ఊళ్లలోకి వస్తున్నాయ్!
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:49 PM
Wild animals వన్యప్రాణులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో తూర్పు కనుమల్లో ఎత్తయిన మహేంద్రగిరులు వన్యప్రాణులకు నిలయాలు. లక్షల ఎకరాల్లో విస్తరించే కొండలు.. అరుదైన పక్షులు, జంతువులకు ఆవాసాలు. ఆహారంతో పాటు సమృద్ధిగా నీరు లభిస్తుంది.
జనావాసంలోకి వన్యప్రాణులు
అడవులు తగ్గిపోతుండడమే కారణం
పొలాలకు వెళ్లాలంటే రైతుల్లో భయం
ఇచ్ఛాపురం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి):
ఈ నెల 9న ఇచ్ఛాపురం మండలం డొంకూరులో పిచ్చి నక్క దాడిలో 12మంది గాయపడ్డారు. ప్రస్తుతం వరి నూర్పులు జరుగుతుండడంతో పనులు ముగించుకొని రాత్రి సమయంలో వస్తున్న వారిపై నక్క దాడి చేసింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. వెంటాడి కరుస్తుండడంతో కొందరు యువకులు దాడి చేసి దానిని హతమార్చారు.
ఆరు నెలల కిందట ఇచ్ఛాపురం రత్తకన్న ప్రాంతంలో కొండపై నుంచి ఒక జింక దాహంతో కిందకు వచ్చింది. ఆ సమయంలో గమనించిన కుక్కలు దాడి చేయడంతో అది చనిపోయింది.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలోని బొగాబెణితోపాటు పలు గ్రామాలు, పీర్లకొండ ప్రాంతంలో నెమళ్లు కనిపిస్తున్నాయి. జాతీయ పక్షి కావడంతో వాటిపై దాడులు చేయకుండా పరిసర గ్రామాల పెద్దలు చర్యలు చేపడుతున్నారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ కోతుల సంచారం అధికంగా ఉంది. ఇళ్లల్లో ఉన్న వస్తువులను తీసుకెళుతున్నాయి. మనుషులపై దాడి చేస్తున్నాయి. పంటలను సైతం నాశనం చేస్తున్నాయి.
.. ఇలా వన్యప్రాణులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో తూర్పు కనుమల్లో ఎత్తయిన మహేంద్రగిరులు వన్యప్రాణులకు నిలయాలు. లక్షల ఎకరాల్లో విస్తరించే కొండలు.. అరుదైన పక్షులు, జంతువులకు ఆవాసాలు. ఆహారంతో పాటు సమృద్ధిగా నీరు లభిస్తుంది. అయితే అభివృద్ధి పేరిట మహేంద్రగిరులు మసకబారుతున్నాయి. ఒడిశా ప్రభుత్వం మహేంద్రగిరులకు రోడ్డు, రవాణా సౌకర్యం మెరుగుపరిచింది. అలాగే ఈ అడవుల్లో టేకు, గంధం వంటి చెట్లు నరికివేస్తున్నారు. దీంతో అడవులు తగ్గిపోతున్నాయి. అలాగే హుద్‌హుద్, తితలీ.. ఇలా వరుస తుఫాన్లు జిల్లాను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఉద్దానం, మైదానం ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. కొబ్బరి, జీడి మామిడి తోటలు దారుణంగా నాశనమయ్యాయి. టెక్కలి డివిజన్‌లో మొగలి డొంకలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీంతో ఎలుగుబంట్లు, అడవి పందులు తలదాచుకునేందుకు మార్గాలు లేక జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. వన్యప్రాణులు.. తమకు మనుషులు ఎక్కడ హాని తలపెడతారోనని ఎదురుదాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో మనుషులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఇలా చేయాలి
నీరున్న ప్రాంతాల్లోనే వన్యప్రాణుల సంచారం అధికంగా ఉంటుంది. ఇటీవల అడవులు, కొండల్లో నీరు లేకపోవడంతో వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. అందుకే అడవులు, కొండ ప్రాంతాల్లో చెలిమలు, చెక్ డ్యామ్‌లు, ఫైర్‌లైన్స్, సాసర్ పీట్లను ఏర్పాటు చేయాలి. నిఘా ఏర్పాటు చేస్తే వన్యప్రాణుల కదలికలను తెలుసుకోవచ్చు. వేసవిలో ట్యాంకర్లతో సాసర్లను నింపితే వన్యప్రాణుల దాహార్తిని తీర్చవచ్చు.
దృష్టి పెట్టాం
జిల్లాలో వన్యప్రాణుల కదలికలపై దృష్టిపెట్టాం. ఎక్కడైనా అటవీ జంతువులు, పక్షులు కనిపిస్తే సమాచారం అందించాలి. సోంపేట, మందస మండలాల్లో అడవిపిల్లి సంచరిస్తున్నట్టు గుర్తించాం. సత్వర చర్యలు చేపట్టాం. సీసీ కెమెరాలు బిగించాం. ప్రత్యేక వేటగాళ్లను సైతం రప్పించాం.
- ఏ.మురళీకృష్ణం నాయుడు, కాశీబుగ్గ రేంజ్ అధికారి