Cashew : జీడికి గిట్టుబాటు లభించేనా?
ABN , Publish Date - May 16 , 2025 | 12:10 AM
Cashew Prices low జీడిపిక్కల గిట్టుబాటు ధర రూ.16వేలు పలుకుతుందనే ఆశతో రైతులు ఉన్నారు. ప్రస్తుతం జీడిపిక్కల బస్తా రూ.13,500 ఉండగా కొంతమంది విక్రయాలు సాగిస్తున్నారు. మరికొందరు మాత్రం గిట్టుబాటు ధర మరింత పెరుగుతుందని ఎదురుచూస్తున్నారు.
మద్దతు ధర కోసం రైతుల ఎదురుచూపు
రైతుసేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్
సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి
పలాస, మే 15(ఆంధ్రజ్యోతి): జీడిపిక్కల గిట్టుబాటు ధర రూ.16వేలు పలుకుతుందనే ఆశతో రైతులు ఉన్నారు. ప్రస్తుతం జీడిపిక్కల బస్తా రూ.13,500 ఉండగా కొంతమంది విక్రయాలు సాగిస్తున్నారు. మరికొందరు మాత్రం గిట్టుబాటు ధర మరింత పెరుగుతుందని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 30వేల హెక్టార్లలో జీడి సాగవుతోంది. ఉద్దానం ప్రాంతమైన పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో సుమారు 30వేల మందికిపైగా రైతులు జీడి పంటపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక వారి పరిస్థితి దయనీయంగా మారింది. డిసెంబరు నుంచి మే నెల వరకూ జీడి సీజనుగా పిలుస్తారు. ఎకరా జీడి పంటకు 4 నుంచి 6 బస్తాల పిక్కలు పండుతాయి. సరాసరి ఎకరాకు రూ.18వేలకు పైగా పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం ఉండడంతో ఎకరాకు 2 బస్తాలు మాత్రమే పండుతున్నాయి. గతంలో మార్కెట్‌లో బస్తా పిక్కలు ధర రూ.12వేల నుంచి రూ.14వేల వరకూ ఉండగా.. ప్రస్తుతం రూ.13,500 వరకూ ఉంది. దీంతో తమకు పెట్టుబడికే ఆ డబ్బులు సరిపోతున్నాయని, కనీసం లాభం లేకపోతే కష్టపడి పండించిన ప్రయోజనమేంటని రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో జీడిపప్పు రూ.800 వరకూ ఉంది. దాని ప్రకారం జీడిపిక్కల ధరలు కూడా పెరగాల్సి ఉందని రైతులు పేర్కొంటున్నారు.
విదేశీజీడి పిక్కలపైనే మోజు
పలాస జీడి పరిశ్రమలకు విదేశీ జీడిపిక్కలు బస్తా రూ.12వేలకు లభ్యమవుతోంది. దీంతో స్వదే శీ జీడిపిక్కలను కొనుగోలుకు వ్యాపారులు ఇష్టపడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు ఇటీవల జీడిపప్పు కూడా అక్రమ మార్గంలో పలాసకు చేరుకుంటుండడంతో స్థానికంగా తయారవుతున్న జీడిపప్పు మార్కెట్ ఒక్కసారిగా పతనమైందని వ్యాపారులు అభిప్రాయాన్ని వ్యాపారులూ వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో పండే జీడిపిక్కలు ఇక్కడున్న జీడి పరిశ్రమలకు కేవలం వంద రోజుల వరకే వస్తుంది. దీంతో విదేశీ పిక్కలు తీసుకురావడం అనివార్యమైంది. ఇదే అదనుగా ఆరుగాలం కష్టపడి పండించే మన జీడిపిక్కల అవసరం అంతంత మాత్రమైంది. విదేశీ జీడిపిక్కల కన్నా మన పిక్కలు నాణ్యతగా ఉంటాయి. రుచిలో కూడా భారీ తేడా ఉంటుంది. విదేశీ పప్పు పరిమాణంలో పెద్దదిగాను, రంగులో కూడా తేడా ఉండడంతో ఏది స్థానికం, ఏది విదేశీ అన్న తేడా కనిపించకపోవడంతో చౌకగా లభించే విదేశీ పిక్కలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక్కడున్న పది మంది బ్రోకర్లు వేల టన్నుల పిక్కలు తీసుకువస్తూ పలాస మార్కెట్‌ను శాసిస్తున్నారు. దీంతో రైతుల వద్ద ఉండాల్సిన ధరలు వారి వద్దే కేంద్రీకృతం కావడంతో మన జీడిపప్పునకు మార్కెట్ తగ్గిపోయింది. దీంతో తాము పండించే జీడిపిక్కలకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ మోజులో స్థానిక జీడిపిక్కల ధరలు పతనమయ్యాయని ఆరోపిస్తున్నారు. ఏడాదిపాటు విదేశీ పిక్కలను వినియోగించకుండా చర్యలు చేపడితే తాము పండించేవాటికి గిట్టుబాటు ధర పెరుగుతుందని పేర్కొంటున్నారు. ‘బస్తాకు కనీసం గిట్టుబాటు ధర రూ.16వేలు కల్పించాలి. జీడిపిక్కలను నేరుగా ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. జీడి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. మేలురకమైన జీడి వంగడాలు అందించాలి’ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.