Share News

ఆశలు ఫలించేనా?

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:01 AM

Will the Patapatnam Revenue Division be established? పాతపట్నం రెవెన్యూ డివిజన్‌ కేంద్రం ఏర్పాటుపై ఈ ప్రాంతవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం సచివాలయంలో రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన భేటీ అయింది.

ఆశలు ఫలించేనా?
పాతపట్నం వ్యూ

  • పాతపట్నం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై ఎదురుచూపు

  • పాతపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పాతపట్నం రెవెన్యూ డివిజన్‌ కేంద్రం ఏర్పాటుపై ఈ ప్రాంతవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం సచివాలయంలో రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన భేటీ అయింది. కొత్త జిల్లాలు, కొత్త రెవిన్యూ డివిజన్లు, రెవిన్యూ డివిజన్లలో చేర్పులు-మార్పుల వ్యవహారంపై చర్చించింది. చివరకు మదనపల్లె, మర్కాపురం కొత్త జిల్లాలతోపాటు, నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలేరు, అవని గడ్డ, గిద్దలూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అందులో పాతపట్నం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు ప్రస్తావన లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు పునర్వవస్థీకరణ స్పష్టత కోసం మరోసారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానున్నట్టు తెలియడంతో.. ఈ సారైనా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014- 19 మధ్య) పాతపట్నాన్ని డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు వచ్చాయి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, ఎల్‌.ఎన్‌.పేటతోపాటు సారవకోట, జలుమూరు మొత్తం ఏడు మండలాలతో పాతపట్నం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలు మూలకు చేరాయి. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో వైసీపీ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ కేంద్ర ఏర్పాటుకు తెరలేపింది. కానీ, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు పంపారనే కారణంతో పాతపట్నం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై ఆసక్తి చూపలేదు. కొత్తగా పలాస రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా పాతపట్నాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:01 AM