Share News

pond occupation : రాజుల చెరువు బాగుపడేనా?

ABN , Publish Date - May 05 , 2025 | 11:37 PM

occupation of the Rajulacheruvu నరసన్నపేట నడిబొడ్డున సుమారు 13 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాజుల చెరువు రోజురోజుకూ ఆక్రమణల కారణంగా ఆనవాళ్లు కోల్పోతోంది. పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుమారు 200 ఏళ్ల కిందట జమీందారులు పాలనలో నిర్మించిన ఈ చెరువు ఆక్రమణలకు గురవుతోంది.

pond occupation : రాజుల చెరువు బాగుపడేనా?
నరసన్నపేటలో ఆక్రమణలతో రాజులు చెరువు ఇలా..

  • ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోయిన వైనం

  • పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజల వినతి

  • నరసన్నపేట, మే 5(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట నడిబొడ్డున సుమారు 13 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాజుల చెరువు రోజురోజుకూ ఆక్రమణల కారణంగా ఆనవాళ్లు కోల్పోతోంది. పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుమారు 200 ఏళ్ల కిందట జమీందారులు పాలనలో నిర్మించిన ఈ చెరువు ఆక్రమణలకు గురవుతోంది. 50 ఏళ్ల కిందట వరకూ పట్టణ ప్రజలకు ఇదే తాగునీరు వనరు. ప్రస్తుతం ఆక్రమణలతోపాటు చెరువులో నీరు కాలుష్యం కావడంతో తాగునీరుకు పనికిరాకుండా పోయింది. దీంతో నరసన్నపేట మేజర్‌ పంచాయతీకి దేవాది నుంచి తాగునీరు తీసుకురావల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్తీకమాసంలో దీపాలవెలుగులో రాజులు చెరువు వెలిగిపోయేదని అప్పటి పెద్దలు చెబుతున్నారు. అప్పట్లో చెరువులో స్నానమాచరిస్తే రోగాల నయమవుతాయని ప్రజల్లో నమ్మకం. రానురాను ప్రజలు ఈ చెరువును వాడకపోవడంతో పట్టణంలో డ్రైనేజ్‌ల నుంచి వచ్చేనీటితో మురికి స్థావరంగా మారింది. మరోవైపు చెరువుగట్టుపై అక్రమ నిర్మాణాలు జోరుందుకున్నాయి. గట్టుపై గల ఇళ్లలోని వ్యక్తిగత మరుగుదొడ్లకు కనెక్షన్‌ నేరుగా చెరువులో పెట్టడంతో మరింత దుర్వాసన వస్తోంది. ఈ చెరువును పార్కుగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 2017లో ప్రతిపాదనలు పంపారు. 2022లో అనాటి సీఎం జగన్మోహన్‌రెడ్డి చెరువు అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయిస్తానని నరసన్నపేట బహిరంగ సభలో ప్రకటించారు. కానీ నిధులు కేటాయించలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా రాజుల చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

  • నిర్లక్ష్యంగా వదిలేయడం తగదు

  • ఎన్నో వందల ఏళ్లు చరిత్ర కలిగిన రాజులు చెరువును వదిలేస్తున్నారు. ఎంతో విశాలంగా ఉన్న చెరువు ఆక్రమణలతో కుచించుకుపోయింది. పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ చెరువును అభివృద్ధి చేయాలి

    - వైశ్యరాజు కృష్ణంరాజు, శ్రీరామనగర్‌

  • దృష్టి సారించాలి

    అధికారులు, పాలకులు ప్రజలందరికీ ఉపయోగపడే రాజులు చెరువు అభివృద్ధిపై దృష్టి సారించాలి. చెరువును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చెరువు చుట్టూ అభివృద్ధి పనులు చేపట్టాలి.

    - పీస కృష్ణ, జగన్నాథపురం, నరసన్నపేట

  • మంచిరోజులు వస్తాయి

    పట్టణ ప్రజలకు ఉపయోగపడే చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉంది. రాజుల చెరువును పర్యాటక ప్రాంతంగా తయారు చేసేందుకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట ఇచ్చారు. ఇప్పటికే అఽధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. పట్టణానికి మంచిరోజులు వస్తాయి

    - జామి వెంకటరావు, ఎంపీటీసీ, నరసన్నపేట

  • ప్రతిపాదనలు సిద్ధం

    రాజులు చెరువు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఈ చెరువును ఆహ్లాదంగా తీర్చిదిద్దిందేకు చర్యలు చేపడతాం.

    - బగ్గు రమణమూర్తి, ఎమ్మెల్యే, నరసన్నపేట

Updated Date - May 05 , 2025 | 11:37 PM