Share News

సీఎం హెచ్చరికతో.. మార్పు వస్తుందా?

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:17 AM

Cesarean sections are common in private hospitals జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణులకు ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేసేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొంతమేర సాధారణ ప్రసవాలు జరుగుతున్నా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం 90 శాతం సిజేరియన్లు ఉంటున్నాయి. గర్భిణులు పురిటినొప్పులతో ప్రైవేటు ఆస్పత్రికి వెళితే చాలు.. బిడ్డ అడ్డం తిరిగిందని, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతూ.. తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలంటే అత్యవసరంగా సిజేరియన్‌ చేయాల్సిందేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

సీఎం హెచ్చరికతో.. మార్పు వస్తుందా?

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇషారాజ్యంగా సిజేరియన్లు

ఏళ్లతరబడి పర్యవేక్షణ కరువు

వైద్యుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం

గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాలని ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులతో పోల్చితే ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యధికంగా ప్రసవాలు.. సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇటువంటివి ప్రభుత్వం అంగీకరించదు. గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాలి. ఇష్టానుసారంగా సిజేరియన్లు చేయకుండా నిలువరించాలి.

- ఇదీ ఇటీవల ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం.

శ్రీకాకుళం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్భిణులకు ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేసేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొంతమేర సాధారణ ప్రసవాలు జరుగుతున్నా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం 90 శాతం సిజేరియన్లు ఉంటున్నాయి. గర్భిణులు పురిటినొప్పులతో ప్రైవేటు ఆస్పత్రికి వెళితే చాలు.. బిడ్డ అడ్డం తిరిగిందని, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతూ.. తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలంటే అత్యవసరంగా సిజేరియన్‌ చేయాల్సిందేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు వైద్యులు ప్రజల సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుని ముహూర్తం చూసుకోండి.. దాని ప్రకారం ఆపరేషన్‌ చేసేద్దామని చెబుతూ సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లావైద్య ఆరోగ్యశాఖ కానీ, కలెక్టర్‌ తదితర అధికారులు కానీ ప్రైవేట ఆస్పత్రులపై నిఘా సారించడం లేదు. నిబంధనలు అమలుపై కనీసస్థాయిలో ఆకస్మిక తనిఖీలు కూడా చేయడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు సిజేరియన్ల పేరుతో గర్భిణుల కుటుంబ సభ్యుల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకున్న నాథులు లేరు.

ఇదీ జిల్లాలో పరిస్థితి..

జిల్లాలోని ప్రతి వంద ప్రసవాల్లో తొంబై సిజేరియన్‌లే చేస్తున్నారు. సాధారణ ప్రసవం కోసం వైద్యసిబ్బందికి ఆసక్తి చూపకపోవడం.. సిజేరియనే బెటర్‌ అంటూ చెప్పడంతో గర్భిణులకు ‘కోత’ తప్పడంలేదు. ‘2024-25’ సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 28,846 ప్రసవాలు జరిగాయి. ఇందులో సాధారణ ప్రసవాలు 7,183 కాగా.. 21,663 మందికి సిజేరియన్లు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 10,323 ప్రసవాలు అయ్యాయి. ఇందులో సాధారణ ప్రసవాలు 2,498 మాత్రమే. ఏకంగా 7,825 సిజేరియన్లు చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ప్రసవాల గణాంకాలపై అధికారులతో సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కన్నా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నట్టు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత ప్రసవాలకు ప్రాధానమివ్వాలని స్పష్టం చేశారు. కాగా.. సీఎం హెచ్చరికతోనైనా ప్రైవేటు వైద్యుల తీరులో మార్పు వస్తుందా? అన్న చర్చ సాగుతోంది.

సీఎం ఆదేశం నెరవేరాలంటే.. ఇలా చేయాలి

ఆస్పత్రుల్లో ప్రసవాలకు వస్తున్న వారి వివరాలతోపాటు.. ర్యాండమ్‌గా తనిఖీలను వైద్యాధికారుల బృందం చేపట్టాలి. ఇందుకు పక్క జిల్లా వైద్య బృందం వస్తేనే బాగుంటుంది. గర్భిణీకి సంబంధించిన వైద్యపరీక్షలు.. ఇతరత్రా రిపోర్టులను పరిశీలించాలి. నిజంగా సిజేరియన్‌ అవసరమైతేనే చేశారా? అన్న విషయాన్ని నిర్ధారించాలి. అలా అయితేనే కొన్నాళ్లకైనా సిజేరియన్లకు కట్టడి పడుతుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతినెలా కలెక్టరేట్‌లో ప్రసవాలు, సిజేరియన్లపై అధికారులు సమీక్ష చేపట్టాలి. ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని సూచనలిస్తే సత్వర ఫలితముంటుంది. లేదంటే కోతలకు అడ్డుపడే అవకాశముండదు.

Updated Date - Sep 26 , 2025 | 12:17 AM