‘ఉపాధి’లో మహిళలే టాప్
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:51 PM
The number of wage earners is increasing వలసల నివారణ, గ్రామాల్లో పేదలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. పురుషుల కన్నా మహిళలు అధిక సంఖ్యలో పనులకు హాజరై ఉపాధి పొందుతున్నారు.
పథకం అమలుతో తగ్గిన వలసలు
ఏటా పెరుగుతున్న వేతనదారుల సంఖ్య
పనుల్లో రాష్ట్రంలోనే సిక్కోలుకు ప్రథమస్థానం
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వలసల నివారణ, గ్రామాల్లో పేదలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. పురుషుల కన్నా మహిళలు అధిక సంఖ్యలో పనులకు హాజరై ఉపాధి పొందుతున్నారు. ఉపాధిహామీ పథకంలో లబ్ధిదారుల అవసరాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు మార్పులకు శ్రీకారం చుట్టాయి. వ్యవసాయం, అనుబంధరంగాలకు ప్రాధాన్యం కల్పిస్తూ వివిధ రకాల పనులను ఉపాధిహామీకి అనుసంధానం చేశాయి. మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించాయి. లబ్ధిదారులకు ఎక్కువ పనిదినాలను కల్పిస్తున్నాయి. సాగునీటి వనరుల అభివృద్ధి, పండ్ల తోటల పెంపకం, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం, తదితర పనుల కల్పనతో వేతనదారుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలు కల్పించి, చెల్లింపులు చేసిన జిల్లాగా శ్రీకాకుళం ప్రథమ స్థానంలో నిలిచింది. అధికారులు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకూ 2.90లక్షల మంది మహిళలకు పనిదినాలు కల్పించారు. మహిళలు ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా పనులు కేటాయిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగపడినట్లు జాతీయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో చాలా కుటుంబాలు ఉపాధి కోసం వలస పోయాయి. కానీ ప్రస్తుతం ఉపాధిహామీ పథకం ద్వారా స్థానికంగా పనులు లభ్యం కావడంతో వలసలు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు.
ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా..
ఉపాధిహామీ పనుల్లో మహిళలను అత్యధికంగా భాగస్వాములను చేయడం ద్వారా రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మహిళా ఆర్థిక స్వావలంబనే కుటుంబ ఆర్థిక స్వాతంత్ర్యానికి పునాదిరాయి. రానున్న రోజుల్లో కూడా లక్ష్యాలను చేరుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను మరింతగా ప్రోత్సహించి, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
- సుధాకరరావు, డ్వామా పీడీ
నాలుగేళ్లలో ఉపాధిహామీ పనులిలా..
-------------------
సంవత్సరం పురుషులు మహిళలు పని దినాలు వేతనాలు
2022-23 1,85,514 3,12,387 1,44,55,281 రూ.273కోట్లు
2023-24 1,87,531 3,18,309 1,56,78,618 రూ.393కోట్లు
2024-25 1,80,660 3,14,588 1,45,12,915 రూ.359కోట్లు
2025-26 1,02,376 2,90,683 97,19,617 రూ.236కోట్లు
(ఆగస్టు 30వరకు)