Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:47 PM

జలంత్రకోట జాతీయ రహదారి కూడలి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోకర్ణపురానికి చెందిన సీర సాయికుమార్‌ (28) మృతి చెందాడు. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సాయికుమార్‌ (ఫైల్‌)

- ఏడాదిన్నర కిందట రైలు ప్రమాదంలో రెండో కుమారుడు..

- లబోదిబోమంటున్న కుటుంబ సభ్యులు

కంచిలి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జలంత్రకోట జాతీయ రహదారి కూడలి వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోకర్ణపురానికి చెందిన సీర సాయికుమార్‌ (28) మృతి చెందాడు. స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గోకర్ణపురానికి చెందిన సాయి కుమార్‌ తన ద్విచక్ర వాహనంపై సోంపేట వెళుతుండగా జలంత్రకోట సమీపంలో రోడ్డు పనులు చేసేందుకు ఉంచిన వస్తువులను బలంగా ఢీ కొన్నాడు. ఈ క్రమంలో బైక్‌ అదుపుతప్పి హైవేపై పడ్డాడు. అదే సమయంలో పలాస వైపు నుంచి ఇచ్ఛాపురం వైపు వెళుతున్న లారీ వెనుక చక్రాల కింద అతడు పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీని స్థానికుల సమాచారం మేరకు ఒడిశా సరిహద్దు ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సాయి కుమార్‌ తండ్రి శ్యామ్‌ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాని పోషి స్తున్నాడు. తల్లి చంద్రమ్మ గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సాయికుమార్‌. చిన్న కుమారుడు రామకృష్ణ సైతం ఏడాదిన్నర కిందట రైలు ప్రమాదంలో మృతి చెందాడు. చేతికి అందివచ్చిన కొడుకులిద్దరూ అకాల మరణంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. సాయికుమార్‌ పదో తరగతి చదువుకుని ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. మూడు నెలల కిందటే దుబాయ్‌ నుంచి ఇంటికి వచ్చాడు. మరలా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన స్నేహితుడికి అవసరమైన సామగ్రి కొనుగోలుకు మంగళవారం సోంపేట వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సాయి కుమార్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.

Updated Date - Dec 09 , 2025 | 11:47 PM