Share News

zp meeting..: సమస్యలు పరిష్కరించరూ!

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:19 AM

zp meeting.. Unresolved issues జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా.. పాత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నా ప్రజాప్రతినిధులు.. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో శనివారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరగనుంది.

zp meeting..: సమస్యలు పరిష్కరించరూ!

  • ఎప్పుడూ కొన్ని శాఖలకే పరిమితం..

  • ప్రజల ఇబ్బందులనూ గమనించాలంటూ విన్నపాలు

  • గాడి తప్పుతున్న కొందరి అధికారుల తీరు

  • నేడు జడ్పీ సర్వ సభ్యసమావేశం

  • శ్రీకాకుళం, రణస్థలం, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా.. పాత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నా ప్రజాప్రతినిధులు.. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో శనివారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, మండల పరిషత్‌ అధ్యక్షులు హాజరుకానున్నారు. ప్రతీసారి కొన్ని ప్రభుత్వ శాఖలకే పరిమితమైపోతున్న సర్వసభ్య సమావేశం.. ఈసారైనా ప్రజాసమస్యలకు ప్రాధాన్యమివ్వాలని జిల్లావాసులు కోరుతున్నారు. అన్ని కీలక ప్రభుత్వ శాఖలపై చర్చ జరగాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో పేరుకుపోతున్న సమస్యలు.. తీసుకోవాల్సిన చర్యలపై కూలంకుషంగా చర్చిస్తే ప్రయోజనముంటుందని భావిస్తున్నారు.

  • వీటిపై చర్చిస్తారా?

  • జిల్లా అంతటా వైరల్‌ వ్యాధులు ప్రబలుతున్నా.. ప్రత్యేక వైద్యశిబిరాలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు సక్రమంగా అందడం లేదు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులంతా మొక్కుబడిగా విధులు నిర్వహిస్తూ.. ప్రైవేటు క్లినిక్‌లకు అతుక్కుపోతున్నారు. వీటిపై నిఘా పెట్టి పేదలకు ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందించాలి.

  • శ్రీకాకుళం రూరల్‌, గార మండలాల్లో ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

  • ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సరిపడా అవసరమైన విత్తనాలు.. ఎరువులు అందజేయాలి. నకిలీ పురుగుమందులు, ఎరువుల విక్రయాలను అరికట్టాలి. సాగునీటి కాలువల్లో పూడికలు తొలగించాలి. దశాబ్దాలుగా ఉన్న వంశధార షట్టర్ల కేసుకు పరిష్కారం చూపేలా.. ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. గొట్టాబ్యారేజీకి నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలి. వంశధార ఫేజ్‌ 2, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు పూర్తి చేసేలా నిధులు మంజూరుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలి.

  • పంచాయతీల్లో దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి.

  • జల్‌జీవన్‌ మిషన్‌ ఆధ్వర్యంలో జరిగే పనులు పూర్తిచేయాలి.

  • శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం, శ్రీకాకుళం కలెక్టరేట్‌ ఎప్పటికి పూర్తవుతాయో ఎవరికీ తెలియదు. ఇంకనూ అదనపు నిధులు మంజూరుచేయాల్సి ఉంది.

  • గ్రామీణస్థాయిలో బెల్టుషాపుల విచ్చలవిడిగా ఉన్నాయి. మద్యం దుకాణాలు కొన్ని గంటల ముందుగానే తెరుచుకుంటున్నాయి. వీటిపైనా దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి.

  • కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో మెనూ సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలి.

  • శ్రీకాకుళం నియోజకవర్గంలో పర్యాటకంగా ఉన్న రెండు సముద్రతీరాలు కనుమరుగయ్యాయి. వంశధార, నాగావళి నదీ ప్రవాహల దిశలు మారడంతో సముద్రం వద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా పోయింది.

  • అరసవల్లి ఆదిత్యుని మాస్టర్‌ ప్లాన్‌ను అభివృద్ధి ప్రకటనలకే పరిమితమైంది.

  • ఎచ్చెర్ల మండలంలో శిల్పారామం ప్రాజెక్టు అతీగతిలేదు. జిల్లా పర్యాటక అధికారి పనితీరును కూడా బేరేజు వేసి.. పర్యాటక ప్రగతిపై చర్చించాలి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అత్యధిక పరిశ్రమలున్నా స్థానిక యువతకు ఉపాధి లభించడంలేదు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి.

  • మండలస్థాయిలో కొంతమంది అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. సమీక్షలని.. క్షేత్రస్థాయిల పర్యటన అంటూ నిరంతరం ఏవో కారణాలు చెబుతున్నారు. తహసీల్దార్‌, ఎమ్పీడీవో, ఎంఈవో.. ఇలా అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీఅవ్వాలి.

  • గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాల్లో అప్పట్లోనే అక్రమాలు జరిగాయి. ఇందులో కొంతమంది సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. అధిక మంది అనర్హులు కూడా పట్టాలు పొందారు. శ్రీకాకుళం నగరంతోపాటుగా పలుచోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటిపై దర్యాప్తు చేయాలి. ఇలా జిల్లాలో పలు సమస్యలకు పరిష్కారం చూపేలా సమావేశం సాగాలని జిల్లావాసులు కోరుతున్నారు.

