Share News

ఇంటి నుంచే ఉద్యోగం

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:47 AM

ఉన్నత విద్యార్హతలు ఉన్నా పరిస్థితుల ప్రభావంతో ఉద్యోగాలకు బయటకు వెళ్లలేక చాలామంది యువత స్థానికంగానే ఉండిపోతున్నారు.

 ఇంటి నుంచే ఉద్యోగం
సిరియాఖండి సచివాలయంలో ఆన్‌లైన్‌లో పరీక్ష రాస్తున్న నిరుద్యోగ యువతి

- కౌశలం పథకంపై నిరుద్యోగుల ఆసక్తి

- సచివాలయాల్లో ఎంపిక పరీక్షలు

- టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామానికి చెందిన మద్దిల లక్ష్మణరావు బీఈడీ చేశాడు. తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో లక్ష్మణరావు బయటకు వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కౌశలం పథకం ద్వారా ఇంటి నుంచే ఉపాధి కల్పించనుండడంతో దానికి లక్ష్మణరావు దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ పరీక్ష రాయడానికి సిద్ధపడుతున్నాడు.

- మెళియాపుట్టి మండలం కోసమాళ గ్రామానికి స్వప్న బీటెక్‌ పూర్తి చేసింది. బయటకు వెళ్లి ఉద్యోగం చేసేందుకు ఆమెకు ఆసక్తి లేదు. దీంతో కౌశలం పథకంలో స్వప్న దరఖాస్తు చేసుకుని సచివాలయంలో జరిగిన ఆన్‌లైన్‌ పరీక్షను రాసింది.

టెక్కలి రూరల్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యార్హతలు ఉన్నా పరిస్థితుల ప్రభావంతో ఉద్యోగాలకు బయటకు వెళ్లలేక చాలామంది యువత స్థానికంగానే ఉండిపోతున్నారు. అలాంటి వారి కోసం కూటమి ప్రభుత్వం కౌశలం పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంటి నుంచే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వర్క్‌ఫ్రంమ్‌హోమ్‌కు ఆసక్తి గల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపిక కోసం ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తోంది. జిల్లాలోని 752 సచివాలయాల పరిధిలోని 1,37,752 మంది కుటుంబాల్లో సర్వే చేయగా అందులో 93,362 మంది నిరుద్యోగులు కౌశలం పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 29,449 మంది సచివాలయాల్లో పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలు ఈ నెలాఖరు వరకు జరగనున్నాయి.

-నిరుద్యోగుల అర్హత నిర్ధారణకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సర్వే చేస్తారు. వారి విద్యార్హత ధ్రువపత్రాలను కౌశలం యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. వీరికి సచివాలయాల్లో నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన వారికి వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశం కల్పించనున్నారు.

- ఒక్కొక్క సచివాలయంలో రోజుకు ఇద్దరు చొప్పున పరీక్ష రాసేందుకు షెడ్యూల్‌ ఇస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య వెబ్‌ ద్వారా పరీక్ష రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ నైపుణ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, రీజనింగ్‌ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.

- పరీక్ష షెడ్యూల్‌ సమయంపై అభ్యర్థుల ఫోన్‌కి సమాచారం వస్తుంది. కార్యదర్శులు సైతం తెలియజేస్తారు. అనివార్య కారణాలతో పరీక్ష రాయలేని అభ్యుర్థులు వారికిచ్చిన లింక్‌లో ఆధార్‌ నెంబర్‌ ద్వారా రీషెడ్యూల్‌ చేసుకోవచ్చు.

ఇబ్బందులు లేకుండా చర్యలు

కౌశలం పథకానికి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు సచివాలయాల్లో ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నాం. నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్‌, నెట్‌ సౌకర్యం లేని సచివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.

-ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి

Updated Date - Dec 22 , 2025 | 12:47 AM