Share News

స్థానికంగా ఉండాల్సిందే!

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:49 AM

జిల్లాలోని చాలా వసతి గృహాల్లో వార్డెన్లు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి.

 స్థానికంగా ఉండాల్సిందే!

- హాస్టళ్ల వార్డెన్లకు ప్రభుత్వం ఆదేశం

- వివిధ మార్గదర్శకాలు జారీ

- వసతి గృహాలను గాడిలో పెట్టేందుకు చర్యలు

పలాస, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని చాలా వసతి గృహాల్లో వార్డెన్లు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించడం, కేవలం విద్యార్థుల వేలిముద్రలను తీసుకోవడానికి మధ్యాహ్నం సరికి పాఠశాలలకు వెళ్లడం తప్పా స్థానికంగా నివాసం ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హాస్టళ్లపై పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించడంతో పాటు వారి చదువులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం హాస్టళ్లను గాడిలో పెట్టడానికి చర్యలు ప్రారంభించింది. వార్డెన్లందరూ స్థానికంగానే నివాసం ఉండాలని, జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఈ నెల 15న మార్గదర్శకాలు జారీ చేసింది.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో మొత్తం 83 హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లు 21, మిగిలిన వసతి గృహాలు 62 ఉన్నాయి. మొత్తం 9వేల మందికి పైగా విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వీరికి సరిపడా నోట్‌పుస్తకాలు, విద్యాసామగ్రి, దుస్తులు తదితర వాటికోసం ప్రభుత్వం ప్రతిఏటా భారీస్థాయిలో నిధులు ఖర్చు చేస్తోంది. అయితే, హాస్టళ్లలో విద్యార్థులను నిరంతరం కంటికి రెప్పలా కాపలా కాయాల్సిన వార్డెన్లు స్థానికంగా నివాసం ఉండడం లేదు. దీంతో విద్యార్థులకు కుక్‌లు, వాచ్‌మెన్లే అన్నీ అవుతున్నారు. వార్డెన్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు స్టడీఅవర్‌లో పాల్గొనలేకపోతున్నారు. వారికి సందేహాలు వస్తే సీనియర్లను అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది విద్యార్థుల చదువుపై ప్రభావం చూపిస్తోంది. సంక్షేమ హాస్టళ్లల్లో ఉతీర్ణత శాతం ఏటా తగ్గుతుందే తప్పా పెరగడం లేదు. హాస్టళ్లకు ఎవరు వస్తున్నారో, ఎవరు బయటకు వెళ్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే..

-హాస్టళ్లు ఉన్న కేంద్రాల్లో వార్డెన్లు తప్పనిసరిగా నివాసం ఉండాలి.

-మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలి.

-వంట తయారీని దగ్గరుండి పర్యవేక్షించాలి.

-అనారోగ్యానికి గురైన విద్యార్థులను డాక్టర్‌ సూచనల మేర కు ఆహారం అందించాలి

- విద్యార్థులను గ్రేడులుగా విభజించి వారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి చదివించాలి.

- ఏదైనా జరగరాని సంఘటన చోటుచేసుకుంటే నిమిషాల్లో అక్కడకు చేరుకోవాలి.

- సంబంధిత విషయంపై జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.

- జీపీఎస్‌తో అనుసంధానం చేసి ఆహారం, విద్యార్థుల ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి.

-కలెక్టర్‌ నెలలో కనీసం రెండు హాస్టళ్లను తనిఖీ చేయాలి.

ప్రభుత్వ విధానం మంచిదే..!

హాస్టళ్లు ఉండే ప్రాంతాల్లో వార్డెన్లు నివాసం ఉండాలనే నిబంధన చాలా మంచిదే. అయితే వార్డెన్ల కొరత కారణంగా కొన్నిచోట్ల ఐదు హాస్టళ్ల నిర్వహణను ఒక్కరే చూస్తున్నారు. దీనివల్ల పర్యవేక్షణ కొరవడుతోంది. పూర్తిస్థాయిలో వార్డెన్లను నియమించి నిబంధనలు అమలు చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది.

-బాలముకుందరావు, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ అధికారి.

Updated Date - Dec 22 , 2025 | 12:49 AM