Yoga world: ప్రపంచానికే ఆదర్శంగా.. యోగా
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:22 PM
International Yoga Day Global inspiration యోగాలో ప్రపంచానికే ఆదర్శవంతంగా రాష్ట్రాన్ని నిలబెట్టాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
21న విశాఖలో 5 లక్షల మందితో గిన్నిస్ రికార్డు సాధన
జిల్లా నుంచి 20వేల మందిని తరలించేలా ఏర్పాట్లు
అదేరోజున జిల్లాలో 6,500 చోట్ల కార్యక్రమం
అందరూ భాగస్వాములు కావాలి
రాష్ట్రమంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): యోగాలో ప్రపంచానికే ఆదర్శవంతంగా రాష్ట్రాన్ని నిలబెట్టాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. ‘ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతారు. గిన్నిస్ రికార్డు సాధనలో భాగంగా 5లక్షల మంది యోగాసనాలు వేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే గత నెల 21 నుంచి ఈ నెల 20వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జిల్లాలోని యోగాంధ్ర కార్యక్రమంలో ఇప్పటికే 9.50 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2కోట్ల మందిని ‘యోగాంధ్ర’లో భాగం చేయడమే లక్ష్యం. విశాఖలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లాకు సంబంధించి 20వేల మంది పాల్గొంటారు. వారికి వసతితోపాటు రవాణా సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నాం. యోగాంధ్రలో పాల్గొనేవారికి సర్టిఫికెట్లు అందజేస్తాం. అదే రోజున జిల్లాలో 6,500 చోట్ల యోగా సాధనకు ఏర్పాట్లు చేస్తున్నామ’ని తెలిపారు. యోగాంధ్రలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావుతోపాటు పామర్రు, ఎర్రగొండపాలెం, పెడన ఎమ్మెల్యేలు కుమార్ రాజా, నారాయణరెడ్డి, కాగిత కృష్ణప్రసాద్, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, ఏఎస్పీ కె.వి.రమణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.