వైసీపీ శవ రాజకీయం
ABN , Publish Date - Nov 03 , 2025 | 12:26 AM
Fake video on social media ఓ ప్రైవేట్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనను వైసీపీ సోషల్ మీడియా వేదికగా శవ రాజకీయం చేసేందుకు యత్నించింది. ఓ ఫేక్ వీడియోను పోస్టు చేసి పోలీసులు, ప్రభుత్వంపై తప్పు నెట్టేయాలని చూసింది. దీన్ని పోలీసులు ఖండిస్తూ ఫ్యాక్ట్‌చెక్‌తో అసలు వీడియోను పెట్టారు.
తప్పంతా పోలీసులపై నెట్టేసేలా సోషల్ మీడియాలో ఫేక్ వీడియో
ఖండించిన పోలీసులు
శ్రీకాకుళం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేట్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనను వైసీపీ సోషల్ మీడియా వేదికగా శవ రాజకీయం చేసేందుకు యత్నించింది. ఓ ఫేక్ వీడియోను పోస్టు చేసి పోలీసులు, ప్రభుత్వంపై తప్పు నెట్టేయాలని చూసింది. దీన్ని పోలీసులు ఖండిస్తూ ఫ్యాక్ట్‌చెక్‌తో అసలు వీడియోను పెట్టారు. కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద శనివారం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై అదే రోజు ఆలయ నిర్వహకుడు హరిముకుంద పండా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇంత మంది జనాలు వస్తారని నేను ఊహించలేదని.. భద్రత కోసం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని’ చెప్పారు. ఈ వీడియోను వైసీపీ మార్ఫింగ్ చేసింది. పోలీసులకు ముందు రోజే సమాచారం ఇచ్చినా స్పందించలేదని హరిముకుంద పండా అన్నట్లు ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇదంతా జరిగినట్లు మాజీమంత్రి సీదిరి సైతం వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు స్పందించారు. ఫ్యాక్ట్‌చెక్‌తో వైసీపీ సోషల్ మీడియా ప్రచారానికి బ్రేక్ వేశారు. హరిముకుందపండా శనివారం మాట్లాడిన అసలు వీడియోను.. వైసీపీ పోస్టు చేసిన ఫేక్ వీడియోను పక్కపక్కనే పెట్టి విడుదల చేశారు. దుష్ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీచేశారు. అసలు వీడియోను చూసిన నెటిజన్లు వైసీపీని తిట్టిపోస్తున్నారు. శవ రాజకీయాలు చేయడం ఆ పార్టీకి అలవాటేనంటూ కామెంట్లు చేస్తున్నారు.
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు : డీఐజీ గోపీనాథ్ జట్టి
‘కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు’ అని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ హెచ్చరించారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని విన్నవించారు. పోలీసు శాఖ అధికారిక సమాచారం మాత్రమే నమ్మి.. శాంతి,భద్రతలకు సహకరించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఆదివారం మూడు జిల్లాల పోలీసులతో ముందుగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో కొంతమంది అవాస్తవాలు, అసత్య, దుష్ప్రచారాలను చేస్తున్నారు. ఇది చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఇటువంటి పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నాం. పోస్టులు పెట్టిన వివరాలు, లొకేషన్ ఆధారంగా గుర్తించి అవసరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామ’ని స్పష్టం చేశారు.