మందులూ మావద్ద కొనాల్సిందే
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:35 AM
'Medical' racket of private hospitals in the srikakulam జిల్లాలో సామాన్యుడికి వైద్యం పెనుభారంగా మారుతోంది. రోగానికి చికిత్స కోసం వెళ్తే.. ఆసుపత్రి ఫీజుల కంటే మందుల బిల్లులే తడిసి మోపెడవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, వాటి అనుబంధ మెడికల్ షాపుల మధ్య నడుస్తున్న కమీషన్ల బంధమే.
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల ‘మెడికల్’ దందా
రోగులపై ‘పీడీ’ పిడుగు.. అటకెక్కిన జనరిక్!
కమీషన్లతో యాజమాన్యాలకు అదనపు లాభం
సామాన్య ప్రజలకు తప్పని ఆర్థిక భారం
శ్రీకాకుళం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాన్యుడికి వైద్యం పెనుభారంగా మారుతోంది. రోగానికి చికిత్స కోసం వెళ్తే.. ఆసుపత్రి ఫీజుల కంటే మందుల బిల్లులే తడిసి మోపెడవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, వాటి అనుబంధ మెడికల్ షాపుల మధ్య నడుస్తున్న కమీషన్ల బంధమే. డాక్టర్ రాసే మందులు బయట మార్కెట్‌లో ఎక్కడా దొరకవు. ఆసుపత్రిలో ఉండే మందుల దుకాణంలోనే కొనాలి. తీరా అవి పేరొందిన బ్రాండెడ్ కంపెనీలు కావు. అలాగని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న చవకైన జనరిక్ మందులూ కావు. కేవలం ఆయా ఆసుపత్రులకు భారీగా కమీషన్లు ముట్టజెప్పే ‘పీడీ’ (ప్రోపగండా కమ్ డిస్ట్రిబ్యూషన్/ఫిజీషియన్ డ్రైవెన్) కంపెనీల మందులే. వీటి ఎంఆర్‌పీ అధికంగా ఉండడంతో రోగులకు ఆర్థిక భారం తప్పడం లేదు.
‘పీడీ’ మందుల మాయాజాలం..
జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రులు, నర్శింగ్ హోమ్‌లు ఉన్నాయి. వీటిలో 90 శాతానికిపైగా ఆసుపత్రులకు సొంత మెడికల్ షాపులు ఉన్నాయి. వైద్యులు రోగికి రాసే మందుల చీటి కేవలం తమ ఆసుపత్రి మెడికల్ షాపులోనే దొరికేలా పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు. సాధారణంగా ఫార్మా రంగంలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా వంటి స్టాండర్డ్ బ్రాండెడ్ మందులు.. లేదా ప్రభుత్వం సూచించే జనరిక్ మందులు అందుబాటులో ఉంటాయి. కానీ జిల్లాలో ఇప్పుడు నడుస్తోంది ‘పీడీ’ రాజ్యం. అధిక లాభాలే లక్ష్యంగా.. ఈ మందులు తయారు చేసే కంపెనీలు నేరుగా డాక్టర్లతో లేదా ఆసుపత్రి యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఉదాహరణకు ఒక యాంటీబయోటిక్ స్ట్రిప్ తయారీ, సరఫరా ధర రూ.30 ఉంటే.. దానిపై ముద్రించే రేటు(ఎంఆర్‌పీ) మాత్రం రూ.150 నుంచి రూ. 200 వరకు ఉంటోంది. ఈ ధరకే రోగులకు విక్రయించగా.. ఒక్కో స్ట్రిప్ మీద ఆసుపత్రి యాజమాన్యానికి యాభై శాతం నుంచి 70శాతం వరకు కమీషన్ల రూపంలో లాభం మిగులుతోంది. అదే బ్రాండెడ్ మందులైతే 20 శాతం మార్జిన్ కూడా ఉండదు. అందుకే డాక్టర్లు పీడీ మందులను రాసేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో దొరికే ప్రముఖ బ్రాండెడ్ మందులను గానీ.. అతి తక్కువ ధరకు లభించే జనరిక్ మందులను గానీ రాయడం లేదు. పైదలకు వైద్య ఖర్చులు తగ్గించేందుకు జనరిక్ మందులను వాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. వైద్యులు జనరిక్ పేర్లతోనే మందులు రాయాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) నిబంధనలు పెట్టింది. కానీ జిల్లాలో ఏ ఒక్క ప్రైవేట్ ఆసుపత్రిలోనూ ఈ నిబంధన అమలు కావడం లేదు.
