ప్రశ్నిస్తే చితకబాదుతారా?
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:13 AM
కొత్తూరు పోలీసుస్టేషన్ ఎదుట శోభనాపురం తదితర గ్రామాల ప్రజలు బుధవారం నిరసన తెలిపారు.
అన్యాయంగా కేసులు పెట్టించారు
పోలీసుస్టేషన్ ఎదుట ప్రజల నిరసన
తాము ఎవరినీ కొట్టలేదన్న ఎస్‌ఐ
శ్రీకాకుళం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): కొత్తూరు పోలీసుస్టేషన్ ఎదుట శోభనాపురం తదితర గ్రామాల ప్రజలు బుధవారం నిరసన తెలిపారు. శోభనాపురం గ్రామానికి చెందిన గెల్లంకి వెంటరమణను కొత్తూరు ఎస్‌ఐ ఎండీ అమీర్ అలీ చితకబాదారని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. శోభనాపురం క్వారీ వద్ద భారీగా బ్లాస్టింగ్ చేస్తుండడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, దీంతో బ్లాస్టింగ్ నిలుపుదల చేయాలని అడ్డుకున్నందుకు కొంతమంది నాయకు ల ప్రోద్బలంతో పోలీసులు కొట్టారని గెల్లంకి వెంటరమణ ఆరోపించారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళితే తనపై దాష్టికంగా దాడి చేశారన్నారు. వెంకటరమణ ప్రజలతో కలిసి బుధవారం పోలీసుస్టేషన్‌కు వెళ్లి నిలదీయగా.. పోలీసులు, ప్రజల మధ్య చిన్నపాటి తోపులాట జరిగినట్లు తెలిసింది. అనంతరం పోలీసులు తనను కొట్టడంతో గాయాలపాలై కొత్తూరు ఆసుపత్రిలో చేరానని, కొత్తూరు వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారని వెంకటరమణ తెలిపారు. అయితే తమను ఇబ్బందులు పెడు తున్నారంటూ వెంకటరమణపై క్వారీ నిర్వాహకులు మూడు రోజులు క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారని, దీంతో ఆదివారం వెంకటరమణపై కేసు నమోదు చేసి 41 నోటీసు ఇచ్చి బెయిల్‌పై విడుదల చేశామని కొత్తూరు ఎస్‌ఐ ఎండీ అమీర్ అలీ తెలిపారు. వెంకటరమణను కొట్టారని చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. తనపై నమోదు చేసిన కేసును కప్పి పుచ్చుకోవడానికి కొంతమందిని తీసుకువచ్చి హంగామా చేశారన్నారు.