Workers Are Dying: ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా?
ABN , Publish Date - May 17 , 2025 | 11:46 PM
Workers' deaths Industrial negligence జిల్లాలో కార్మికులకు భద్రత కరువైంది. క్వారీలు, పరిశ్రమలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకోగా.. ఒక్కోసారి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు.
కార్మికులకు భద్రత కరువు
యంత్రాల మధ్య నలిగిపోతున్న శ్రమజీవులు
2023 జూన్ 16న బూర్జ మండలం కొరగాం పంచాయతీ పరిధిలోని ఓ క్వారీలో రాళ్లు పేర్చుతున్న క్రమంలో బాంబు పేలి.. ఒడిశాకు చెందిన దాసు అనే కార్మికుడు మృతిచెందాడు.
2023 జూలై 17న టెక్కలి మండలంలోని ఓ క్వారీలో ఎయిర్ కంప్రెషర్ పేలి బిహార్‌కు చెందిన భూషన్‌దాస్ అనే కార్మికుడు మృతిచెందాడు.
2023 ఆగస్టు 12న టెక్కలి మండలంలో ఓ గ్రానెట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఎక్స్‌కవేటర్ డ్రైవర్ గంగు రమణమూర్తి అనే కార్మికుడు మృతిచెందాడు. విధి నిర్వహణలో ఉండగా.. గ్రానైట్ బ్లాక్ పడడంతో కేబిన్‌లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు.
గతేడాది మార్చి 9న టెక్కలి మండలంలోని ఓ గ్రానైట్ పరిశ్రమలో తాపీమేస్ర్తీగా పనిచేస్తున్న ఓ కార్మికుడు మృతిచెందాడు. క్వారీలో బ్లాక్ డ్రిల్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు.
గత ఏడాది జూన్ 29న పైడిభీమవరంలోని సరాక రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ఒక బ్లాక్‌లో ప్రమాదవశాత్తు పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో సమీపంలో కార్మికులు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
గత ఏడాది జూలైలో పైడిభీమవరం పారిశ్రామికవాడలోని శ్రేయస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. నిల్వల గోదాములపై రేకులు బిగిస్తుండగా ప్రమాదవశాత్తు షమీర్‌షేక్, రహిబుల్‌షేక్ ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా ఈ నెల 16న మెళియాపుట్టి మండలం దీనబందుపురం సమీపాన దబ్బగూడ రెవెన్యూ పరిధిలోని ఓ గ్రానైట్ క్వారీలో ముగ్గురు కార్మికులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు.
రణస్థలం, మే 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కార్మికులకు భద్రత కరువైంది. క్వారీలు, పరిశ్రమలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకోగా.. ఒక్కోసారి కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు. కార్మికుల ప్రాణాలు పోతున్నా.. యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పైడిభీమవరం పారిశ్రామికవాడతోపాటు పలాస ప్రాంతంలో జీడి పరిశ్రమలు ఉన్నాయి. టెక్కలి, పొందూరు వంటి ప్రాంతాల్లో క్వారీలు నడుస్తున్నాయి. పరిశ్రమల్లో కార్మికులకు భద్రత లేదు. కార్మిక చట్టాలను సైతం యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నాయి. యంత్రాల మధ్య పనిచేసే కార్మికులకు హీట్ రెసిస్టెంట్ ఆఫ్రాన్లు, గమ్‌బూట్లు, హెల్మెట్లు గ్లౌజులు విధిగా అందించాలి. వీటిని అందించడంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. బాధితులకు నామమాత్రంగా పరిహారం అందించి యాజమాన్యాలు చేతులు దులుపుకొంటున్నాయి.
అందని ఈఎస్‌ఐ సేవలు
జిల్లాలో పైడిభీమవరంలో దాదాపు 30 పరిశ్రమలున్నాయి. వీటిలో తరచూ ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 22,800 మంది కార్మికులు గుర్తింపు పొందారు. కానీ వీరికి ఈఎస్‌ఐ సేవలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. పైడిభీమవరం పారిశ్రామిక వాడలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విశాఖ, లేదా విజయనగరం తరలించాల్సి వస్తోంది. అత్యవసర వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే తక్షణం 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రితో పాటు అత్యాధునిక వైద్యసదుపాయాలు అందుబాటులోకి తేవాలని కార్మికులు కోరుతున్నారు. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అమ్మో క్వారీలు..