  • నాలుగేళ్లుగా జడ్పీ నిర్వీర్యం

  • ప్రభుత్వ పాలనలో జిల్లా పరిషత్‌ది ప్రత్యేక స్థానం. గతంలో జిల్లా అభివృద్ధిలో గణనీయమైన ముద్ర చూపే జిల్లాపరిషత్‌.. ప్రస్తుతం ఉత్సవ విగ్రహంలా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైంది. దానికి ప్రత్యేక నిధులు, విధులు లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. 2021లో జిల్లా పరిషత్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. అప్పట్లో ప్రతిపక్షాలకు జిల్లాపరిషత్‌లో కనీస ప్రాతినిథ్యం లేదు. దీంతో వైసీపీ ఇష్టారాజ్యం సాగింది. టీడీపీ తరపున హిరమండలం జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు ఎన్నికైనా.. సమావేశాల్లో కనీసం ఆయనకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో గడిచిన నాలుగేళ్లలో జిల్లాపరిషత్‌ జిల్లా అభివృద్ధిలో ఎటువంటి ముద్ర చూపలేకపోయింది. జడ్పీ పాలకవర్గానికి కేవలం పది నెలల పదవీకాలం మాత్రమే ఉంది. ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వమే చర్యలు చేపట్టాల్సి ఉంది.

  • ఇదీ పరిస్థితి..

  • ఉమ్మడి జిల్లాలో 38 మండలాల్లో 920 పంచాయతీలున్నాయి. 2021 మార్చిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తరువాత జడ్పీ చైర్మన్‌తో పాటు ఎంపీపీలు ఎన్నికయ్యారు. కానీ అటు జడ్పీ, ఇటు మండల పరిషత్‌ల్లో ఆశించినస్థాయిలో నిధులు లేవు. అంతకుముందు రెండేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలన సాగడంతో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. 14, 15 ఆర్థిక సంఘం నిధులు సైతం సరిగ్గా ఖర్చు కాలేదు. తరువాత ఎన్నికైన సర్పంచ్‌లకు తెలియకుండా వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల పేరిట ఆర్థిక సంఘం నిధులను మళ్లించింది. దీంతో కొన్ని గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు చెల్లించలేని స్థితిలో పంచాయతీలున్నాయి. నిధులు, విధుల్లో జడ్పీ స్వతంత్య్రంగా వ్యవహరించేది. 32 శాఖలకు సంబంధించి పర్యవేక్షణ జడ్పీదే. విద్యాశాఖ పదోన్నతులు, బదిలీలు కూడా జడ్పీ పరిధిలోనే జరిగేవి. విచక్షణాధికారాలు సైతం ఉండేవి. కానీ రానురాను ప్రభుత్వాలు ఆ అధికారాలకు కత్తెర వేశాయి. గతంలో ఇసుక, గనుల సీనరేజ్‌ అంతా జడ్పీ పరిధిలోనే ఉండేవి. ఇసుక రీచ్‌ల నిర్వహణ కూడా ఉండేది. కానీ ఇసుక ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారడంతో హస్తగతం చేసుకుంది. గతంలో సీనరేజ్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని పంచాయతీలకు 50శాతం, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లు చెరో 50 శాతం పంచుకునేవి. అయితే సీనరేజ్‌ చార్జీలు గత కొన్నేళ్లుగా చెల్లించడం లేదు. నేరుగా ప్రభుత్వ ఖాతాకే జమవుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి తిరిగి రావడం లేదు.

  • చెల్లింపుల్లో జాప్యం

  • రిజిస్ర్టేషన్‌ సర్‌చార్జీలు, నీటి తీరువా పన్నుల్లో కొంత మొత్తం స్థానిక సంస్థలకు ఆదాయం వచ్చేది. ఎకరాకు నీటి తీరువా రూ.200 వసూలు చేస్తే అందులో 5 నుంచి 10 శాతం పంచాయతీలకు జమయ్యేది. పంచాయతీ పరిధిలో ఎవరైనా భూములు విక్రయించి రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి సర్‌చార్జీల రూపంలో కొంత మొత్తం పంచాయతీలకు వచ్చేది. కానీ కొన్నేళ్లుగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఆదాయం లేక ఎమ్మెల్యేలు, ఎంపీల నిధులపై ఆధారపడుతున్నారు. కొన్ని మండలాల్లో అయితే ఎంపీపీలు, జడ్పీటీసీలు కూర్చునేందుకు కనీసం చాంబర్లు లేవు. పాత భవనాల్లో అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణకే కష్టంగా ఉంది.

  • చీకటి రోజులు..

  • వైసీపీ హయాంలో జిల్లాపరిషత్‌ నిర్వీర్యమైంది. టీడీపీ తరపున ఎన్నికైన ఏకైక జడ్పీటీసీని నేనే. అప్పట్లో ఏదైనా సమస్యపై మాట్లాడితే వైసీపీ ప్రజాప్రతినిధులు అడ్డుకునేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లా పరిషత్‌తో పాటు పల్లె పాలనకు వెలుగు వచ్చింది. ఏదైనా గత నాలుగేళ్లు జడ్పీకి చీకటి రోజులు.

    - పొగిరి బుచ్చిబాబు, జడ్పీటీసీ, హిరమండలం

  • గౌరవ భృతి లేదు

  • 2021 సెంప్టంబరులో జడ్పీటీసీల పాలన కొలువుతీరింది. ఆరు నెలలపాటు నెలకు రూ.6 వేలు చొప్పున గౌరవభృతి అందింది. గత మూడేళ్లగా గౌరవభృతి అందలేదు. గత ప్రభుత్వ హయంలో జడ్పీకి నిధులు అంతంతమాత్రమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికైనా ప్రత్యేకనిధులు మంజూరు చేయాలి.

    - టొంపల సీతారాముడు, జడ్పీటీసీ, రణస్థలం

Updated Date - Jun 28 , 2025 | 12:19 AM