వ్యాన్ ఢీకొని యువకుడి దుర్మరణం
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:31 AM
లావేరు మండలం తాళ్లవలస వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జలుమూరు మండలం గొటివాడ గ్రామానికి చెందిన ముత్తా పవన్ కుమార్ (25) దుర్మరణం పాలయ్యాడు.
లావేరు/జలుమూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): లావేరు మండలం తాళ్లవలస వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జలుమూరు మండలం గొటివాడ గ్రామానికి చెందిన ముత్తా పవన్ కుమార్ (25) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు వివరాలివీ... పవన్ కుమార్ విశాఖపట్నంలోని ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. స్నేహితులు, బంధువులతో మూడు రోజులు సరదాగా గడిపాడు. సోమవారం తిరిగి ద్విచక్ర వాహనంపై వైజాగ్ వెళుతుండగా తాళ్లవలస వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన వ్యాన్ ఢీకొంది. ఈ సంఘటనలో పవన్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న గొటివాడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పవన్‌కుమార్‌కు తల్లిదండ్రులు ఉషారాణి, నర్సింగరావు, సోదరుడు సాయి ఉన్నారు. తండ్రి విశ్రాంత మిలిటరీ ఉద్యోగి. తల్లి గృహిణి. ఇంటి నుంచి బయలుదేరి గంట సమయం గడవక మునుపే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి నర్సింగరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు లావేరు ఎస్‌ఐ లక్ష్మణరావు చెప్పారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రణస్థలం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): సీతారాంపురం గ్రామానికి చెందిన ఎం.రమణ అనే వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. కుటుంబ కలహాలతో ఈనెల 15న రమణ చీమల మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న రమణను వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదం
పలాస యువతి, మరో యువకుడు దుర్మరణం
కొమ్మాది (విశాఖపట్నం), ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నగరం పి.ఎం.పాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. పి.ఎం.పాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జోడుగుళ్లపాలెంకు చెందిన వాసుపల్లి సతీష్ (19), శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సంబాల ఉషారాణి స్నేహితులు. ఉషారాణి ఉద్యోగ అన్వేషణ నిమిత్తం పరదేశిపాలెంలో గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. సోమవారం సాయంత్రం సతీష్, ఉషారాణి ఇద్దరూ ద్విచక్రవాహనంపై పరదేశిపాలెం నుంచి విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. జాతీయ రహదారి మధురవాడ బస్టాప్ వద్దకు చేరేసరికి లారీని అధిగమించబోయి దాని కింద పడిపోవటంతో ఇద్దరి తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.