నిర్వాహకుల వాదన ఇలా...
మందుల ధర విషయమై ఆసుపత్రి వర్గాలు తమదైన శైలిలో సమర్థించుకుంటున్నాయి. ‘ప్రస్తుతం ఆసుపత్రి నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగాయి. కేవలం కన్సల్టేషన్ ఫీజులతో ఆసుపత్రిని నడపడం కష్టం. ఫార్మసీ ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆసుపత్రులు మనుగడ సాగిస్తున్నాయి’ అని ఒక ఆసుపత్రి నిర్వాహకుడు తెలిపారు. మరికొందరు.. ‘బయట దొరికే మందుల్లో కల్తీలు ఉంటున్నాయి. మా వద్ద స్టాక్ మా క్వాలిటీ కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి మా షాపులోనే కొనాలని చెబుతాం’ అని వ్యాఖ్యానించారు.
పట్టించుకోని యంత్రాంగం
డ్రగ్ కంట్రోల్ అధికారులు గానీ.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గానీ ఈ వ్యవహారంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో విక్రయించే మందుల నాణ్యత, వాటి ధరల నియంత్రణపై పటిష్టమైన నిఘా లేకపోవడం వల్లే ఈ దోపిడీ సాగుతోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలోనూ కనీసం కొన్ని రకాల సాధారణ మందులైనా జనరిక్ పేర్లతో రాసేలా అధికారులు కఠినచర్యలు తీసుకోవాలి. పీడీ మందుల ఎంఆర్‌పీపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. జిల్లా వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి. మందుల మాఫియాకు అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
వాళ్ల కౌంటర్లోనే మందులు కొనాలన్నారు :
మందుల బిల్లు చూస్తే గుండె ఆగుతోంది. జ్వరం వచ్చిందని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే.. డాక్టర్ ఫీజు రూ. 300 తీసుకున్నారు. బాగానే చూశారు. కానీ మందుల చీటీ రాసి కచ్చితంగా ఆసుపత్రి బయట ఉన్న వాళ్ల కౌంటర్లోనే కొనాలన్నారు. తీరా అక్కడికి వెళ్తే 5 రోజుల మందులకే రూ.1500 అయ్యింది. బయట మెడికల్ షాపులో అడిగితే ‘ఈ కంపెనీ మందులు మా దగ్గర దొరకవండి.. అవి వాళ్లకే స్పెషల్‌గా సరఫరా అవుతాయి’ అని చెప్పారు. అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి.
- శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ బాధితుడు ఆవేదన
ధరల వ్యత్యాసం ఇలా
------------------------------------------------------------------------------------------------------------------
మందు రకం(10 టాబ్లెట్ స్ట్రిప్) జనరిక్‌లో మార్కెట్‌లో బ్రాండెడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో
------------------------------------------------------------------------------------------------------------------
యాంటీబయోటిక్
(ఎమాక్సిక్లావ్ 625ఎంజీ) రూ. 60 - 80 రూ. 200 - 250 రూ. 350 - 450
గ్యాస్ టాబ్లెట్
(పాంటాప్రజోల్ డీఎస్‌ఆర్) రూ. 20 - 30 రూ. 100 - 120 రూ. 160 - 200
నొప్పి నివారణ
(ఎసిక్లోఫెనేక్+పారా) రూ. 15 - 20 రూ. 60 - 80 రూ. 100 - 130
మల్టీ విటమిన్ రూ. 25 - 35 రూ. 100 - 120 రూ. 180 - 220
షుగర్ టాబ్లెట్
(మెట్‌ఫార్మిన్ 500ఎంజీ) రూ. 10 - 15 రూ. 40 - 50 రూ. 80 - 100