Young woman suicide: ఉపాధి కోసం వెళ్లి విగతజీవిగా మారి
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:16 AM
Young woman suicide: మస్కట్ దేశంలో జిల్లాకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
- మస్కట్‌లో జిల్లా యువతి ఆత్మహత్య
- నాలుగు నెలల కిందటే వెళ్లిన వైనం
ఆమదాలవలస, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మస్కట్ దేశంలో జిల్లాకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. నాలుగు నెలల కిందటే ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన యువతి విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందిన సవలాపురం నాగమణి (25) మస్కట్‌లో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి సరోజని మాట్లాడుతూ.. తన కుమార్తె జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లి నాలుగు సంవత్సరాల పాటు అక్కడే పనిచేసి ఇంటికి డబ్బులు పంపించేదని తెలిపారు. ఇటీవల మస్కట్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిందన్నారు. మళ్లీ నాలుగు నెలల కిందట ఒక ఏజెంట్ ద్వారా మస్కట్‌కు వెళ్లిందన్నారు. మూడు రోజుల కిందట తన కుమార్తె ఫోన్ చేసి అక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారని, ఇంటికి తిరిగి వచ్చేస్తానని చెప్పిందన్నారు. కొద్దిసేపటి తర్వాత ఏజెంట్ ఫోన్ చేసి.. ‘మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.’అని తెలిపాడని, ఆ ఫోటోలు తనకు పంపించాలని కోరినా ఇవ్వలేదని తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌యుడుతో మాట్లాడారు. స్వదేశానికి మృతదేహాన్ని రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. తన కుమార్తె మరణానికి గల కారణాలపై దర్యాప్తు నిర్వహించి ఏమైందో బయటపెట్టాలని మృతురాలు తల్లి సరోజని రామ్మోహన్‌నాయుడును కోరారు.