Road Accident: సింహగిరి ప్రదక్షిణ చేసివస్తూ..
ABN , Publish Date - Jul 10 , 2025 | 11:58 PM
Devotional Trip Tragedy ‘కొడుకా దైవ దర్శనానికి వెళ్లి వస్తానన్నావురా.. దేవుడు దగ్గరకే వెళ్లిపోయావా.. మాకు దిక్కెవరురా నాయనా, నీవే ప్రాణంగా బతుకుతున్నాంరా నాయనా, నిన్ను మరవలేమురా కొడుకా’ అంటూ విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట సీహెచ్‌సీ ఆవరణలో కుమారుడి మృతదేహం వద్ద ఓ తల్లి రోదిస్తుండడం చూసిన వారంతా కన్నీరు పెట్టారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరి పరిస్థితి విషమం
కన్నీరు తెప్పించిన తల్లి రోదన
మాకివలసలో విషాదఛాయలు
నరసన్నపేట/ భోగాపురం, జూలై10(ఆంధ్రజ్యోతి): ‘కొడుకా దైవ దర్శనానికి వెళ్లి వస్తానన్నావురా.. దేవుడు దగ్గరకే వెళ్లిపోయావా.. మాకు దిక్కెవరురా నాయనా, నీవే ప్రాణంగా బతుకుతున్నాంరా నాయనా, నిన్ను మరవలేమురా కొడుకా’ అంటూ విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట సీహెచ్‌సీ ఆవరణలో కుమారుడి మృతదేహం వద్ద ఓ తల్లి రోదిస్తుండడం చూసిన వారంతా కన్నీరు పెట్టారు. సింహాచలంలో గిరి ప్రదక్షిణ ముగించుకుని గురువారం ఉదయం స్నేహితుడు తుర్ల చిన్నారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్న రావాడ ఉదయ్‌కుమార్(28) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. చిన్నారావు గాయపడగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఉదయ్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో ఉదయ్ స్వగ్రామం.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలసలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసన్నపేట మండలం మాకివలసకు చెందిన ఇద్దరు స్నేహితులు రావాడ ఉదయ్, తుర్ల చిన్నారావు బుధవారం ద్విచక్రవాహనంపై సింహాచలం వెళ్లారు. అక్కడ రాత్రంతా గిరి ప్రదక్షిణ చేశారు. గురువారం ఉదయం సింహాచలంలో దైవదర్శనం చేసుకొని ఇంటికి తిరుగుప్రయాణం అయ్యారు. భోగాపురం మార్కెట్ సమీపంలో జాతీయ రహదారిపై బ్రిడ్జిపైకి చేరుకుంటుండగా డివైడర్‌ను ఢీకొట్టారు. రావాడ ఉదయ్ తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చొన్న స్నేహితుడు తుర్ల చిన్నారావుకు తీవ్రగాయాలయ్యాయి. చిన్నారావును చికిత్స కోసం తగరపువలస ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఉదయ్ మృత దేహాన్ని సుందరపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకొన్న కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు రావాడ లక్ష్మి, రమణయ్య కుమారుని మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఉదయ్ డిగ్రీ పూర్తి చేశాడు. పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతలోనే ఆ కుటుంబానికి కోలుకోలేని కష్టం వచ్చింది. ఉదయ్‌కు చెల్లి సంద్య ఉంది. సీఐ దుర్గాప్రసాదరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.