Share News

Labor protection: కార్మిక హక్కులను పరిరక్షించాలి

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:41 PM

Employment laws కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్మిక హక్కులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిని కార్మికులంతా ఐక్యంగా తిప్పికొట్టి.. పరిరక్షించాలని పిలుపునిచ్చారు.

Labor protection: కార్మిక హక్కులను పరిరక్షించాలి
ర్యాలీ నిర్వహిస్తున్న వివిధ కార్మిక సంఘాల నాయకులు

  • నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలి

  • సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు

  • అరసవల్లి, జూలై 9(ఆంధ్రజ్యోతి): కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్మిక హక్కులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిని కార్మికులంతా ఐక్యంగా తిప్పికొట్టి.. పరిరక్షించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా శ్రీకాకుళంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ సంఘాల నాయకులు మహాధర్నా నిర్వహించారు. స్థానిక డైమండ్‌ పార్కు నుంచి ఏడురోడ్లకూడలి వరకు ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలి. స్కీం వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి. ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలి. దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించడం దుర్మార్గం. రైల్వేలు, బ్యాంకులు, ఎల్‌ఐసీ, రక్షణ రంగం, ఘనులు, ప్రకృతి వనరులను కార్పొరేట్‌లకు అప్పనంగా అప్పగిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామ’ని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌కేఎం జిల్లా కన్వీనర్‌ టి.ప్రకాష్‌, ఏఐటీయూసీ నాయకులు సీహెచ్‌.గోవిందరావు, తిరుపతిరావు, ఐఎఫ్‌టీయూ నాయకులు ఎం.క్రాంతి, రైతు కూలీ సంఘం కార్యదర్శి టి.అరుణ, మునిసిపల్‌, ఏపీఎంఎస్‌ఆర్‌యు, భవన నిర్మాణ, హమాలీ, రిమ్స్‌, ఏఆర్‌ఎస్‌, నీలం జ్యూట్‌, స్మార్ట్‌కెమ్‌, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, ఏఐటీయూసీ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:41 PM