Share News

God of Gandhiji : పంట దేవుడిగా.. గాంధీజీకి పూజలు

ABN , Publish Date - Aug 07 , 2025 | 11:23 PM

Gandhamma celebrations జాతిపిత మహాత్మగాంధీజీని ఆ గ్రామంలో దేవతగా కొలుస్తారు. గాంధమ్మ పేరుతో ఆలయాన్ని నిర్మించారు. పంటలు సుభిక్షంగా పండాలని.. ఉడుపుల సమయంలో వరమిచ్చే దేవతగా పూజిస్తారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచీ ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు.

God of Gandhiji : పంట దేవుడిగా.. గాంధీజీకి పూజలు
కేదారిపురంలో గాంధీజీ చిత్రపటానికి పూజలు చేస్తున్న గ్రామస్థులు

కేదారిపురంలో గాంధమ్మ సంబరాలు

ప్రారంభమైన ఖరీఫ్‌ పనులు

పలాసరూరల్‌, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మగాంధీజీని ఆ గ్రామంలో దేవతగా కొలుస్తారు. గాంధమ్మ పేరుతో ఆలయాన్ని నిర్మించారు. పంటలు సుభిక్షంగా పండాలని.. ఉడుపుల సమయంలో వరమిచ్చే దేవతగా పూజిస్తారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచీ ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పలాస మండలం కేదారిపురం గ్రామంలో మహాత్మగాంధీజీ కోసం ఆలయాన్ని నిర్మించి.. గాంధమ్మగా కొలుస్తున్నారు. ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు, గ్రామపెద్దలు గాంధమ్మను పూజించి ఉడుపులు (వరినాట్లు నాటడం) ప్రారంభిస్తారు. ఈ మేరకు గురువారం గాంధమ్మ సంబరాలు నిర్వహించారు. గ్రామచావిడిలో మండపం వద్ద వివిధ వంటకాలు, గజం ముద్దను సమర్పించారు. పూలు, పళ్లతో గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. గాంధీజీ చిత్రపటానికి పూజలు చేశారు. హరేరామ హరేకృష్ణ సంకీర్తనలు ఆలపించారు. గాంధమ్మ ఆలయంతోపాటు గ్రామంలో అమ్మవార్లకు వంటకాలను సమర్పించి పూజలు చేశారు. పంటలు బాగా పండాలని కోరారు. అనంతరం ఖరీఫ్‌ పనులు ప్రారంభించారు. పూజలు చేసిన అనంతరం చిరుజల్లులు పడడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 07 , 2025 | 11:23 PM