Share News

Purchase of grain: ‘అదనం’ ఇవ్వాల్సిందే

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:09 AM

Purchase of grain: ఈ రైతు పేరు తంగి రవీంద్ర. కంబకాయి గ్రామం. ఈయన తాను పండించిన ధాన్యం బుధవారం కొనుగోలు కేంద్రానికి తీసుకుని వెళ్లాడు.

Purchase of grain: ‘అదనం’ ఇవ్వాల్సిందే
తంగి రవీంద్ర, రైతు

బస్తాకు 6 కిలోలు ఎక్కువ ఇస్తేనే అన్‌లోడింగ్‌

లేదా ఈలింగ్‌, మార్జిన్‌ పేటిట డబ్బులు ఇస్తేనే..

ధాన్యం రైతును డిమాండ్‌ చేస్తున్న మిల్లరు

నరసన్నపేట, నవంబరు 26(ఆంధ్రజ్యోతి):

ఈ రైతు పేరు తంగి రవీంద్ర. కంబకాయి గ్రామం. ఈయన తాను పండించిన ధాన్యం బుధవారం కొనుగోలు కేంద్రానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ట్రక్‌ షీట్‌ తీసుకుని దేశవానిపేట వద్ద ఉన్న ఓ మిల్లుకు వెళ్లాడు. అయితే మిల్లర్‌ ధాన్యం పరిశీలించి ముక్కలవుతోందన్నాడు. ఈలింగ్‌ (ధాన్యం నుంచి బియ్యం) పేరిట రూ.1421, మార్జిన్‌ పేరిట మరో రూ.420 ఇస్తే ధాన్యం దించుకుంటానని తెగేసి చెప్పాడు. లేదా బస్తాకు అదనంగా ఆరు కిలోలు ఇవ్వాలని పట్టుబట్టాడు. ఈ విషయం ట్రక్‌ షీట్‌ వెనుక కూడా రాశాడు. అయితే అదనంగా ఇవ్వలేనని రైతు చెప్పడంతో.. మిల్లర్‌ ధాన్యం తీసుకోలేదు. అధికారులకు చెప్పినా వారు కూడా పట్టించుకోక పోవడంతో ఆ రైతు నిరాశతో వెనుదిరిగాడు. ఈ ఘటన బుధవారం నరసన్నపేటలో చోటుచేసుకుంది. జిల్లాలో చాలాచోట్ల ఇలానే జరుగుతోంది. మిల్లుల వద్ద ధాన్యం దించడం, చేరినట్లు నివేదిక ఇచ్చే బాధ్యత కస్టోడియన్‌ అధికారులది. అయితే కొన్ని చోట్ల వీరు ఉత్సవవిగ్రహాలుగా మారిపోయారు. ధాన్యం మిల్లుల వద్దకు చేరాక ఈలింగ్‌ను ప్రభుత్వం ఇచ్చిన యంత్రాలతో చేయాలి. కానీ కొందరు మిల్లర్లు తమ యంత్రాలతో చేసి సాకులు చెబుతున్నారు. ఇక్కడే రైతులను మోసం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈలింగ్‌ 95 నుంచి 100 శాతం రావాలని అధికారులు చెబుతుంటే.. మిల్లర్ల యంత్రాలతో చేయడం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దళారులకు బస్తా రూ.1750కే అమ్ముతున్నామని వాపోతున్నారు.

26nnp2.gif

దేశవానిపేట మిల్లు వద్ద అన్‌లోడింగ్‌ చేయకుండా ఉంచిన ధాన్యం లోడ్‌

ఉదయం పది నుంచి పడిగాపులు: తంగి రవీంద్ర, కంబకాయి

దేశనిపేట మిల్లులో ఉదయం 10 గంటలకు 30 బస్తాల ధాన్యం తీసుకువచ్చాను. మిల్లర్‌ బస్తాకు అదనంగా 6కేజీలు అడిగారు. అంత ఇవ్వలేమని చెప్పాను. దీంతో లోడ్‌ దించవద్దని కళాసీలకు మిల్లర్‌ తెలిపారు. అధికారులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. తమ గ్రామానికి చెందిన ఓ నాయకుడికి సమాచారం ఇచ్చాను. ఆయన వచ్చి మాట్లాడినా అదనంగా ఇవ్వాల్సిందేనని మిల్లర్‌ డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన తహసీల్దార్‌ సత్యనారాయణకు ఫోన్‌ చేయగా.. ఇది తమ పరిధిలోలేదని చెప్పారు.

ధాన్యం తీసుకోవాలని ఆదేశించాం: రామక్రిష్ణ, సీఎస్‌డీటీ, నరసన్నపేట

కంబకాయి గ్రామం నుంచి వచ్చిన ధాన్యం మిల్లర్‌ దించడం లేదని పిర్యాదు చేస్తే దేశవానిపేట మిల్లుకు వెళ్లాను. అక్కడ రైతు మిల్లర్‌తో మాట్లాడి అదనంగా ధాన్యం డిమాండ్‌పై ఆరా తీశాను. అదనంగా తీసుకోరాదని మిల్లర్‌ను ఆదేశించాం. అలాగే రైతు తెచ్చిన ధాన్యం ముక్కలు అవుతున్నట్లు మిల్లర్‌ చెప్పడంతో గుర్తించాం. మిల్లులో ధాన్యం దించాలని చెప్పినా.. రైతులు వినకుండా తీసుకుని వెళ్లిపోయారు.

Updated Date - Nov 27 , 2025 | 12:09 AM