జిల్లాలో వంద వరకూ క్వారీలు నడుస్తున్నాయి. అందులో అనుమతి ఉన్నవి కొన్నే. ప్రధాన రాజకీయ కుటుంబాలకు చెందిన వారి చేతిలో క్వారీలు ఉన్నాయి. అక్కడ ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాత పడుతున్నా.. బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. టెక్కలి, నందిగాం, పొందూరు, కంచిలి, పలాస మండలాల్లో క్వారీల నిర్వహణ అధికం. ఇక్కడ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కానీ వెలుగుచూసిన ఘటనలు కొన్నే. రాజకీయ జోక్యంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మైన్స్ మేనేజర్ పర్యవేక్షణలో గ్రానైట్ క్వారీ నిర్వహణ పనులు చేయాలి. కాగా జిల్లాలోని గ్రానైట్ క్వారీల్లో మైన్స్ మేనేజర్ పోస్టులు ఎక్కడా భర్తీకాలేదు. ఫలితంగా క్వారీల నిర్వహణ అడ్డగోలుగా సాగుతోంది. గ్రానైట్ క్వారీల్లో పేలుళ్లకు చీఫ్‌కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌క్లోజివ్స్, చెన్నై అనుమతులు ఉండాలి. కానీ జిల్లాలో ఆ పరిస్థితులు ఎక్కడా లేవు. గతంలో కోటేశ్వరరావు కలెక్టర్‌గా వ్యవహరించినప్పుడు గ్రానైట్ క్వారీల్లో పేలుళ్లకు సంబంధించి ఎన్‌వోసీలు జారీచేశారు. ఆ తరువాత ఎన్‌వోసీల జారీ ప్రక్రియ గాలికొదిలేశారు. జిల్లాలో టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం, మెళియాపుట్టి, సారవకోట, పాతపట్నం తదితర ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉన్నాయి. టెక్కలి ప్రాంతంలో గూడేం, సొంటినూరు, లింగాలవలస, అడ్డుకొండ, మొఖలింగాపురం తదితర ప్రాంతాల్లో క్వారీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా క్వారీల్లో యథేచ్ఛగా పేలుళ్లు జరుగుతున్నా పోలీసులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. క్వారీల్లో ఏదైనా ప్రమాదం జరిగితే.. మృతుల కుటుంబ సభ్యులకు యాజమానులు కొంత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. భద్రతా ప్రమాణాలు మాత్రం పాటించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు హడావుడి చేయడం, ఆ తరువాత వాటి ఊసు మరిచిపోవడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు.
కానరాని తనిఖీలు
వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిశ్రమలను తనిఖీ చేయాలి. ఇన్‌స్పెక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్, భూగర్భ గనుల శాఖ, కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేయాలి. కానీ ఈ అధికారులు ఎక్కడుంటారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లాల విభజన జరిగినా.. ఈ కార్యాలయాలు మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతున్నాయి. సిబ్బంది కొరత సాకుతో తనిఖీలు సక్రమంగా సాగడం లేదు. పరిశ్రమల నిర్వహణలో యాజమాన్యాల నిర్లక్ష్యం, భద్రతాచర్యలు పాటించకపోవడం, కార్మిక చట్టాలను అమలు చేయకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా కార్మికుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముంది.
పట్టించుకోని కార్మిక శాఖ
జిల్లాలో కార్మిక శాఖ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. పరిశ్రమలు మూతపడుతున్నా పట్టించుకోవడం లేదు. కార్మిక చట్టాలను అమలుచేయకపోయినా చర్యలు తీసుకోవడం లేదు. కనీసం పరిశ్రమల్లో భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసేందుకు కూడా ముందుకు రాకపోవడం దారుణం. ఇప్పటికైనా దృష్టి పెట్టాలి.
- పి.తేజేశ్వరావు, సీఐటీయూ జిల్లా నాయకుడు
భద్రత గాలికి..
కార్మికుల భద్రతను గాలికొదిలేస్తున్నారు. పరిశ్రమల వద్ద కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదు. క్వారీలు సైతం ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు కోల్పోయే సమయంలో రేటు కట్టి చేతులు దులుపుకొంటున్నారు. కార్మిక చట్టాలు అమలుకావడం లేదు. చనిపోతున్నా పరిహారం దక్కడం లేదు.
- సీహెచ్ అమ్మన్నాయుడు, కార్మికుల నాయకుడు, పైడిభీమవరం