రైలు కిందపడి యువకుడు మృతి
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:19 AM
కామేశ్వరిపేట రైల్వేగేట్ సమీపంలో సోమవారం రాత్రి జరుగుళ్ల చిట్టిబాబు (31) అనే యువకుడు గుర్తుతెలియని రైలు కింద పడి మృతిచెందినట్టు శ్రీకాకుళం రోడ్ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు.
నరసన్నపేట, జూలై 29(ఆంధ్రజ్యోతి): కామేశ్వరిపేట రైల్వేగేట్ సమీపంలో సోమవారం రాత్రి జరుగుళ్ల చిట్టిబాబు (31) అనే యువకుడు గుర్తుతెలియని రైలు కింద పడి మృతిచెందినట్టు శ్రీకాకుళం రోడ్ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు మంగళవారం ఉదయం ఉర్లాం- కామేశ్వరిపేట ట్రాక్ మధ్య ఉన్న చిట్టిబాబు మృతిదేహాన్ని గుర్తించారు. మృతుడిది బలగ సమీపంలో గల బుచ్చిపేటకు చెందిన జరుగుళ్లు అప్పారావు కుమారుడు చిట్టిబాబుగా గుర్తించినట్టు హెచ్‌సీ తెలిపారు. అయితే చిట్టిబాబు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
కాలువలో పడి ఒకరు ..
శ్రీకాకుళం క్రైం, జూలై 29(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో గల మురుగు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రెండో పట్టణ పోలీసుల కథనం మేరకు... ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామానికి చెందిన నూక సింహాచలం(55) కిడ్నీలో రాళ్లు ఉండడంతో కొద్దిరోజులుగా రిమ్స్‌కు వెళ్లి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తన కుమారుడితో సింహాచలం ఇంటి నుంచి బయలుదేరి అంబేడ్కర్ కూడలికి చేరుకున్నాడు. అక్కడి నుంచి సింహాచలం ఒక్కడే ఆర్ట్స్ కళాశాల రోడ్డు గుండా రిమ్స్‌కు నడుచుకుంటూ బయలుదేరాడు. కాస్త దూరం వెళ్లే సరికి అస్వస్థతకు గురై వాంతులు చేసుకొనేందుకు పక్కనే ఉన్న మురుగు కాలువ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. స్థానికులు గమనించి సింహాచలాన్ని బయటకు తీసి అతడి కుమారుడికి సమాచారం తెలియజేశారు. అంబేడ్కర్ జంక్షన్‌లో గల ఓ జెరాక్స్ షాపులో పనిచేస్తున్న అతడి కుమారుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రిమ్స్‌కు తరలించగా.. అప్పటికే సింహాచలం మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సింహాచలం కుమారుడు ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేశారు. సింహాచ లానికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.