకొని పరిశీ లించారు. టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాజు కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు.. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు, పోస్టు మార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్టు సీహెచ్‌సీ వైద్యాధికారి గిడుతూరి వేణుగోపాలరావు తెలిపారు. రాజుకి భార్య మౌనిక, ఇద్దరు కుమారు లు సాత్విక్, ధనుష్ ఉన్నారు. మౌనిక ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామారావు తెలిపారు. ఇదిలావుంటే జిల్లాలోనే అత్యంతప్రశాంత పట్టణంగా పేరొందిన పాతపట్నంలో ఇలాంటి ఘటన జరగడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అనారోగ్యంతో దివ్యాంగ విద్యార్థి..
మెళియాపుట్టి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): బానాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుల విద్యార్థి అగ్గల సం దీప్(9) మెళియాపుట్టి జిల్లాపరిషత్ పాఠశాలలో ఉన్న భవిత కేంద్రంలో నాలుగో తరగతి చదువుతున్నాడు. కొ ద్ది రోజులుగా అనారోగ్యంతో గురువారం మృతి చెందిన ట్టు హెచ్‌ఎం ఝాన్సీ తెలిపారు. ప్రతి బుధవారం భవి త కేంద్రానికి వచ్చి ఫిజియోథెరి చేయించుకునేవా రన్నారు. ఈ విద్యార్థికి వినికి యంత్రంతోపాటు గ్రామం నుంచి పాఠశాలకు వస్తున్నందున ప్రతి నెల రూ.3 వేలు ఇచ్చేవాళ్లమన్నారు. అయితే తల్లికి వందనం డబ్బులు వచ్చినప్పటికీ పింఛన్ కోసం గత రెండేళ్లు నుంచి తిరుగుతున్నా మంజూరు కాలేదని సందీప్ తల్లి పార్వతి ఆవేదన వ్యక్తచేసింది.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు..
ఇచ్ఛాపురం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి బెల్లుపడ పాత టోల్‌గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన రాజేంద్రప్రసాద్ చౌదరి(69) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం బౌద్ధ టౌన్‌కు చెందిన రాజేంద్రప్రసాద్ తన స్వగ్రామం కాశీనగర్ దగ్గర కొల్లహరిపురం వచ్చేందుకు గురువారం ఉదయం తన జీప్‌లో బయలు దేరాడు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా బెల్లుపడ పాత టోల్ ప్లాజా వద్ద ఎదురుగా అతివేగంగా వచ్చిన ట్రిప్పర్ ఢీకొనడంతో రాజేంద్రప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఏఎస్‌ఐ చక్రధర్ తెలిపారు.
గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
సరుబుజ్జిలి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): తురకపేట గ్రామానికి చెందిన గదిలి రమణమూర్తి (52) భార్యతో మనస్పర్థల కారణంగా మనస్థాపానికి గురై బుధ వారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న రమణమూర్తిని గమనించిన భార్య వెంటనే 108లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించింది. అక్కడ పాథమిక చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. బుధవారం రాత్రి విశాఖపట్నం తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై సరుబుజ్జిలి ఎస్‌ఐ హైమావతి కేసు దర్యాప్తు చేసున్నారు.