ఆ రోడ్లపై ప్రయాణించలేం!
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:22 AM
Road problems హైవే విస్తరణలో భాగంగా రణస్థలంలో ఫైఓవర్ పనులు చేపడుతుండడంతో ప్రధాన రహదారిని సంబంధిత అధికారులు మూసివేశారు. దీంతో సర్వీసు రోడ్లలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఇరుకు రోడ్లు కావడం, వాటిపై మట్టి, ఇసుక వంటివి పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
రణస్థలంలో వాహనదారులకు తప్పని ఇబ్బందులు
ఫ్లై ఓవర్ పనులతో ప్రధాన మార్గం మూసివేత
సర్వీసు రోడ్లపై రాకపోకలు
ఇసుక, మట్టి పేరుకుపోవడంతో తప్పని అవస్థలు
రణస్థలం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): హైవే విస్తరణలో భాగంగా రణస్థలంలో ఫైఓవర్ పనులు చేపడుతుండడంతో ప్రధాన రహదారిని సంబంధిత అధికారులు మూసివేశారు. దీంతో సర్వీసు రోడ్లలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఇరుకు రోడ్లు కావడం, వాటిపై మట్టి, ఇసుక వంటివి పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇసుక, మట్టి కారణంగా రోజంతా దుమ్ము దూళీ రేగుతుండడంతో స్థానికులతో పాటు వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పటికప్పుడు రోడ్లను నీటితో తడిపితే ఈ ఇబ్బందులు ఉండవు. కానీ, ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ దీన్ని పట్టించుకోవడం లేదు. మరోపక్క జిల్లా నుంచి విశాఖ, విజయనగరం జిల్లాలకు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ప్రతిరోజూ వందలాది లారీలు, టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. అయితే, వాహన సామర్థ్యానికి మించి ఇసుకను లోడ్‌చేసి దానిపై చిన్నపాటి టార్పాలిన్ కప్పి తరలిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇసుక రేణువులు వచ్చి వాహనదారులు, ప్రయాణికుల కళ్లలో పడుతున్నాయి. ఆపై హైవేపై దారిపొడవునా ఇసుక పోగులు ఉండిపోతున్నాయి. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పండుగ సీజన్ కావడంతో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా హైవే, జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
చర్యలు చేపడతాం..
వంతెన నిర్మాణ పనుల్లో నిబంధనలు పాటిస్తున్నాం. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైవేను మూసివేసి సర్వీసు రోడ్లకు ట్రాఫిక్‌ను అనుసంధానించాం. ఇసుక పోగులతో పాటు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నాం. రెండుపూటలా రోడ్లపై వాటరింగ్ చేస్తాం. సర్వీస్ రోడ్లను బీటీ రోడ్లగా చేస్తున్నాం. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
-రాధాకృష్ణ, ఫ్లైఓవర్ ప్రాజెక్టు మేనేజర్.